చంద్రయాన్ చరిత్రాత్మక విజయం
దక్షిణధృవంపై కాలుమోపిన తొలిదేశం మనదే
ఇక అంతరిక్ష రంగంలో ఇస్రో సరికొత్త పాత్ర
బెంగళూరు : భారతదేశ కీర్తిప్రతిష్టలు ఇనుమడించేలా చంద్రయాన్ చరిత్రాత్మక విజయం సాధించింది. అనుకున్న సమయానికి అనుకున్నవిధంగా జాబిల్లిపై చంద్రయాన్ ఎంతో సున్నితంగా కాలుమోపి సువర్ణ అధ్యాయాన్ని భారతకాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా నాలుగు చక్రాల రోవర్‌ను చంద్రుడిమీదకు చేర్చింది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగిడిన మొట్టమొదటి దేశంగా ప్రపంచంలో భారతదేశం రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలతోపాటు 140 కోట్లమంది భారత ప్రజలు ఎంతో ఉత్కంఠ భరితంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపడాన్ని వీక్షించి సంబురాలు చేసుకున్నారు. అదే సమయంలో బ్రిక్స్ సమావేశంలో పాల్గొంటున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోహన్నెస్‌బర్గ్ నుండి విక్రమ్ ల్యాండర్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. తన జీవితం ధన్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఏ దేశం కూడా వెళ్ళని ప్రదేశానికి భారతదేశ అంతరిక్ష నౌక చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ప్రశంసలు కురిశాయి. 41 రోజులపాటు చంద్రయాన్ ప్రయాణం చేసింది. ఈ క్రమంలో 19 సార్లు భూమిచుట్టూ పరిభ్రమించి గ్రావిటీ పద్ధతిలో ఇంధనాన్ని ఆదాచేసుకుని క్రమంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. 14 రోజులపాటు నాలుగు చక్రాల రోవర్ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేస్తుంది. చంద్రుడిపై నీటి జాడలు, మంచు ఉందా? అనే విషయాలు పరిశీలిస్తుంది. యావత్ దక్షిణ ధృవం తీరుతెన్నులను శోధిస్తుంది. ఈ విజయంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రపంచంలో నాలుగు దేశాల సరసన చేరింది. నాలుగేళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను పట్టుదలతో ఇస్రో సాకారం చేసుకుంది. చంద్రయాన్- మిషన్‌లో తుది అంకాన్ని దిగ్విజియంగా పూర్తి చేసి భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. ఇప్పటివరకు అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ మాత్రమే చందమామపై
సాఫ్ట్ ల్యాండింగ్ సాధించగా తాజాగా విక్రమ్ ల్యాండర్ విజయంతో భారత్ వాటి సరసన చేరిది. దీంతో ఇస్రో ఖ్యాతిని విశ్వవాప్తమైంది.
జులై 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం ఎం4 వాహకనౌక చంద్రయాన్- విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు చంద్రయాన్ కక్ష్యను పెంచారు. అయిదోసారి భూకక్ష్య పెంపు పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి చంద్రయాన్ ని ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్య తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు. ఆగస్టు 17న ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ‘ల్యాండర్ మాడ్యూల్’ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించింది. ఆ తర్వాత రెండుసార్లు డీ- బూస్టింగ్ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్‌ను జాబిల్లి ఉపరితలానికి దగ్గర చేశారు.
బుధవారం సాయంత్రం 5 గంటల 44 నిమిషాలకు ల్యాండర్ మాడ్యూల్ చంద్రునిపై దిగేందుకు నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంది. చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ ప్రారంభమైంది. ఎఎల్‌ఎస్ కమాండ్‌ను స్వీకరించిన వెంటనే ల్యాండర్ మాడ్యూల్ తన వేగాన్ని తగ్గించుకుంటూ ముందుకెళ్లింది. చివరి 17 నిమిషాల సంక్షిష్ట ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న విక్రమ్ ల్యాండర్ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు జాబిల్లిపై అడుగు వేసింది. గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన వ్యోమనౌక నిమిషాల వ్యవధిలోనే తన వేగాన్ని తగ్గించుకుని చందమామ దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగింది. బెంగళూర్‌లోని మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ నుంచి చంద్రయాన్- ల్యాండింగ్ ఈవెంట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు.
పదిహేనేళ్ల క్రితం చంద్రుడిపై నీరు ఉందని వెల్లడించి విశ్వపరిశోధనల్లో కొత్త శ్వాస నింపిన భారత్.. ఇప్పుడు చంద్రయాన్- తో ఎవరూ చూడని ’దక్షిణ’ జాడల్ని ప్రపంచానికి చూపించింది. ఇటీవల భారత్ కంటే ముందు చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌కు యత్నించి రష్యా విఫలమవగా ఇస్రో మాత్రం జయకేతనం ఎగురవేయడం వల్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులు, జవాన్లు సంతోషం వ్యక్తం చేశారు. పలు విద్యాలయాల్లో చంద్రయాన్ ప్రత్యక్ష ప్రసారాలను ప్రత్యేకంగా విద్యార్థులకోసం ఏర్పాటుచేయగా, యావత్ భారతీయులూ విక్రమ్ ల్యాండర్ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించి మురిసిపోయారు.
మహత్తరమైన క్షణాలు : రాష్ట్రపతి ముర్ము
చంద్రయాన్ చివరిదశ 17 నిమిషాల ప్రయాణం ఎంతో ఉత్కంఠభరితమైనదని, దేశానికి ఇవి మహత్తరమైన, అత్యంత ప్రాముఖ్యంగల క్షణాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. చంద్రయాన్ ప్రత్యక్ష ప్రసారం తిలకించిన రాష్ట్రపతి పైవిధంగా వ్యాఖ్యానించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి మహత్వపూర్ణ ఘట్టం సంభవిస్తుందనారు. చంద్రయాన్ ప్రయాణంలో దేశంలోని ప్రతిఒక్కరూ అనుసంధానమై ఎంతో ఆనందించారని రాష్ట్రపతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై పాదం మోపిన మహత్తరఘట్టం ప్రత్యక్ష ప్రసారం పూర్తయిన వెంటనే రాష్ట్రపతి ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాభినందనలు తెలిజేస్తూ ఒక వీడియో సందేశం పంపించారు. చరిత్రలో మనకు ఎన్నో విజయాలు సాధించిన రోజులు ఉన్నాయి, ఈనాడు ఇస్రో ఘన విజయం సాధించిన రోజు, చంద్రయాన్ మిషన్ చంద్రుడిపై విజయవంతగా కాలుమోపిన రోజు, మన శాస్త్రవేత్తలు కేవలం చరిత్రమాత్రమే సృష్టించలేదు, భూగోళ శాస్త్ర భావనను పునఃసృష్టించారు ఇది నిజంగా ఒక మహత్వపూర్ణమైన ఘట్టం అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. “భారతదేశానికి ఈ విధమైన గర్వకారణ ఘట్టం జీవితంలో ఒక్కసారి మాత్రమే సంభవిస్తుంది, నేను ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి, ఈ గొప్ప సాహసఘట్ట నిర్వహణలో భాగం పంచుకున్న ప్రతిఒక్కరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను, భవిష్యత్‌లో ఇంకా మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను” అని రాష్ట్రపతి ఆ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ద్రౌపదీముర్ము ప్రస్తుతం గోవాలో అధికారిక పర్యటనలో ఉన్నారు. చంద్రయాన్ విజయం యావత్ మానవాళికీ ఒక అతిపెద్ద విజయమని అన్నారు. ఆధునిక శాస్త్రజ్ఞానంతోపాటు మానవవాళికి సేవలు అందించే పారంపర్యంగా వచ్చిన గొప్ప సంప్రదాయ విజ్ఞానం భారతదేశంలో ఏ విధంగా నిక్షిప్తమై ఉందో మానవాళికి ఈ రూపేణా తెలియజేసింది” అని పేర్కొన్నారు.
జాబిల్లిపైభారత్ జెండా
RELATED ARTICLES