HomeNewsBreaking Newsజాతీయ రాజకీయాల్లో పెనుమార్పు

జాతీయ రాజకీయాల్లో పెనుమార్పు

అందరినీ కలుపుకొని బిజెపిపై పోరాటం
సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
అమరావతి:
దేశానికి ఒక దశ, దిశా నిర్దేశంగా సిపిఐ 24వ జాతీయ మహాసభలు నిలవనున్నాయని, జాతీయ రాజకీయాల మార్పునకు మహాసభలు ఎంతో కీలకం కానున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్‌ కె.నారాయణ, సిపిఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. మహాసభలకు దేశ, విదేశాల నుంచి వామపక్ష, లౌకికవాద, ప్రజాతంత్ర పార్టీల ప్రముఖులు హజరుకానున్నారని తెలిపారు. విజయవాడలోని ‘గురుదాస్‌ దాస్‌గుప్త్తా నగర్‌’ ప్రాంగణం (ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌) లో గురువారం మహాసభల ఆహ్వాన సంఘం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో డాక్టర్‌ నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులలో జరుగుతున్న ఈ మహాసభలు అత్యంత కీలకం కానున్నాయన్నారు. బిజెపి చర్యల వల్ల దేశంలో అసలు రాజ్యాంగం ఉంటుందా? మనుగడ సాగిస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సిపిఐ ఒక్కటే బిజెపిని ఓడిస్తుందని చెప్పడం లేదని, కలిసివచ్చే వామపక్ష, లౌకికవాద, ప్రజాతంత్ర పార్టీలతో కలిసి బిజెపిపై పోరాటం చేస్తామన్నారు. టిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర్‌రావు ఇటీవల వరకు బిజెపికి అనుకూలంగా ఉన్నారని, ఇప్పుడు వారికి వ్యతిరేకంగా పార్టీ పెట్టారని నారాయణ పేర్కొన్నారు. బిజెపికి ఎవరు వ్యతిరేకంగా పోరాటం చేసినా తాము సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. రాష్ట్రాలను ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం అణిచి వేస్తోందని విమర్శించారు. దేశంలోని వామపక్ష, లౌకిక ప్రజాతంత్ర శక్తులంతా ఏకమై రానున్న ఎన్నికల్లో మోడీని గద్దె దించేందుకు మహాసభలు ఒక వేదిక కానున్నాయని పేర్కొన్నారు. అటు ప్రాంతీయ పార్టీలు, బిజెపియేతర శక్తులు సైతం ఐక్యంగా ముందుకు సాగి మోడీ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు
చేయాలని, కేంద్రంలోని బీజేపీని గద్దె దించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాలను మార్చేలా సిపిఐ జాతీయ మహాసభలు కీలకం కానున్నాయని, మహాసభలకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారనికె.రామకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం సభ్యులు, సిపిఐ రాష్ర్ట సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు మనోహర్‌నాయుడు, పార్టీ నాయకులు చలసాని అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments