తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ,
కార్మిక సంఘాల జెఎసి ప్రకటన
ప్రజాపక్షం/హైదరాబాద్ గ్రామ పంచాయతీరాజ్ ఉద్యోగ, కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని, ప్రభుత్వం సానుభూతితో ఉన్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీనిచ్చిన నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా విరమించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ , కార్మిక సంఘాల జెఎసి ప్రకటించింది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, పారిశుధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ ,కార్మిక సంఘాల జెఎసి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి విధుల్లో చేరనున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు జెఎసి నేతలు లేఖ రాశారు. ఈ సమావేశంలో జెఎసి ఛైర్మన్ పాలడుగు భాస్కర్(సిఐటియు), అడ్వయిజర్లు ఎం.డి.యూసుఫ్(ఎఐటియుసి), కె.సూర్యం(ఐఎఫ్‌టియు), ప్రధాన కార్యదర్శి ఎన్.యజ్ఞనారాయణ్(టిజికెబియు), రాష్ట్ర కన్వీనర్లు పి.శివబాబు(ఐఎఫ్‌టియు), చాగంటి వెంకటయ్య(సిఐటియు),బి.వెంకటరాజం(ఎఐటియుసి),అరుణ్‌కుమార్(ఐఎఫ్‌టియు), ఎన్.దాసు(ఐఎఫ్‌టియు), జెఎసి నాయకులు వడ్డెబోయిన వెంకటేశం(టిజికెబియు) పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో మాజీ ఎంఎల్‌ఎ జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎంఎల్‌సి సీతారాములు సమక్షంలో చర్చలు జరిగాయని, ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని జెఎసి నాయకులు తెలిపారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుధ్య నిర్వహణలో వారి శ్రమను వెలకట్టలేమని, న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉన్నదని మంత్రి ఎర్రబెల్లి తెలిపారని జెఎసి నేతలు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక డిమాండ్లలో ఆర్థికేతర డిమాండ్లు కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియామకం, ఇఎస్‌ఐ, పిఎఫ్, ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు, 8గంటల పని, వారాంతపు ,పండగ సెలవులు ఇలా అనేకవాటిని సమ్మె విరమించిన వెంటనే తమ పరిధిలోని డిమాండ్లను పరిష్కరిస్తామని, ఆర్థిక పరమైన డిమాండ్లు జిఒ నంబర్ 60 ప్రకారం వేతనాల పెంపు, మల్టీపర్సన్ వర్కర్ విధానం,పర్మినెంట్,రిటైర్‌మెంట్ బెనిఫిట్, తదితర కీలక డిమాండ్లను సిఎంతో మాట్లాడి సానుకూలంగా పరిష్కరిస్తామని హామీనిస్తూ, అప్పటి వరకు సమ్మెను విరమించాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఙప్తి చేసినట్టు జెఎసి నేతలు తెలిపారు. త్కాతాలికంగా సమ్మె విరమిస్తున్నట్టు జిల్లా కలెక్టర్లకు, డిపిఒలకు రాతపూర్వకంగా తెలియజేసి, విధుల్లో చేరాలని జెఎసి నేతలు తెలిపారు మంత్రి పరిధిలోని అంశాలను సత్వరమే పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కాగా గడిచిన 34 రోజులుగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు సమ్మె నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని జెఎసి ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు నిర్వహించారు.
జిపి కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ
RELATED ARTICLES