HomeNewsBreaking Newsజలం కాదు... విషం

జలం కాదు… విషం

ప్రజాపక్షం/కొత్తగూడెం నీళ్ళు ప్రాణం పోస్తాయి.. కానీ, అక్కడ మాత్రం అవే విషమవుతున్నాయి. ఆ నీళ్ళు తాగిన వారు ఆస్పత్రుల్లో చేరాల్సిందే. ఇదీ సింగరేణి రుద్రంపూర్‌ ప్రాంతంలోని పది ప్రాంతాల పరిస్థితి. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలం రుద్రంపూర్‌ ప్రాంతంలోని గోపు ఏరియా, నాల ఏరియా, ధన్‌బాద్‌, ఎన్‌సి, ఎంహెచ్‌ క్వార్టర్స్‌, వేల్ఫేర్‌ సెంటర్‌, మార్కెట్‌ ఏరియా, ఎర్రగడ్డ, రుద్రంపూర్‌, గౌతంపూర్‌ కాలనీల్లో వెయ్యికిపైగా సింగరేణి కార్మిక కుటుంబాలు, మరో 500 కార్మికేతర కుటుంబాలు నివసిస్తున్నాయి. 75 శాతం మేర సింగరేణి యాజమాన్యం కేటాయించిన క్వా ర్టర్లల్లో కార్మిక కుటుంబాలే జీవిస్తున్నాయి. ఈ కాలనీలకునీటి సరఫరాతోపాటు, విద్యుత్‌, పారిశుద్ధ్యం నిర్వహణ బాధ్యత సింగరేణి యాజమాన్యానిదే. ఈ పది కాలనీలకు సింగరేణి సంస్థ సివిల్‌ విభాగం పరిధిలోని ఫిల్టర్‌ బెడ్‌ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తుంటారు. ఫిల్టర్‌బెడ్‌ నిర్వహణ లోపం, నిర్లక్ష్యం కారణంగా ఫిల్టర్‌బెడ్‌లో పాకురు పట్టి నీరంతా పచ్చరంగులోకి మారింది. ఫిల్టర్‌ బెడ్‌ మధ్యలోనే పిచ్చి చెట్టు ఏపుగా పెరిగి నీటిని కలుషితం చేస్తున్నా పట్టించుకున్న నాథడే కరువయ్యాడు. కలుషిత నీరు సరఫరా కావడంతో వాటిని తాగిన వారు విషజ్వరాలు, వాంతులు, విరోచనాల బారిన పడుతున్నారు. ఇక గత్యంతరం లేని పరిస్థితిలో కార్మిక కుటుంబాలు మినరల్‌ వాటర్‌ కొనుగోలు చేసి దాహర్తిని తీర్చుకుంటూ సింగరేణి సరఫరా చేస్తున్న నీటిని ఇంటి అవసరాలకు వాడుతున్నారు. మరోవైపు పైపులైన్ల లీకేజీలు ఏర్పడి నీరు వృథా అవుతున్నప్పటికీ అరికట్టే చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. ఇప్పటికైనా సింగరేణి ఉన్నతాధికారులు స్పందించి కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని, కార్మిక కుటుంబాల ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధత అధికారులపై చర్యలు తీసుకోవాలని కార్మిక కుటుంబాలు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలి
కార్మిక వాడలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని, నెలల తరబడి ఫిల్టర్‌బెడ్‌లను శుభ్రం చేయకపోవడం వల్ల తాగునీరు కలుషిమై సరఫరా అవుతుందని, ఆర్థిక స్థోమత ఉన్న వారు మినరల్‌ వాటర్‌ను వినియోగిస్తుండగా కార్మికేతర పేద కుటుంబాలు అపరిశుభ్రమైన నీటిని వినియోగిస్తూ రోగాల బారిన పడే పరిస్థితి ఏర్పడుతోందని వర్కర్స్‌ యూనియన్‌ ఏరియా కార్యదర్శి జి.వీరస్వామి అన్నారు.
ఫిల్టర్‌బెడ్‌ నిర్వహణలో నిర్లక్ష్యం వీడాలి
కార్మిక వాడలకు తాగునీటిని సరఫరా చేసే ఫిల్టర్‌బెడ్‌ల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని చుంచుపల్లి వైఎస్‌ ఎంపిపి వి.మల్లిఖార్జున్‌రావు తెలిపారు. నెలల తరబడి ఇసుక మార్పుచేయకపోవడం, నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వల్లే పిచ్చి మొక్కలు పెరిగి నీరు కలుషితంగా మారుతోందన్నారు. సుమారు 15 వేల కుటుంబాలకు తాగునీటిన సరఫరి చేస్తున్న ఫిల్టర్‌బెడ్‌ నిర్వహణ, పిచ్చిమొక్కలు పెరగడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోందన్నారు. –

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments