జమ్ము కశ్మీర్
పార్టీ 2024 (90) 2014 (87)
నేషనల్ కాన్ఫరెన్స్ 42 15
బిజెపి 29 25
కాంగ్రెస్ 6 12
పిడిపి 3 28
సిపిఐ(ఎం) 1 1
ఇతరులు 9 3
ఇండిపెండెంట్లు 3
హర్యానా (90)
పార్టీ 2024 – 2019
బిజెపి 48 40
కాంగ్రెస్ 37 31
జెజెపి 0 10
ఐఎన్ఎల్డి 2 1
హెచ్‌ఎల్‌పి 0 1
ఇతరులు 3 7
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీరులో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారం దక్కించుకుంది. ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. ఆ రాష్ట్రంలో బిజెపి హ్యాట్రిక్ సాధించింది. మూడోసారి కూడా అధికారం కైవసం చేసుకుంది. ఉధంపూర్ లోక్‌సభ సెగ్మెంట్లోని దోడా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ అభ్యర్థి మేహరాజ్ మాలిక్ విజయం సాధించడంతో జమ్ముకశ్మీరులో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నది. ప్రాంతీయపార్టీ పీపుల్స్ డెమోక్రటిక్‌పార్టీ (పిడిపి) మూడు స్థానాల్లో గెలిచింది. ప్రజాతీర్పును గౌరవిస్తామని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇతిజా ముఫ్తీ ఎక్స్‌లో పోస్టింగ్ పెట్టారు. ఆమె అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో మెరుపులు మెరిపించిన అవామీ ఇత్తెహాద్పార్టీకి చెందిన ఇంజనీర్ రషీద్, గులాంనబీ ఆజాద్‌కు చెందిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్పార్టీలు ఎక్కడా జాడలేవు. ఇక సిపిఐ(ఎం) తరఫున యూసుఫ్ తరిగామి కుల్గామ్ నుంచి ఐదవసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. జమ్ము కశ్మీరు అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎవరైనా కనీసం 48 సీట్లు గెలుచుకోవాలి. నేషనల్ కాన్ఫరెన్స్పార్టీ అత్యధికంగా 41స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌పార్టీ ఆరు స్థానాల్లో, సిపిఐ(ఎం) ఒక నియోజకవర్గంలో విజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస మెజారిటీ ఈ కూటమికి లభించింది. ఇక 90 నియోజకవర్గాలలో పోటీ చేసి కేవలం 29 స్థానాలు గెలుచుకున్న బిజెపి ప్రతిపక్షంలో కూర్చోనున్నది. గతంకంటే బిజెపి ఈసారి నాలుగు సీట్లు ఎక్కువ గెలిచింది. 51 స్థానాలలో పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ అత్యధికంగా 41 స్థానాలు గెలుచుకుని జమ్ము కశ్మీరులో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌పార్టీ కూటమి తరపున 32 స్థానాలకు పోటీ చేసి ఆరు నియోజకవర్గాలలో విజయం సాధించింది. ఈ రాష్ట్రంలో నేషనల్ కాన్ఫరెన్స్ సారథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్నది. జమ్ము కశ్మీరు ప్రజలు 370వ అధికరణ రద్దుకు వ్యతిరేకమని ఈ ఎన్నికల ఫలితాలను బట్టి రుజువైందని నేషనల్ కాన్ఫరెన్స్పార్టీ అధ్యక్షుడు ఫారూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. రెండోసారి కూడా ఒమర్ అబ్డుల్లాయే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన ప్రకటించారు. ఇంతకుముందు 2009 నుండి 2014 వరకూ ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇకిప్పుడు జమ్మూ కశ్మీరులో లెఫ్టినెంట్ జనరల్ పరిపాలనగానీ, వారి సలహాదారుల పెత్తనంగానీ ఉండబోదని, ప్రజలు ఎన్నుకున్న 90 మంది శాసనసభ్యులే పరిపాలన చేస్తారనీ ఫారూఖ్ అబ్దుల్లా అన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మాదకద్రవ్యాలు వంటి అనేక సమస్యలు, ప్రజల కష్టాలు తీర్చేందుకు కొత్త ప్రభుత్వం చాలా కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, తమపార్టీని నామరూపాలు లేకుండా చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేశారని, కానీ చివరకు తమను అంతం చేయాలనుకున్నవారే అంతమైపోయారని విమర్శించారు. జమ్ము కశ్మీరు, హర్యానా రెండు రాష్ట్రాలలోనూ ఓటర్లు చాలా స్పష్టంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసి మంగళవారం ఓట్లలెక్కింపు రోజున ప్రధానపార్టీలను దిగ్భ్రాంతికి గురిచేశారు.
హర్యానా సిఎంగా మళ్ళీ నాయబే : హర్యానా రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలలో పాలక బిజెపి 48 నియోజకవర్గాలలో విజయం సాధించింది. మూడోసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజల తీర్పు పొందింది. కాంగ్రెస్‌పార్టీ 37 స్థానాలు గెలుచుకుంది. దేవీలాల్ మనుమడు అభయ్‌సింగ్ చౌతాలాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ రెండుచోట్ల గెలిచింది. ఇతరులకు మూడుస్థానాలు లభించాయి. అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీపార్టీ ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. గెలిచిన ప్రముఖులలో నాయబ్‌సింగ్ సైని, సింగ్ హూడా, ఇండిపెండెంట్ సావిత్రి జిందాల్ ఉన్నారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన వినేశ్ ఫోగట్ జులనా నుండి గెలిచారు. ఓడిన ప్రముఖులలో అభయ్‌సింగ్ చౌతాలా ఉన్నారు. ఉదయం నుండీ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌పార్టీ వెనుకంజలోనే ఉంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీలకు ఎన్నికలు త్వరలో జరగనున్న తరుణంలో హర్యానా ఎన్నికల ఫలితాలు బిజెపిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. హర్యానాలో పది సంవత్సరాలు అధికారం చెలాయించిన తర్వాత బిజెపిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత సహజంగానే నెలకుని ఉంటుందని, మూడోసారి ఇక కాంగ్రెస్‌పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు ఎంతో ధీమాగా అంచనాలు వేశారు. కానీ చివరకు ఎగ్జిట్ పోల్స్‌ను కూడా ఈ ఫలితాలు తలకిందులు చేశాయి. ఇక మళ్ళీ నాయబ్ సింగ్ సైనీనే ముఖ్యమంత్రిగా బిజెపి ఎంచుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఐతే బిజెపి హర్యానా నాయకుడు అనిల్ విజ్ కూడా ముఖ్యమంత్రి పదవిపై కన్ను వేశారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తాను ఎంతో విశ్వాసంతో ఉన్నానని ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలోనే నాయబ్‌సింగ్ సైనీ వ్యాఖ్యానించారు.