HomeNewsBreaking Newsజయహో భారత్‌..

జయహో భారత్‌..

విజృంభించిన ఝులన్‌, శిఖా.. రాణించిన మంధనా
రెండో వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్‌ గెలుపు
2-1 సిరీస్‌ కైవసం
ఐసిసి మహిళల చాంపియన్‌షిప్‌
ముంబయి: భారత మహిళా క్రికెట్‌ జట్టు మరోసారి తమ సత్తా చాటుకుంది. పటిష్టమైన ఇంగ్లాండ్‌తో సొంత గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2 కైవసం చేసుకుంది. ఇటీవలే న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించి వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా అదే జోరును స్వదేశంలోనూ కొనసాగించింది. బౌలర్లు, బ్యాట్స్‌వుమెన్‌లు కలిసికట్టుగా రాణించడంతో ఇక్కడ పర్యాటక ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. మొదట భారత బౌలర్లు ఝులన్‌ గోస్వామి (4/30), శిఖా పాండే (4/18) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ (43.3 ఓవర్లలో) 161 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్‌లో నటాలీ సీవర్‌ (85) ఒక్కటే ఒంటరి పోరాటం చేసింది. అనంతరం సల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాలో స్మృతి మంధనా (63; 74 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), మిథాలీ రాజ్‌ (47 నాటౌట్‌), పూనమ్‌ రౌత్‌ (32)లు రాణించారు. దీంతో భారత్‌ 41.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఇదే వేదికపై గురువారం జరగనుంది.
ఆరంభంలోనే షాక్‌..
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు భారత పేసర్లు చుక్కలు చూపెట్టారు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌ఉమెన్స్‌పై విరుచుకుపడ్డారు. మొదట్లో ఓపెనర్‌ ఆమీ జోన్స్‌ (3)ను శిఖా పాండే ఆవుట్‌ చేసి ఇంగ్లాండ్‌ పతనాన్ని ఆరంభించింది. దీంతో ఇంగ్లాండ్‌ 5 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ కొద్ది సమయానికే పస్ట్‌ డౌన్‌గా వచ్చిన వికెట్‌ కీపర్‌ సారా టేలర్‌ (1)ను ఝులన్‌ గోస్వామి క్లీన్‌ బౌల్డ్‌ చేసి ఇంగ్లాండ్‌కు మరో షాకిచ్చింది. తర్వాత మరో మూడు పరుగుల వ్యవధిలోనే ఇంగ్లాండ్‌ సారథి హేధర్‌ నైట్‌ (2)ను ఝులన్‌ అద్భుతమైన బంతితో పెవిలియన్‌ పంపించింది. దీంతో ఇంగ్లాండ్‌ 6.1 ఓవర్లలో 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గత మ్యాచ్‌లో రాణించిన కెప్టెన్‌ ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమవడం ఇంగ్లాండ్‌ను పెద్ద షాక్‌కు గురిచేసింది. అనంతరం మరో ఓపెనర్‌ టామీ బియోమంట్‌, నటాలీ సీవర్‌ ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే మరోవైపు సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. వీరు నాలుగో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించిన అనంతరం శిఖా పండే తెలివైన బంతితో ఈ భాగస్వామ్యాన్ని విడదీసింది. దీంతో కుదురుగా ఆడుతున్న ఓపెనర్‌ టామీ బియోమంట్‌ 42 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి పెవిలియన్‌ చేరింది. తర్వాత వచ్చిన లౌరెన్‌ విన్‌ఫీల్డ్‌తో కలిసి నటాలీ ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. వీరు ఐదో వికెట్‌కు మరో కీలక భాగస్వామ్యాన్ని ఏర్పర్చుతూ ముందుకు వెళ్లారు. వీరు ఆచితూచి ఆడుతూ సింగిల్స్‌, డబుల్స్‌లతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు కొడుతూ పరుగులు రాబట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదకరంగా మారిని ఈ జోడీని పూనమ్‌ యాదవ్‌ అద్భుతమైన బంతితో విడదీసింది. దీంతో 49 పరుగుల ఐదో వికెట్‌ కీలక భాగస్వామ్యానికి తెరపడింది. ధాటిగా ఆడుతున్న లౌరెన్‌ 49 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసి వెనుదిరిగింది.
మరోసారి చెలరేగారు..
ఇక ఈ సమయంలో భారత బౌలర్లు మరోసారి చెలరేగి బౌలింగ్‌ చేశారు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌వుమెన్‌లను వచ్చినట్టే పెవిలియన్‌ దారి చూపెట్టారు. వీరి ధాటికి జార్జియా ఎల్వీస్‌ (0), కాథెరినా బ్రంట్‌ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. ఈ రెండు వికెట్లను శిఖా పాండే తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇంగ్లాండ్‌ 95 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకుంది. ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపునటాలీ మాత్రం అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌ను ఆదుకుంది. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి వేగంగా పరుగులు సాధించింది. ఈ క్రమంలోనే నటాలీ 78 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకొని జట్టుకు అండగా నిలిచింది. మరోవైపు భారత బౌలర్లు వరుసక్రమంలో వికెట్లు తీస్తూ పోవడంతో చివరికి ఇంగ్లాండ్‌ 43.3 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైపోయింది. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన నటాలీ సీవర్‌ (85; 109 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) చివరి వికెట్‌గా పెవిలియన్‌ చేరింది. ఈమె చివరి వికెట్‌కు అలెక్స్‌ హార్ట్‌లీ (0)తో కలిసి 42 పరుగులు జోడించడం విశేషం. భారత బౌలర్లలో ఝులన్‌ గోస్వామి, శిఖా పాండే చెరో 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించారు. మరోవైపు పూనమ్‌ యాదవ్‌ రెండు వికెట్లు దక్కించుకుంది.
మెరిసిన మంధనా, పూనమ్‌..
అనంతరం 162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో రాణించిన జెమీమా రొడ్రిగ్స్‌కు రెండో వన్డే కలిసి రాలేదు. ఈ మ్యాచ్‌లో జెమీమా (0) ఖాతా తెరువకుండానే పెవిలియన్‌ చేరింది. దీంతో భారత్‌ ఒక్క పరుగు వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది. ఈ సమయంలో మరో ఓపెనర్‌ స్మృతి మంధనా, పూనమ్‌ రౌత్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ చక్కనైన బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఆరంభంలో కుదురుగా ఆడినా తర్వాత పరుగుల వేగాన్ని పెంచారు. తొలి వన్డేలో స్లోగా ఆడిన మంధనా ఈసారి దూకుడు ప్రదర్శించింది. మొదటి నుంచే బలమైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. మరోవైపు సమన్వయంతో ఆడుతున్న పూనమ్‌ మంధనాకు స్ట్రయిక్‌ రొటెట్‌ చేస్తూ అండగా నిలిచింది. ఈ క్రమంలోనే టీమిండియా 12.2 ఓవర్లలో 50 పరుగుల మార్కును పూర్తి చేసుకుంది. అనంతరం జట్టు స్కోరు 74 పరుగుల వద్ద కుదురుగా ఆడుతున్న పూనమ్‌ రౌత్‌ (32; 65 బంతుల్లో 4 ఫోర్లు)ను ఎల్వీస్‌ తెలివైన బంతితో స్టంప్‌ ఔట్‌ చేయించింది.
మిథాలీ దూకుడు..
ఈ సమయంలో క్రీజులో అడుగు పెట్టిన భారత సారథి, సీనియర్‌ బ్యాటర్‌ మిథాలీ రాజ్‌ దూకుడుగా ఆడింది. ఈమెకు మంధనా జతవడంతో టీమిండియా వేగంగా పరుగులు సాధించింది. ఒకవైపు మంధనా.. మరోవైప మిథాలీ ఇంగ్లాండ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అవకాశం దొరికినప్పుడు బౌండరీలు కొడుతూ పరుగుల వేగం తగ్గకుండా చూసుకున్నారు. ఈ క్రమంలోనే ధాటిగా ఆడుతున్న మంధనా 59 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ నమోదు చేసుకుంది. మరోవైపు టీమిండియా కూడా 25.5 ఓవర్లలో 100 పరుగుల మార్కును పూర్తి చేసింది. అనంతరం కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్న మంధనా 74 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 63 పరుగులు చేసి వెనుదిరిగింది. దీంతో భారత్‌ 140 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. వీరిద్దరూ ఈ వికెట్‌కు 66 పరుగులు జోడించి భారత్‌కు విజయానికి చేరువ చేశారు. తర్వాత మిగిలిన లక్ష్యాన్ని కెప్టెన్‌ మిథాలీ (47 నాటౌట్‌; 69 బంతుల్లో 8 ఫోర్లు) అజేయంగా ఉండి పూర్తి చేసింది. దీంతో భారత్‌ 41.1 ఓవర్లలో 162/3 పరుగులు చేసి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఫలితంగా టీమిండియాకు 7 వికెట్ల ఘన విజయం దక్కింది. దీప్తి శర్మ (6 నాటౌట్‌) మిథాలీకి అండగా ఉంది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఆన్య ష్రబ్‌సోల్‌కి రెండు వికెట్లు లభించగా.. జార్జియా ఎల్వీస్‌కి ఒక వికెట్‌ దక్కింది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments