నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులను వెనక్కి తిప్పి పంపిన రాష్ట్ర పోలీసులు
డ్యామ్ వద్ద కొనసాగుతున్న బందోబస్తు
ప్రజాపక్షం / నల్లగొండ ప్రతినిధితెలుగు రాష్ట్రాల మధ్య రెండు రోజుల నుంచి జల యుద్ధం జటిలమవుతుంది. జలవిద్యుత్ ఉత్పాదన నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఉత్పాదన చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వాలు పట్టుబట్టాయి. మొదటి నుంచి ఇరు రాష్ట్రాల మంత్రులు , ప్రజా ప్రతినిధుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎలాగైనా ఉత్పాదనను అడ్డుకునేందుకు ఆంధ్రా సర్కార్ ప్రయత్నా లు సాగిస్తుంది. అందులో భాగంగానే గురువారం తెలంగాణ జెన్‌కో చేస్తున్న విద్యుత్ ఉత్పాదనను ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నతాధికారులు తెలంగాణ అధికారులను కలిసేందుకు సరిహద్దుల మీదుగా వచ్చేందుకు ప్రయత్నించినా డ్యామ్ వద్ద తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి తిప్పి పంపారు. దీంతో నాయకుల మధ్య ఉన్న మాటల యుద్ధం ఒక్కసారిగా అధికారులను అడ్డగించే వరకు తీవ్ర స్థాయికి చేరింది. ఆంధ్రా అధికారులను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో అధికారులకు, పోలీసులకు మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువురి మధ్య ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా వుంటే ఆంధ్రా నుంచి తెలంగాణాకు వచ్చే ప్రతివాహనాన్ని ఇక్కడి పోలీసులు నిషితంగా పరిశీలించి అనుమతులు ఇస్తున్నారు. మరోవైపు కేవలం తెలంగాణ జెన్ కో అధికారులను మాత్రమే పోలీసులు విద్యుత్ ఉత్పాదన కేంద్రానికి అనుమతిస్తున్నారు.
660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత రెండు రోజులుగా జల వివాదం ముదురుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా విద్యుత్ ఉత్పాదనను కొనసాగిస్తుంది. ఓ వైపు టెన్షన్ వాతావరణం నెలకొన్నా మరోవైపు తెలంగాణ జెన్ కో అధికారులు విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో గురువారం 8 టార్బైన్‌లతో 660 మెగావాట్ల విద్యుత్‌ను తయారు చేశారు.
ఆంధ్రా అధికారులను అడ్డుకున్న పోలీసులు…
నాగార్జున సాగర్ వద్ద జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన నిలిపివేయాలంటూ ఎపి రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా ఎస్‌పి విశాల గున్ని, గురిజాల ఆర్‌డిఒ పార్థసారథి, నీటి పారుదల శాఖ ఎస్‌ఇ గంగరాజుతో పాటు పోలీసు అధికారులు ముకూమ్ముడిగా తెలంగాణ జెన్ కో అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి తరలివచ్చారు. ఎంపి నుంచి వచ్చే అధికారులకు ఎవరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వవద్దని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన అధికారులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కొద్ది సేపు వాదనకు దిగిన అధికారులు చేసేది ఏమీ లేక వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఎపి న్నతాధికారులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జెన్ కో అధికారులు జలాశయంలో నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు విద్యుత్‌ను తయారు చేయడం మూలనా దిగువన ఉన్న రైతాంగానికి సాగు, తాగునీరుకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రస్తుతం సాగర్, పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్‌ను తయారు చేయడం వల్ల నీరు వృథాగా పోయి సముద్రంలో కలుస్తుందన్నారు. అదే విధంగా శ్రీశైలంలో 834 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పాదనను చేయాలని పేర్కొన్నారు. అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 750 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం జరిగిందని, ప్రస్తుతం 826 అడుగుల నీటిమట్టం ఉన్నదని తెలంగాణ జెన్ కో అధికారులు పేర్కొంటున్నారు.
జల యుద్ధం
RELATED ARTICLES