బాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
తొలిసారి థామస్ కప్ కైవసం
రూ. కోటి నజరానా ప్రకటించిన కేంద్రం
బ్యాంకాక్: భారత బాడ్మింటన్ వీరులు సరికొత్త చరిత్రను లిఖించారు. ప్రతిష్టాత్మకమైన థామస్ కప్ టోర్నమెంట్ టైటిల్‌ను తొలిసారి అందించారు. సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టారు. బాడ్మింటన్ పురుషుల టీం ఈవెంట్‌గా జరిగే థామస్ కప్‌ను గెల్చుకోవడం ప్రపంచ కప్ కంటే ఎక్కువ ఆనందాన్నిస్తుంది. ఈసారి ఒక్కో అడుగు ముందుకేస్తూ, అనూహ్యంగా ఫైనల్ చేరిన
భారత్ అదే ఒరవడిని కొనసాగించింది. గతంలో 14 పర్యాయాలు విజేతగా నిలిచిన ఇండోనేషియాను ఓడించి మొట్టమొదటిసారి థామస్ కప్‌ను కైవసం చేసుకుంది. భారత విజయ పరంపరలకు 20 ఏళ్ల యువ ఆటగాడు లక్ష్యసేన్ పునాది వేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన ఏషియన్ గేమ్స్ టైటిల్ విజేత ఆంథొనీ సినిసుక గింటింగ్‌ను ఢీకొన్న లక్ష్యసేన్ తొలి సెట్‌ను 8 21 తేడాతో చేజార్చుకున్నాడు. అయితే, ఆతర్వాత ఎదురుదాడికి దిగాడు. గింటింగ్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైనప్పటికీ, మిగతా రెండు సెట్లను 21 17, 21- 16 తేడాతో కైవసం చేసుకొని, ఇండోనేషియాపై భారత్‌కు 1 0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కొనసాగించే బాధ్యతను డబుల్స్ జోడీ సాత్విక్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి స్వీకరించారు. వీరు కూడా అసాధారణ పోరాటతత్వాన్ని కనబరచి, ఇండోనేషియాకు చెందిన మహమ్మద్ అసన్, కెవిన్ సంజయ సుకముల్జో జోడీపై 18 21, 23 21, 21 19 తేడాతో విజయభేరి మోగించారు. దీనితో భారత్ 2 0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరో సింగిల్స్ మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 21 15, 23 21 ఆధిక్యంతో జొనాతన్ క్రిస్టీని ఓడించడంతో భారత్ విజేతగా నిలిచింది. థామస్‌కప్‌ను కైవసం చేసుకుంది. ఇలావుంటే, థామస్ కప్‌ను తొలిసారి కైవసం చేసుకున్న జట్టుకు కోటి రూపాయల నజరానా ఇస్తున్నట్టు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించిందని, థామస్ కప్ గెలవడం పట్ల యావద్దేశం సంతోషంగా ఉందని ఆయన ఒక ప్రకటనలో ప్రశంసించారు. భవిష్యత్‌లోనూ మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై ఎన్నో విజయాలను సాధిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వారు సాధించిన అపూర్వ విజయానికి కానుకగా కోటి రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ కూడా భారత థామస్ కప్ జట్టును ట్విట్టర్ వేదికగా అభివర్ణించారు. ఈ విజయం వర్ధమాన ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత్ మరిన్ని ఘన విజయాలను సాధించి, ఎన్నో మైలురాళ్లను చేరుకుంటుందన్న నమ్మకం తనకు ఉందని అన్నారు.
జయహో భారత్
RELATED ARTICLES