HomeNewsBreaking Newsజింఖానా మైదానంలో తొక్కిసలాట

జింఖానా మైదానంలో తొక్కిసలాట

క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల ‘క్యూ’ వద్ద ఉద్రిక్తత
20 మందికి గాయాలు
ఏడుగురికి ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స
ప్రజాపక్షం / హైదరాబాద్‌
భారత్‌- మ్యాచ్‌ టికెట్ల విక్రయాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో గురువారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈనెల 25వ తేదీన (ఆదివారం) ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌- మ్యాచ్‌కు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సిఎ) జింఖానా గ్రౌండ్స్‌లో టికెట్ల విక్రయాలను చేపట్టింది. అయితే ఈ టికెట్ల కొనుగోలుకు వేలాదిగా క్రికెట్‌ అభిమానులు విద్యార్థులు, మహిళలు సహా మెట్రో రైల్వే స్టేషన్‌ వరకూ బారులు తీరారు. ఒకదశలో పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు క్రికెట్‌ అభిమానుల ‘క్యూ’ ను నియంత్రించే క్రమంలో అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పడంతో పలువురు గాయాలపాలయ్యారు. ఈ తొక్కిసలాటలో 20 మందికి గాయాలయ్యాయి. ఏడుగురిని చికిత్సకోసం యశోద హాస్పిటల్‌కు తరలించారు. కొందరు మహిళలు ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు. తోపులాటలో చాలామంది ఆర్తనాదాలు చేశారు. తోపులాటలో కొందరి షర్ట్‌ చిరిగిపోయాయి. చెప్పులు తెగిపోయాయి. పోలీసులు కూడా భారీ సంఖ్యలో అక్కడ చేరుకుని టికెట్ల కొనుగోలు సందర్భంగా తోపులాటను నియంత్రించే క్రమంలో లాఠీఛార్జీ చేయడంతో వారి లాఠీ దెబ్బలనుంచి తప్పించుకునేందుకు క్రికెట్‌ అభిమానులు పరుగులుతీశారు. ఈ తోపులాటలో 45 ఏళ్ల ఒక మహిళ స్పృహ తప్పి కింద పడిపోయారు. పరిస్థితిని గమనించి అక్కడికి పరుగున వచ్చిన బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ నవీన ఆమహిళను జనంలోంచి బయటకులాగి ఊపిరి అందని స్థితిలో ఉన్న బాధిత మహిళకు సిపిఆర్‌ చేశారు. మహిళను కాపాడారు. అక్కడి జనం మహిళా కానిస్టేబుల్‌ నవీన సమయస్ఫూర్తిని, మానవత్వాన్ని, విధినిర్వహణలో అంకితభావాన్ని ప్రశంసించారు. ఉదయం 10 గంటలకు టికెట్లు ఇస్తారని తెలిసి తెల్లవారుజామున 3గంటల నుంచి క్రికెట్‌ అభిమానులు జింఖానా మైదానం వద్ద క్యూకట్టారు. అయితే ప్రకటించిన సమయానికి కూడా హెచ్‌సిఏ టికెట్ల విక్రయాలను ప్రారంభించలేదని పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా అభిమానులు క్రికెట్‌ కొనుగోలుకోసం తరలివస్తారని తెలిసినా సరైన ఏర్పాట్లు, జాగ్రత్త చర్యలు వహించలేదని వారు ఆరోపణలు చేశారు. తొక్కిసలాట ఘటనకు హెచ్‌సిఏ, పోలీసులు కారణమని క్రికెట్‌ అభిమానులు ఆరోపించారు. మహిళలకోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయలేదని పలువురు మహిళా క్రికెట్‌ అభిమానులు హెచ్‌సిఏపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments