బాల్యవివాహాల్లో దేశంలోనే మొదటిస్థానం
కేంద్ర హోంశాఖ శాంపిల్ సర్వే వెల్లడి
రాంచీ: దేశంలో బాల్యవివాహాలు అతి ఎక్కువగా జరుగుతున్న ది జార్ఖండ్ రాష్ట్రంలోనే. ఆ రాష్ట్రంలో అభంశుభం తెలియని పసిమొగ్గ వయసులోనే బాలికల మెడకు తాళి ఉచ్చు బిగుసుకుంటోంది. చేతబడులు వంటి క్షుద్ర విద్యలతో కునారిల్లిపోతున్న జార్ఖండ్ రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య కూడా పెచ్చుమీరుతోంది. దేశంలో అత్యధికశాతం బాల్య వివాహాలు జార్ఖండ్‌లోనే నమోదవుతున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వశాఖ చేసిన శాంపిల్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. బాలికలు నిర్ణీత వయసులో వికసించకముందుగానే వారికి వివాహాలు చేస్తున్నారు. ఈ వివాహా లు 5.8 శాతంగా నమోదైనట్లు సర్వే వెల్లడించింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ రిజిస్ట్రార్ జనరల్ కమిషనర్ ఈ విషయం వెల్లడించారు. “బాలికల వయసు 18 ఏళ్ళు నిండకముందే వివాహాలు చేస్తున్నారు. జాతీయస్థాయిలో ఈ వివాహాల సగటు 1.9 శాతంగా ఉండగా, కేరళలో 0.0గా నమోదైంది. జార్ఖండ్‌లో 5.8 శాతంగా నమోదైంది. జార్ఖండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఈ బాల్య వివాహాలు అత్యధికంగా 7.3 శాతంగా నమోదవుతున్నాయి. అర్బన్ ప్రాంతాలలో మూడుశాతంగా నమోదవుతున్నాయి. 2020లో నిర్వహించిన ఈ సర్వే నివేదిక గతనెలాఖరున ప్రచురితమైంది. దేశంలో ముఖ్యంగా జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రెండింటిలోనే సగానికి పైగా మహిళలు పసిమొగ్గలుగా ఉండగానే వివాహబంధంతో ముడిపడి తమ వ్యక్తిగత సామాజిక వికాసాన్ని కోల్పోతున్నారు. పశ్చిమబెంగాల్‌లో 21 ఏళ్ళ వయసుకు ముందుగానే 54.9 శాతం యువతులకు వివాహాలు చేస్తుండగా, జార్ఖండ్‌లో 54.6 శాతంమందికి వివాహాలవుతున్నాయి. ఈ వివాహాల జాతీయ సగటు 29.5 శాతంగా నమోదైంది. అదేవిధంగా, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం జార్ఖండ్‌లో చేతబడులు వంటి కుద్రవిద్యల అభియోగాలవల్ల ఇప్పటివరకూ 111 మంది మరణించారు. ఈ క్షుద్రవిద్యల అభియోగాలతో 2015లో 32 మంది, 2016లో 27 మంది, 2017లో 19 మంది, 2018లో 18 మంది, 2019,2020లో 15 మంది మరణించారు. జార్ఖండ్‌లో ఇటీవల ఒక మైనర్ బాలిక ఒక యువకుడితో శారీరక సంబంధాన్ని తిరస్కరించినందుకుగాను ఆ బాలికలను యువకుడు సజీవదహనం చేశాడు. ఈ ఘటనతో జార్ఖండ్‌లో జరుగుతున్న అమానుషాలు ఏ స్థాయిలో ఉన్నాయో మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టు 23న బాలిక నిద్రస్తుండగా కిటికీలోంచి పెట్రోలు పోసి నిపు అంటించడంతో ఆ బాలిక సజీవదహనమైంది. కాగా దుంక్మాలో పెళ్ళిపేరుతో 14 ఏళ్ళ గిరిజన బాలికను ఒక యువకుడు లైంగికంగా దోచుకున్నాడు. సెప్టెంబరు 2న ఆ బాలికను చెట్టుకు ఉరివేసి చనిపోయి ఉండగా కనుగొన్నారు.బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారని బాలిక తల్లి రోదిస్తున్నది. నిందితుణ్ణి అరెస్టు చేశారు. ఈ రెండు ఘటనలు జాతీయ మహిళా కమిషన్, జాతీయ బాలల హక్కుల కమిషన్ సీరియస్‌గా పరిగణించాయి. ఇలాంటి కారణంగానే ఢిల్లీలో కూడా ఒక టీనేజ్ బాలికపై తాజాగా యాసిడ్ దాడి జరిగింది. మైనర్ బాలికలపై అఘాయిత్యాలు ప్రేమ పేరుతో పెరిగిపోతూ ఉండటంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది.
జార్ఖండ్ బాలికల మెడకు తాళి ఉచ్చు!
RELATED ARTICLES