న్యూఢిల్లీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో 81 నియోజకవర్గాలకు నవంబరు 30 నుంచి డిసెంబరు 20 వరకు మొత్తం 5 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 23న ఫలితాలు వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునిల్ అరోడా తెలిపారు. 81 నియోజకవర్గాలకు నవంబర్ 30, డిసెంబర్ 7,12,16,20న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. తొలి దశలో 13 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 30న, రెండో దశలో 20 నియోజకవర్గాలకు డిసెంబరు 7న,మూడో దశలో 17 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు 12న, నాలుగో దశలో 15 నియోజకవర్గాలకు డిసెంబరు 16న, ఐదో దశలో 16 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లో కి వస్తుందని సునిల్ అరోడా వెల్లడించారు.నక్సల్స్ ప్రభా వం ఉన్న 67 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రత్యే క భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను కూడా 20శాతం పెంచుతామన్నారు. మొత్తం 19 జిల్లాల్లో 13 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత జిల్లాలుగా ఇసి గుర్తించింది. రాష్ట్రంలో 2.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది. మొదటి దశ పోలింగ్‌కు ఈనెల 6న నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలో 2014 లో నూ ఐదు దశల్లో పోలింగ్ జరిగింది.గిరిజనులు అత్యధికంగా ఉన్న జార్ఖండ్‌లో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తిరిగి అధికారం నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూ నియన్‌తో కలిసి బిజెపి 43 సీట్లలో గెలిచి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిజెపి ఒక్కటే 37 స్థానాల్లో విజయం సాధించింది. అంతకుముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా(జెఎంఎం) గత ఎన్నికల్లో కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌కు 8 సీట్లు మాత్రమే రావడం గమనార్హం. ఇటీవలే మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన విషయం తెలిసిందే. అయితే రెండు రాష్ట్రాల్లోనూ బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ గతంకంటే సీట్లు తగ్గాయి.
సరికొత్త రికార్డును నెలకొల్పిన జార్ఖండ్ సిఎం : జార్ఖండ్ సిఎం రఘువర్ దాస్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. జార్ఖ్‌ండ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి ఐదేళ్లు సిఎంగా కొనసాగి సరికొత్త రికార్డును నెలకొల్పారు. 2014 డిసెంబర్ 28న సిఎంగా ప్రమాణం చేసిన రఘువీర్… అప్పటి నుంచి సిఎంగా ఐదేళ్లూ కొనసాగారు. గిరిజనేతరుడైనా సిఎంగా కొనసాగడం గమనించాల్సిన అంశం. 2000 సంవత్సరంలో ఏర్పడ్డ జార్ఖండ్ మొదటి ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ. ఆ తర్వాత అర్జున్ ముండా సిఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2005లో బిజెపి 30 సీట్లను సంపాదించుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది.
జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల భేరి
RELATED ARTICLES