నల్లగొండ -వరంగల్- ఖమ్మం నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి జయసారథిరెడ్డి
హైదరాబాద్ – రంగారెడ్డి -మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి కె. నాగేశ్వర్
వామపక్షాల సంఘీభావం
ప్రజాపక్షం / హైదరాబాద్ త్వరలో ఎన్నికలు జరగనున్న రెండు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో భాగంగా నల్లగొండ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి జయసారథిరెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్న ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌కు మద్దతునిస్తున్నట్లు వామపక్షాలు ప్రకటించాయి. వీరిరువురికి మద్దతునివ్వాలని సిపిఐ, సిపిఐ(ఎం), ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్‌బ్లాక్, ఎస్‌యుసిఐ(సి), సిపిఐ (ఎంఎల్ లిబరేషన్)లు నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయాన్ని మఖ్దూంభవన్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు చాడ వెంకట్‌రెడ్డి (సిపిఐ), తమ్మినేని వీరభద్రం(సిపిఐ(ఎం), మురహరి(ఎస్‌యుసిఐ (సి)), జానకిరాములు (ఆర్‌ఎస్‌పి), ప్రసాద్ (ఫార్వర్డ్ బ్లాక్)లు వెల్లడించారు. ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా అభ్యర్థిని బరిలో నిలిపేందుకు చివరి వరకు ప్రయత్నం చేశామని, ఏకాభిప్రాయం రాకపోవడంతో వామపక్షాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. మీడియా సమావేశంలో సిపిఐ అభ్యర్థి జయసారథిరెడ్డిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పరిచయం చేశారు.
చట్టసభల్లో వామపక్షాల లోటు స్పష్టం : చాడ
శాసనసభ, శాసనమండలిలో వామపక్షాల గొంతులేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నదని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. దీంతో వాస్తవ ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదన్నారు. అందుకే ప్రజల సమస్యలు ప్రతిబింబించేలా అభ్యర్థులను బరిలో దిం పాలని వామపక్షాలు అవగాహనకు వచ్చాయన్నా రు. టిడిపి, టిజెఎస్, ఇంటి పార్టీ,ఇతరులతో కలిసి ఆదివారం ఎస్‌వికె భవన్‌లో కొంత కసరత్తు చేశామని, అయితే ఏకాభిప్రాయం రాలేదని వివరించా రు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, సిఎం కెసిఆర్ ఇస్తామని ప్రకటించిన నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులరైజ్ కాకపోవడంతో వారి బతుకులు చితికిపోతున్నాయన్నారు. రెండు నియోజకవర్గాల్లో పట్టభద్రులంతా తమ ఓట్లను నమోదు చేసుకొని, వామపక్షాలు బలపరిచిన మాజీ ఎంఎల్‌సి ప్రొఫెసర్ నాగేశ్వర్, జయసారథిరెడ్డిలకు మద్దతునివ్వాలని చాడ విజ్ఞప్తి చేశారు. వామపక్షాలు మద్దతునిస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఓటర్ల నమోదుతో పాటు ప్రచార కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు చెప్పారు. తొలుత 16న నల్లగొండ, 17న వరంగల్, 18న ఖమ్మంలో ప్రచార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇందులో ఆరు వామపక్ష పార్టీల నేతలు పాల్గొంటారని చెప్పారు. ఆ తరువాత హైదరాబాద్ రంగారెడ్డి కార్యక్రమ వివరాలను ప్రకటిస్తామన్నారు.
కోదండరామ్ వైఖరి ఆశ్చర్యం : తమ్మినేని
ధర్నాచౌక్, సచివాలయం కూల్చివేత వంటి అంశాలపై కోదండరామ్, చెరుకు సుధాకర్, టిడిపిలతో కలిసి ఐక్యంగా పని చేశామని తమ్మినేని తెలిపారు. కలిసి ఉద్యమాలు చేసిన పార్టీలతో ఎంఎల్‌సి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసేందుకు ప్రయత్నించామన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అందరు కలిసి ఉమ్మడిగా పోటీ చేయాలని అంగీకరానికి వస్తే, కోదండరామ్‌కు కాంగ్రెస్ మద్దతునిస్తామంటే, తమ అభ్యర్థిని విరమించుకుంటామని సిపిఐ ప్రతిపాదన చేసిందని తెలిపారు. అయితే, తమకు కోదండరామ్ వైఖరి ఆశ్చర్యం కలిగించిందన్నారు. హైదరాబాద్ స్థానంలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు టిఆర్‌ఎస్ మద్దతిస్తుందని ప్రచారం జరుగుతున్నదని, అలాగైతే తాము మద్దతివ్వబోమని టిజెఎస్ చెప్పిందన్నారు. ఒకవేళ టిఆర్‌ఎస్ బలపరిచిందనుకుంటే బిజెపితోనే ప్రధాన పోటీ ఉంటుందని, అలాంటప్పుడు బిజెపి, నాగేశ్వర్‌లలో ఎవరికి మద్దతు ఇస్తారని తాము ప్రశ్నిస్తే, తమకు టిఆర్‌ఎస్ ప్రధాన శృతువు అని టిజెఎస్ నేతలు అన్నారని తెలిపారు. కోదండరామ్ ఈ సమావేశానికి వస్తామని రాలేదని, అయితే వారి రాజకీయ వైఖరి ఎలా ఉందో తెలియదని, తమకు మాత్రం దేశంలో ప్రధాన శృతవుగా భావిస్తున్న బిజెపి విషయంలో ఎలాంటి రాజీ ఉంబోదని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు, సిపిఐ అభ్యర్థి జయసారథికి సిపిఐ(ఎం) సంపూర్ణ మద్దతునిస్తుందని తమ్మినేని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు కదిలి, వారి గెలుపునకు పాటుపడతాయన్నారు. తెలంగాణ ప్రజలుకూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఉద్యమ శక్తులకే మద్దతు : మురహరి
ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిలిచిన ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌ను తాము ఉద్యమశక్తిగా గుర్తిస్తున్నామని, ఆయనకు మద్దతునిస్తున్నామని మురహరి తెలిపారు. అలాగే నల్లగొండ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఏకైక వామపక్ష పార్టీకి చెందిన సిపిఐ అభ్యర్థి జయసారథిరెడ్డికి ఎస్‌యుసిఐ(సి) తరుపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ఫాసిజం పెద్ద ఎత్తున ముంచుకొస్తున్నదని, కోర్టులు కూడా స్వతంత్రంగా లేని పరిస్థితి నెలకొన్నదన్నారు. అన్ని ప్రజాతంత్ర శక్తులను సర్వనాశనం చేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. తాము ఎన్నికలను కూడా ఉద్యమంగానే భావిస్తున్నామని, ఉద్యమ శక్తులన్నీ పోరాడాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
వీరిద్దరు పెద్దల సభకు అవసరం : జానకిరాములు
గతంలో ఎంఎల్‌సిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రజలు, విద్యార్థి, యువజనుల సమస్యలను ఏ ప్రభుత్వం ఉన్నా లేవనెత్తారని జానకిరాములు తెలిపారు. ఆయన మంచి మేధావి, దమ్మున్న వ్యక్తి అని కొనియాడారు. మతోన్మాద బిజెపిని ఎదుర్కొనడంలో ధీటైన వ్యక్తి అని అన్నారు. జయసారథిరెడ్డి వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి, జర్నలిస్టు అని తెలిపారు. వారిరువురు ప్రజల వాణిని వినిపించేందుక పెద్దల సభలో ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు.
ఫార్వర్డ్‌బ్లాక్ మద్దతు: ప్రసాద్
రెండు ఎంఎల్‌సి ఎన్నికల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు, సిపిఐ అభ్యర్థి జయసారథిరెడ్డికి సంపూర్ణ మద్దతునివ్వాలని ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్లు ప్రసాద్ తెలిపారు.
వామపక్షాల మద్దతు గర్వకారణం : అభ్యర్థి జయసారధిరెడ్డి
విపత్కర పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థిగా పోటీ చేయనుండడం గర్వకారణంగా ఉన్నదని జయసారథిరెడ్డి అన్నారు. తనకు మద్దతు ప్రకటించిన వామపక్ష పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సిపిఐ కుటుంబానికి చెందిన తాను గతంలో ప్రైవేటు ఉపాధ్యాయునిగా, 12 సంవత్సరాలు జర్నలిస్టుగా పని చేశానని చెప్పారు. చట్టసభకు ఎన్నికై ప్రజల గొంతుకను వినిపించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. టిఆర్‌ఎస్ ఉద్యమ కాలంలో అండగా నిలిచిన విద్యార్థులు, యువజనులు, మేధావులు, జర్నలిస్టులను నిరాశపరిచిందని, అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా విస్మరించిందన్నారు. వామపక్షాల మద్దతుతో ప్రజా వ్యతిరేక అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. మీడియా సమావేశంలో పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, టి.శ్రీనివాసరావు, వి.ఎస్.బోస్ (సిపిఐ), బి.వెంకట్, డి.జె.నర్సింహారావు(సిపిఐ(ఎం))లు పాల్గొన్నారు.
జయసారథిరెడ్డి, నాగేశ్వర్‌కు మద్దతివ్వండి
RELATED ARTICLES