27న ఫలితాలు ప్రకటించి 40 రోజుల తరువాత ఎంపిపి, జడ్‌పి చైర్మన్ల ఎన్నిక చేపడితే అనర్థాలు ఏర్పడుతాయి
రాష్ట్ర ఎన్నికల సంఘానికి అఖిలపక్షం వినతి
ప్రజాపక్షం / హైదరాబాద్ : మండల పరిషత్ అధ్యక్ష్యులు, జడ్‌పి చైర్మన్ల ఎంపికలో జాప్యం వద్దని అఖిలపక్షం నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, జనసమితి నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో టిపిసిసి అధ్యక్ష్యులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీమంత్రి షబ్బీర్ అలీ, జి.నిరంజన్, పొన్నం ప్రభాకర్, టిడిపి రాష్ట్ర అధ్యక్ష్యులు ఎల్.రమణ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్, తెలంగాణ జనసమితి నాయకులు ప్రొఫెసర్ పిఎల్.విశ్వేశ్వర్‌రావ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్ష్యులు చెరుకు సుధాకర్ తదితరులు ఉన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికల ఫలితాలు మే 27న ప్రకటించి దాదాపు 40 రోజుల తర్వాత మండల పరిషత్ అధ్యక్షులు, జడ్‌పి చైర్మన్ల ఎన్నికలు చేపడితే చాలా అనర్థాలు చోటు చేసుకుంటాయన్నారు. అధికార పార్టీ టిఆర్‌ఎస్ కు ఇతర పార్టీలకు చెందిన సర్పంచ్ నుంచి మొదలుకొని ఎంపిల వరకు లోబర్చుకొని తమ వైపుకు అనైతిక పద్ధతుల్లో తిప్పుకోవడం అలవాటైందన్నారు. ఇప్పుడు కూడా ఎంపిపి, జడ్‌పి చైర్మన్ల ఎన్నిక విషయంలో అదే విధమైన తీరుకు పాల్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. బ్లాక్‌మని, పోలీసులను ఉపయోగించుకుని ఇతర పార్టీ నాయకులను అప్రజాస్వామిక పద్ధతితో తమ పార్టీలో చేర్చుకుంటున్నారని తెలిపారు. మే 27న కౌం టింగ్ చేసి మూడు రోజుల్లోనే ఎంపిపి, జడ్‌పి చైర్మన్ల ఎంపిక పూర్తి చేయాలని వారు కోరారు. ప్రస్తుత ఎంపిపి, జడ్‌పి చైర్మన్ల కాలపరిమితి ముగిశాకే జూలై 5 తర్వాత వీరికి బాధ్యతలు అప్పగించాలన్నారు. చట్టాల పట్ల కెసిఆర్‌కు గౌరవం లేదని, కొత్తగా ఎంపికైన ఎంపిటిసి, జడ్‌పిటిసిలను ప్రలోభాలకు గురిచేస్తారన్నారు. 40 రోజుల వ్యవధి ఇవ్వడం వల్ల మొత్తం 538 ఎంపిపిలను, 32 జడ్‌పి చైర్మన్లను టిఆర్‌ఎస్ గెలిచే అవకాశం ఉంటుందన్నారు. మే 27 కౌంటింగ్ చేప ట్టి, మూడు రోజుల్లో ఎంపిపి, జడ్‌పిచైర్మన్ల ఎం పిక చేయడం సాధ్యం కాకపోతే ఎంపిటిసి, జడ్‌పిటిసి కౌంటింగ్‌ను వాయిదా వేసి జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో నిర్వహించి అనంతరం ఎంపిపి, జడ్‌పి చైర్మన్ల ఎంపిక చేపట్టాలని వారు కోరారు. జూలైలో పురపాలక ఎన్నికలు పెడతామంటున్నారని, ఇప్పటికే గత 11నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వం లేదన్నారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్ముక్కయ్యాయని ఆరు ఆరోపించారు.