భారీ వర్షాలు, వరదలపై కేంద్రానికి సిపిఐ రాష్ర్ట కార్యవర్గ సమావేశం డిమాండ్
ప్రజలకు, రైతులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి
ప్రజాపక్షం / హైదరాబాద్ రాష్ర్టంలో కనీవిని ఎరుగని రీతిలో ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించిన భారీ వర్షాలు, వరదలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ రాష్ర్ట కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. జాతీయ విపత్తు సహాయ నిధి, రాష్ర్ట విపత్తు సహాయ నిధి మార్గదర్శకాల ప్రకా రం వరదలతో నష్టపోయిన ప్రజానీకానికి, రైతులకు వెంటనే ఆర్థిక సహాయం అందజేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో సిపిఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అధ్యక్షతన సోమవారం జరిగిన సిపిఐ రాష్ర్ట కార్యవర్గ సమావేశం తీర్మానం చేసిం ది. ఈ సమావేశంలో భారీ వర్షాలు, వరదలపై చర్చ జరిగింది. గత రెండు వారాలుగా రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయని, పెద్ద సంఖ్యలో పట్టణాలు, గ్రామాలు నీట మునిగిపోవడంతో వేల సంఖ్యలో కుటుంబాలు ఇళ్ళతో పాటు సర్వం కోల్పోయాయని సిపిఐ పే ర్కొంది. లక్షల ఎకరాలు నీరు చేరడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాలలో అతిభారీ వర్షాలు, వరదలతో ప్రజలు, రైతులు విపత్కర పరిస్థితుల్లోకి నెట్టబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అదిలాబాద్ జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలలో పంటలు సోయా, పత్తి, మొలకెత్తె దశలోనే నష్టపోయిందని, కరీంనగర్ జిల్లాలో ఇసుకమేటలతో తిరిగి పంటలు వేసుకునే దశ కూడా కనిపించడం లేదని, పోటెత్తిన వరదలతో కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాలలో గ్రామాలకు గ్రామాలు మునిగిపోయాయని ఒక పత్రికా ప్రకటనలో సిపిఐ వివరించింది.
కాళేశ్వరం పంపుహౌస్‌ల మునకపై నిపుణుల కమిటీ వేయాలి కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పంపు హౌస్‌లు నీటి మునిగిన ఘటన, నిర్మాణ పటిష్టతపై ప్రజల్లో భయాందోళన, సందేహాలను లేవెనెత్తాయని సిపిఐ రాష్ట్ర కార్యవర్గం పేర్కొంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు రాష్ర్ట ప్రభుత్వం తక్షణమే నిపుణుల కమిటీని నియమించాలని డిమాండ్ చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. వరదల కారణంగా పంటలు, స్థిర, చరాస్తూల నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి బాధితులకు పరిహారం ఇవ్వాలని, దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేసింది. పంట పొలాల్లో నిలిచిన నీటిని తొలగించి, తిరిగి విత్తనాలు నాటుకోవడానికి ఎకరాకు రూ. 15 వేలు చొప్పున సహాయం చేయాలని, కూరగాయలతోపాటు పండ్ల తోటలు పత్తి, మిర్చి పంటలకు ఎకరాకు రూ.40 వేలు చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేసింది. జులై 27వ తేదీ వరకు భారీ వర్షాలు, వరదలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడిస్తూ మూడోసారి విపత్తు గురించి హెచ్చరిక చేసిందని గుర్తు చేసింది. ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ రాష్ర్ట కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఏర్పాటు చేస్తున్న శిబిరాలలో సరిపడ మంచి ఆహారం, నీరు, దుస్తులు, దుప్పట్లు, వైద్య సహాయం ఏర్పాటు చేయాలని కోరింది
జాతీయ విపత్తుగా ప్రకటించండి
RELATED ARTICLES