పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలపై చర్చలు జరిపిన ఎపి, తెలంగాణ సిఎంలు
కాళేశ్వరం నిర్మాణానికి రావాల్సిందిగా జగన్‌కు కెసిఆర్ ఆహ్వానం
ప్రజాపక్షం/హైదరాబాద్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. ఈనెల 21 జరగనున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సిఎంను ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే సోమవారం విజయవాడలోని ఎపి సిఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లిన కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రావాలని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా, తన నివాసానికి విచ్చేసిన కెసిఆర్, కెటిఆర్ సహా టిఆర్‌ఎస్ ముఖ్య నేతలకు ఎపి ముఖ్యమంత్రి జగన్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు మధ్యాహ్న భోజనం ఆరగించారు. ఆ తర్వాత జరిగిన కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఆస్తుల పంపకాలు, జల వివాదాలు తదితర ముఖ్య అంశాలపై చర్చించినట్టు సమాచారం. సుమారు గంటన్నరకు పైగా కొనసాగిన ఈ భేటీలో అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై ఇద్దరు సిఎంలూ చర్చించారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ప్రభుత్వరంగ సంస్థల విభజనపై దృష్టి పెట్టారు. అలాగే, విద్యుత్ ఉద్యోగుల విభజన, విద్యుత్ బకాయిల పరిష్కారంపైనా చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపైనా సమాలోచనలు జరిపారు. విభజన చట్టంలోని పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపైనా సానుకూల వాతావరణంలో ఇద్దరు సిఎంలు చర్చించినట్టు సమాచారం. కృష్ణా, గోదావరి జలాల విషయంలో కోర్టులకు, ట్రైబ్యునళ్లకు వెళ్లేందుకు ఆస్కారం లేకుండా అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని ఇరువురు నేతలు ఈ భేటీలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 24న ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శుల సమావేశం హైదరాబాద్‌లో ఉంది. ఈ భేటీలో జలవివాదాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా, సిఎం కెసిఆర్ విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కెసిఆర్ వెంట టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి.రామారావు, మాజీ ఎంపి వినోద్‌కుమార్, ఎంపి.సంతోష్‌కుమార్, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.