రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటు
రాజ్యసభలో తీర్మానం, బిల్లులకు ఆమోదం పొందిన మోడీ సర్కారు
రాష్ట్రంలో దారిద్య్రానికి, అభివృద్ధి లేమికి ఆ వివాదాస్పద నిబంధనలే (ఆర్టికల్ 370) కారణమంటూ చర్చకు సమాధానమిస్తూ హోంమంత్రి అమిత్ షావ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు భయపడుతున్నట్లు అక్కడ ఏమి జరుగబోదని, కొసావో లాంటి యుద్ధ భూమిగా అది మారటాన్ని అనుమతించబోమన్నారు. “అది భూమిపై స్వ ర్గం అలాగే ఉంటుంది” అని హామీ ఇచ్చారు. “సాధారణ” పరిస్థితులు పునరుద్ధరణ అయినాక, “అనువైన సమయంలో” జమ్మూ పూర్తి రాష్ట్రస్థాయి పునరుద్ధరించబడుతుందని హామీ ఇచ్చా రు. ఆర్టికల్ 370, 35ఎ అమలులో ఉన్నంతకాలం రాష్ట్రం నుంచి టెర్రరిజాన్ని రూపుమాపలేమన్నారు. స్వాతంత్య్రం నాటినుంచి 70 సంవత్సరాల్లో మూడు కుటుంబాల పాలన ప్రజాస్వామ్యం వ్యాప్తిని అనుమతించలేదని, అవినీతిని పెంచి పోషించాయని ఆరోపించారు.కాగా అంతకుముందు ప్రసంగించిన కాంగ్రెస్ తదితర పక్షాల సభ్యులు ఈ రోజును చీకటి దినం, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ద్రోహదినంగా అభివర్ణించారు. సోమవారం సాయంత్రం అమిత్ షా ఆ తీర్మానం, బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మంగళవారం సభ ఆమోదిస్తుంది. ప్రధానమంత్రి 7 వ తేదీన అఖిల సమావేశం జరుపుతారని, అనంతరం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పబడుతున్నది.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఇస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై అంతకుముందు సభలో గందరగోళం చోటుచేసుకుంది. హోం మంత్రి అమిత్ షా సభలో ఆర్టికల్ 370 రద్దు తీర్మానాన్ని, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2019ని ప్రవేశపెట్టారు. చండీగఢ్ మాదిరి లడఖ్ కూడా అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతం అవుతుందని, ఢిల్లీ, పుదుచ్చేరి మాదిరి జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఉన్న మరో కేంద్రపాలిత ప్రాంతం అవుతుందని అమిత్ షా ప్రకటించారు. ఈ వివరాలు ఆయన ప్రకటించగానే ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, వామపక్ష నాయకులు ఒక్కసారిగా నినాదాలు చేస్తూ సభ వెల్‌లోకి దూసుకుపోయారు. తమ నిరసనను కొనసాగించారు. ఇదిలావుండగా తీర్మానానికి, బిల్లుకు బహుజన్ సమాజ్ పార్టీ, బిజూ జనతాదళ్, తెలంగాణ రాష్ట్ర సమితి, ఎఐఎడిఎంకె వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు పూర్తిగా మద్దతు తెలపాయి. కాగా ఎన్‌డిఎలో ఉన్న జనతాదళ్(యు) మాత్రం వాకౌట్ చేసింది. రాజ్యసభ సమావేశం మొదలుకాక మునుపు సభలోకి అమిత్ షా ప్రవేశించగానే ఆయన పార్టీ సహచరులు లేచి నిలబడి హర్షం వ్యక్తం, అభినందనలు వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 జమ్మూకశ్మీర్‌ను భారత యూనియన్‌లో కలువనివ్వకుండా చేసిందని, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ‘చరిత్రాత్మకం’ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌కు ఇకపై ఆర్టికల్ 370 వర్తించబోదని హోంమంత్రి ప్రకటించారు. ఆర్టికల్ 370 రద్దుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారని, కశ్మీర్‌లో అసెంబ్లీ రద్దయినందున, అసెంబ్లీ లేనందున అసెంబ్లీ అధికారాలు పార్లమెంటు ఉభయసభలకు దక్కాయని అమిత్ షా వివరించారు. ‘రాష్ట్రపతి ఉత్తర్వుపై చర్చించి పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాలి’ అని ఆయన సభ్యులను కోరారు. రాష్ట్రపతి ఉత్తరు ద్వారా ఆర్టికల్ 370ని రద్దు చేయవచ్చన్న ప్రావిజన్ దానికుందని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘రాజ్యాంగ సవరణ చేయకుండానే రాజ్యాంగాన్ని మార్చొచ్చా?’ అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ స్పష్టీకరణ కోరాక…‘కాంగ్రెస్ ఆర్టికల్ 370 అంశాలను 1952, 1962లో సవరించిన పద్ధతి మార్గాన్నే మేమూ అనుసరిస్తున్నాము. ఆర్టికల్ 370 అంశాలను నోటిఫికేషన్ ద్వారా సవరిస్తున్నాము’ అని అమిత్ షా సభలో చెప్పారు. ‘విపక్షాల వైఖరిలో సుగుణాలేవి లేవు. వారు కేవలం రాజకీయాల కోసమే వ్యతిరేకిస్తున్నారు. సభలో గందరగోళం సృష్టిస్తున్నారు’ అంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు. రాజ్యసభలో అమిత్ షా ప్రకటన చేసిన వెంటనే పిడిపి సభ్యుడొకరు సభలోనే తన బట్టలు చించేసుకునాడు. మరో పిడిపి సభ్యుడు రాజ్యాంగ ప్రతులను చింపేశాడు. దాంతో రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు వారిని సభ నుంచి పంపించేసే ఆదేశాలు ఇచ్చారు. రాజ్యసభ సమావేశం కాగానే… జాతీయ ప్రాముఖ్యత ఉన్న అత్యవసర బిల్లు కనుక ముందస్తు నోటీసు, సర్క్యులేట్ అవసరం లేకుండా మినహాయింపులు తన విచక్షణాధికారంతో ఇచ్చినట్లు నాయుడు చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ మొత్తం కశ్మీర్‌లోయ కర్ఫ్యూలో ఉందని, ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు హౌస్ అరెస్టులో ఉన్నారని అన్నారు. పరిస్థితిపై మొదట చర్చ జరపాలని ఆజాద్ కోరారు. కానీ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా వెంకయ్య నాయుడు, హోం మంత్రి అమిత్ షాను పురమాయించారు. దాంతో షా ఆర్టికల్ 370 రద్దు తీర్మానం, జమ్మూకశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును, జమ్మూకశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో పేదలకు రిజర్వేషన్ కల్పించే జాబితా బిల్లులను ప్రవేశపెట్టారు. ఇదిలావుండగా రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లును మాత్రమే ఇప్పుడు ప్రవేశపెట్టండి, మిగతావి సభ్యులకు సర్క్యూలేట్ చేశాక ప్రవేశపెట్టండి అన్నారు.