ఇంకా వరదలోనే హైదరాబాద్ బస్తీలు, కాలనీలు
ప్రజాపక్షం/హైదరాబాద్ వరదలతో హైదరాబాద్ మహానగరంలో జనజీవనం అస్తవ్యవస్తంగా మారింది. పాతబస్తీతో సహా నగర శివార్లలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. కాలనీలు, ఇళ్లలో నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. శనివారం కురిసిన వర్షానికి బాలాపూర్, గుర్రం చెరువు కట్ట తెగిపోవడంతో పాతబస్తీలో చాలా ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. ఆదివారం కొంత తెరిపినిచ్చినా సోమవారం మళ్లీ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరో రెండు మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటిమిద కునుకులేకుండా పోతోంది. అర్ధరాత్రి వరద ఎక్కడ ముంచెత్తుతదోనని నిద్రపోకుండా జాగారాలు ఉంటున్నారు. పాతబస్తీలో సంతోష్‌నగర్, జూబైల్‌బస్తీ, చాంద్రాయణగుట్ట, తలాబ్‌కట్ట, నదీం కాలనీ, టోలీచౌకీ తదితర ప్రాంతాల్లో ఇంకా వరదనీరు తొలగిపోలేదు. ముంపు ప్రాంతాల్లోని బాధితులను అధికారులు పునరవాస కేంద్రాలకు తరలించారు. కొంతమంది ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇక శివారు ప్రాంతాల్లో చాలామంది ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. మీర్పేట్ పరిధిలో గొలుసుకట్టు చెరువులకు వరద ఉద్ధృతి పెరిగింది. కాలనీలు, రహదారులపై భారీగా వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించిపోయింది. వాన ముప్పు ఇంకా తొలగకపోవడంతో ముంపు బాధితులు ఆందోళన చెందుతున్నారు. పెద్దచెరువు, మంత్రాల, సందె చెరువులు నిండుకుండలా మారాయి. పదుల సంఖ్యలో కాలనీలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. బలహీనంగా ఉన్న మీర్‌పేట చెరువు కట్ట తెగే ప్రమాదం ఉండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజాప్రతినిధులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంత్రాలయం చెరువు నిండి దిగువకు భారీగా ప్రవాహం ఉండడంతో కాలనీ నీటమునిగింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వరద ఉద్ధృతి ధాటికి ఓ ఇల్లు జలపాతాన్ని తలపిస్తోంది. వెనుక భాగం నుంచి వస్తున్న నీళ్లు ఇంట్లో కెళ్లి బయటకు పొంగి పొర్లుతోంది. ఇంట్లో నడుములోతు నీళ్లు చేరడంతో బియ్యం, సరుకులు, సామగ్రి, పిల్లల పుస్తకాలు తడిసిపోయాయి. మరికొన్ని వస్తువులు బయటికి కొట్టుకుపోయాయి. ముంపు భయంతో సొంతింటిని వదిలి వెళ్లాల్సి వస్తోందంటూ బాధితులు కంటతడిపెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇలా నగరంలోని మల్కాజిగిరి, అల్వాల్, ఇసిఐఎల్, ఉప్పల్, ఎల్.బి.నగర్, సరూర్‌నగర్, కొత్తపేట్, సికింద్రాబాద్, వారసిగూడ, చిలకలగూడ, నాగమయ్యకుంట, కవాడిగూడ అరుధంతినగర్, సబర్మతినగర్, బేగంపేట్, ప్రకాష్ నగర్, బ్రాహ్మణ్ వాడి ప్రాంతాలు వరద ముప్పుతో సతమతమవుతున్నారు.
నీటిలో తేలియాడుతున్న మృతదేహం
చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వరద ముంపునకు గురైన కాలనీలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అసలు అతను ఎలా మరణించాడు? ఏ ప్రాంత వాసి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్న నేపథ్యంలో అలుజుబైల్ కాలనీలో నీటిలో తెలియాడుతున్న ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
మరోసారి విరుచుకుపడిన వర్షం…
వదర ముంపు నుంచి తేరుకోక ముందే సోమవారం మరోసారి వర్షం విరుచుకుపడింది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్, బాలాపూర్, అబిడ్స్, అఫ్జల్‌గంజ్, కోఠి, ఎం.జె మార్కెట్, పురానాపూల్, సికింద్రాబాద్, ఇసిఐఎల్, తార్నాక, మల్కాజిగిరి, నేరేడ్‌మెంట్, నాంపల్లి, బషీర్‌బాగ్, సుల్తాన్ బజార్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్‌లలో భారీ వర్షం కురిసింది. ఇంకా వరద నీటిలోనే 200 కాలనీలు ఉన్నట్లు అంచనా. వరద కష్టాల నుంచి ఇంకా బయటపడకముందే మళ్లీ భారీ వర్షం పడడంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు.
తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణకు మరోసారి భారీ వర్షం పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు సోమ, మంగళ, బుధవారాల్లో అనేక చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు.
జలదిగ్బంధంలోనే…
RELATED ARTICLES