ప్రజాపక్షం / హైదరాబాద్ : దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను, ప్రత్యేకించి ఢిల్లీలో సిఎఎ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను కవర్ చేసేందుకు వెళ్ళిన జర్నలిస్టులపై జరిగిన దాడులను ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాల్సిన తక్షణ ఆవశ్యకతను సూచిస్తున్నాయని పేర్కొంది. లక్నోలో ఫిబ్రవరి 29, మార్చ్ 1వ తేదీల మధ్య జరిగిన ఐజెయు జాతీయ కార్యవర్గ సమావేశం చేసిన తీర్మానాలు, నిర్ణయాలను ఐజెయు అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి, సెక్రెటరీ జనరల్ బల్వీందర్ సింగ్ జమ్ము మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలో పలు ప్రాంతాల్లో తరచుగా ఇంటర్‌నెట్ సేవలకు అంతరాయం కలిగించడాన్ని ఐజెయు కార్యవర్గం ఖండించింది. ఢిల్లీలో హింసకు పాల్పడిన ఒక వర్గానికి చెందిన బృందాలు పలువురు జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, ముగ్గురిని తీవ్రంగా గాయపరచడం, పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియాలకు చెందిన పలువురు వర్కింగ్ జర్నలిస్టులను మతమేమిటో నిరూపించుకోవాలని కోరడం పట్ల ఐజెయు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇంటర్‌నెట్ ప్రాథమిక హక్కు అని, జమ్మూ కశ్మీర్‌లో తక్షణమే ఇంటర్‌నెట్ సేవలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కేవలం పాక్షికంగా పునరుద్ధరించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసంది.
హైవేలో జర్నలిస్టులకు మినహాయింపు
వార్తలను సేకరించే విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై ప్రయాణం చేసే జర్నలిస్టులకు టోల్ గేట్ టాక్స్ నుండి మినహాయింపు ఇవ్వాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను కోరుతూ ఐజెయు కార్యవర్గం తీర్మానం చేసింది. అలాగే వర్కింగ్ జర్నలిస్టుల చట్టం,1955ను వెనక్కితీసుకుని, వర్కింగ్ జర్నలిస్టులను , ఇతర వార్తా పత్రిక ఉద్యోగులను లేబర్ కోడ్, వేజ్ కోడ్ పరిధిలోకి తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఐజెయు తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ప్రతిపాదన ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు చట్ట ప్రకారం లభించిన ప్రత్యేక హక్కులు, రక్షణను కేంద్ర ప్రభుత్వం పక్కనబెట్టినట్లయిందని తీర్మానంలో పేర్కొంది. తక్షణమే వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని పునరుద్ధరించాలని ఐజెయు డిమాండ్ చేసింది. ఫిబ్రవరి 29న ఐజెయు కార్యవర్గ సమావేశాలను ప్రారంభించిన ఉత్తర్‌ప్రదేశ్ న్యాయ శాఖ మంత్రి బ్రజేశ్ పాఠక్ వర్కింగ్ జర్నలిస్టుల చట్టం పునరుద్ధరించే అంశాన్ని సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు కె.శ్రీనివాస్‌రెడ్డి, బల్వీందర్ సింగ్ జమ్ము ప్రకటనలో తెలిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల వేతన సవరణకు కొత్త వేతన బోర్డును నియమించాలని ఐజెయు జాతీయ కార్యవర్గం డిమాండ్ చేసింది.
కలిసి పోరాడుదాం : ఇటీవల విచ్ఛిన్నకర శక్తుల కారణంగా దుష్ప్రభావానికి లోనైన పలువురు తిరిగి యూనియన్ మార్గంలోకి వచ్చారని, అలాగే ఆ మార్గంలో వెళ్ళిన మిగతా వారు కూడా ఐజెయు కుటుంబంలోకి తిరిగి రావాలని ఐజెయు కార్యవర్గం కోరింది. దాడులకు గురవుతున్న పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇతర ప్రజాస్వామిక హక్కుల పరిరక్షించే ఉమ్మడి లక్ష్యం కోసం శక్తివంచన లేకుండా పోరాడేందుకు కలిసిరావాలని పిలుపునిచ్చింది. ఐజెయు అధ్యక్షులుగా కె.శ్రీనివాస్‌రెడ్డి, సెక్రెటరీ జనరల్‌గా బల్వీందర్ సింగ్‌లను గుర్తిస్తూ, బైటికి వెళ్ళిన వారి అభ్యర్థననను తిరస్కరిస్తూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రూలింగ్‌ను ఐజెయు కార్యవర్గ సమావేశం స్వాగతించింది.
జర్నలిస్టుల చట్టం
RELATED ARTICLES