సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ!
చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయన్న విపక్షాలు
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా లభించనుందా? ఈ ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారా? ఈ ప్రశ్నలకు విశ్వసనీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించేందుకు ప్రధాని మోడీ గురువారం ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో 8 పార్టీలకు చెందిన 14 మంది పాల్గొన్నా రు. పార్టీలకు అతీతంగా జాతీయ ప్రయోజనాల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని ఈ సమావేశంలో పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్ సమగ్రాభివృద్ధికి కేంద్రం కంకణం కట్టుకుందని అన్నారు. ‘దిల్లీకి దూరీ.. దిల్ కి దూరీ’ (కేంద్ర సర్కారుతో దూరం.. పరస్పర అవగాహనలో దూ రం) తొలగించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రజలు, ముఖ్యంగా యువత రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని కోరా రు. అన్ని రంగాల్లోనూ జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేంద్రం చేపడుతున్న చర్యలకు, తీసుకుంటున్న నిర్ణయాలకు ఈ సమావేశం మరింత ఊతమిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదాను కల్పించేందుకు డిలిమిటేషన్, ఎన్నికల ప్రక్రియలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ దిశగా ప్రధాని సానుకూ ల వైఖరితో ఉన్నారని ఆయన ట్వీట్ చేశారు. సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదాను కల్పించాలని కోరినట్టు చెప్పారు. మొత్తం ఐదు అంశాలను ప్రధాని ముందు అంశాలను ఉంచినట్టు చెప్పారు. కశ్మీరీ పండిత్‌లకు పునరావాసం కల్పించాలని కోరినట్టు తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నట్టు ప్రధాని చెప్పారని ఆజాద్ వివరించారు. కశ్మీర్ లోయలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఎన్నికలు నిర్వహించాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, జమ్మూ కశ్మీర్ ప్రజల భూ హక్కులకు భద్రత కల్పించాలని కోరినట్టు ఆజాద్ వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణను 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆతర్వాత కేం ద్రం ఆల్ పార్టీ సమావేశాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి. దీంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పట్లో జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. లఢఖ్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ పాలన కింద ఉంచాలని, జమ్మూకశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగించాలని తీర్మానించింది. అయితే, జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదాను ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల పక్ష సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నాకు తెలియదు.. మమత
కోల్‌కతా : జమ్మూకశ్మీర్‌పై కీలక అంశాల చర్చ కోసం గురువారం ప్రధాని నరేంద మోడీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం గురించి తనకు ఏమాత్రం తెలియదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బిజెపిని ప్రశ్నించినవారిని దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ, అందుకే తమకు సమాచారం ఇవ్వకపోయి ఉండవచ్చని వ్యాఖ్యానించారు. ఓ చానెల్ తెలిపిన వివరాల ప్రకారం, జమ్మూ-కశ్మీరుకు రాష్ట్ర హోదాను తొలగించడానికి కారణమేమిటో తనకు తెలియదని మమత అన్నారు. అధికరణ 370ని రద్దు అనేది భారత దేశానికి కళంకమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రపంచ వ్యాప్తంగా భారత దేశ ప్రతిష్ట దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేయడం సరైనదేనని ఆమె స్పష్టం చేశారు. కార్పొరేట్ రంగానికి దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ సర్కారు వైఖరిని తమ పార్టీ నిరసిస్తుందని అన్నారు.