నేడు హస్తినలో బిజెపియేతర నేతల భేటీ
‘సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్’ పేరిట సమావేశం
అధ్యక్షత వహించనున్న చంద్రబాబునాయుడు
ప్రజాపక్షం/హైదరాబాద్/అమరావతి : జాతీయ స్థాయిలో ప్రజాకూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు చక్రం తిప్పే పనిలో పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, సిపిఐలతో ఏర్పడిన ప్రజాఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా లేకపోయినా, ఈ కాన్సెప్ట్ విజయవంతం కావడంతో చంద్రబాబు, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్‌గాంధీలు జాతీయ స్థాయిలో ఇదే తరహా ప్రజాఫ్రంట్ ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం నాడు పలు బిజెపియేతర రాజకీయ పార్టీల అధినేతలు భేటీ కానున్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశం సందర్భంగానే ఈ నేతల భేటీ కూడా జరుగుతుంది. మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై టిడిపిపి చర్చించనుంది. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు, రాష్ట్ర సమస్యలు.. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకుంటూ ఇచ్చిన నీతి ఆయోగ్ లేఖను పార్లమెంట్లో టిడిపి ఎంపీలు ప్రస్తావించనున్నారు. టిడిపిపి సమావేశానంతరం ఈ ప్రజాఫ్రంట్ జాతీయ సమావేశం జరుగుతుంది. బిజెపియేతర పక్షాలతో చంద్రబాబు జరిపే ఈ సమావేశం దేశ రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నదని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, ఈ సమావేశానికి కేరళ, పంజాబ్, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్, కర్ణాటక సిఎంలకు చంద్రబాబు ఆహ్వానం పంపారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ, యూపిఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ హాజరుకానున్న ఈ భేటీకి టిడిపి అధినేత చంద్రబాబు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చైర్మన్ ఫరూక్ అబ్దుల్లా, లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీ అధినేత శరద్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్, ఆ పార్టీ అగ్రనేత అఖిలేష్ యాదవ్, బిఎస్‌పి జాతీయ అధ్యక్షురాలు మాయావతితో పాటు డిఎంకె, సిపిఐ, సిపిఐ(ఎం) నేతలు పాల్గొననున్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, మోడీ విధానాలపై చర్చ జరగనున్నట్టు సమాచారం. అంతేకాకుండా, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, తెలంగాణలో ప్రజాకూటమి ఏర్పాటు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్’ పేరుతో బిజెపియేతర పక్షాలు ఏకమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ర్యాలీలు, సభలు నిర్వహణ, భవిష్యత్ కార్యచరణలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ కార్యాచరణే సమీప భవిష్యత్‌లో జాతీయ ప్రజాఫ్రంట్ ఏర్పాటుకు నాందికాగలదని టిఎంసి వర్గాలు తెలిపాయి. అలాగే వచ్చే నెల కోల్‌కతాలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగే అతిపెద్ద సమావేశం గురించి కూడా ఈ సమావేశంలో ప్రస్తావించనున్నట్లు తెలిపాయి.
జాతీయ స్థాయిలో ప్రజాకూటమి!
RELATED ARTICLES