రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ప్రజాపక్షం / హైదరాబాద్ హైదరాబాద్ నగరానికి తాగు నీరందించే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయ పరివాహక ప్రాంతాల పరిధిలోని 84 గ్రామాలపై జిఒ 111 కింద విధించిన ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జీఒ 69ని విడుదల చేసింది. దీంతో జంట జలాశయాల ఎఫ్‌టిఎల్ నుండి పది కిలో మీటర్‌ల పరిధిలోని 84 గ్రామాలలో 1.32 లక్షల ఎకరాల పరివాహక ప్రాంతంలో ఆంక్షలు తొలగిపోనున్నాయి. దీంతో గ్రామాలలో కాలుష్య పరిశ్రమలు, పెద్ద హోటళ్ళు, నివాస కాలనీలు, కాలుష్యం వెదజల్లే ఇతర కంపెనీల నిర్మాణంపై జిఒ 111 కింద పాతికేళ్ళకు పైగా కొనసాగుతున్న నిషేధానికి చెల్లు చీటి ఇచ్చినట్లయింది. 1996లో జారీ చేసిన జిఒ 111 ను ఎత్తివేస్తామని శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. దానికి అనుగుణంగా ఛీఫ్ సెక్రెటరీ హైపవర్ కమిటీని నియమిస్తామని తెలిపారు. ఆ కమిటీ మార్చి 31న నివేదిక ఇవ్వగా, ఏప్రిల్ 12వ తేదీన క్యాబినెట్ ఆమోదించింది. అదే రోజున జిఒ 111 కింద 84 గ్రామాల్లో ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ సిఎస్ సోమేశ్ కుమార్ సంతకంతో జిఒ 69 జారీ అయింది. జిఒ 111 జారీ చేసిన సమయంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుండి హైదరాబాద్ నగరానికి సంబంధించి 27.56 శాతం నీటి అవసరాలు తీరేవని , కాని ప్రస్తుతం వాటి ద్వారా 1.25 శాతం కంటే తక్కువ మాత్రమే సరఫరా జరుగుతుందని, కాబట్టి
ఈ జలాశయాలు ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా చేసే వనరుగా ఏ మాత్రం లేవని తాజా జిఒలో పేర్కొన్నారు. దీంతో నీటి అవసరాల కోసం హైదరాబాద్ నగరం ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లపై ఏ మాత్రం ఆధారపడి లేదని, కాబట్టి లోతుగా పరిశీలించి 1996 మార్చి 8న జారీ చేసిన జిఒ 111లోని మూడవ పేరా కింద విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు జిఒ 69లో తెలిపారు.అదే సమయంలో రెండు జలాశయాల నీటి నాణ్యత విషయంలో తేడా రాకుండా చర్యలు తీసుకోవాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు జలాశయాల నీటి నాణ్యతను మెరుగుపరిచేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్‌టిపి) ఏర్పాటు, శుద్ధి చేసిన నీటిని జలాశయాలకు మళ్ళించకుండా డైవర్షన్ కాలువల నిర్మాణం, భూగర్భ జలాల నిర్వహణ,వ్యవసాయం చేసిన నీరును జలాశయాల్లో కలవకుండా తగ్గించడం, ఇంకా ఇతర చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించనట్లు వివరించారు.
మార్గదర్శకాల కోసం కమిటీ ఏర్పాటు ః
అంక్షలను ఎత్తివేసిన తరువాత తీసుకునే చర్యలపై అమలుకు మార్గదర్శకాలు, పూర్తిస్థాయి వివరాలను రూపొందించేందుకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియస్తున్నట్లు జిఒలో పేర్కొన్నారు. ఇందులో సభ్యులుగా మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వాటర్ వర్క్ ఎండి, కాలుష్య నియంత్రణా మండలి సభ్య కార్యదర్శి, హెచ్‌ఎండిఎ ప్లానింగ్ డైరెక్టర్ ఉంటారు. ఈ కమిటీ రెండు జలాశయాల నాణ్యతను కాపాడే ప్రాథమిక లక్ష్యంతో పని చేయాలని, సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరింది. అలాగే 8 విధి విధానాలను నిర్దేశించి, వాటిపై నివేదిక ఇవ్వాలని పేర్కొంది. విధి విధానాల్లో గ్రీన్‌జోన్ సహా జోన్‌ల ఏర్పాటుకు విస్తృత మార్గదర్శకాలు సూచించడం, ట్రంక్ మౌలిక వనరుల అభివృద్ధికి సూచనలు ఇవ్వడం, ఎస్‌టిపి, రోడ్లు, మళ్ళింపు కాలువల తదితర మౌలిక సదుపాయాలకు వనరుల సేకరణ, ఈ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు సరైన సంస్థాగత నిబంధనలు, అభివృద్ధి నియంత్రణకు సూచనలు, ఈ ప్రాంతాల్లో లే అవుట్ లేదా భవన నిర్మాణ అనుమతులిచ్చేందుకు చేయాల్సిన నిబంధనలు, ఎస్‌టిపిలు సరైన ప్రదేశాలలో ఉండడం, మళ్ళింపు కాలువలు, జలాశయాల్లో శుద్ధి నీటిని వదల కుండా చర్యలకు సంబంధించిన విధివిధానాలు, ఈ ప్రాంతంలో అవసరమైన మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధుల సమీకరణకు మార్గాలను సూచించడం వంటివి ఉన్నాయి.
జిఒ 111 కింద విధించిన ఆంక్షలు ఎత్తివేత
RELATED ARTICLES