అబే హత్య నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
అధికారి ఎల్‌డిపి మెజారిటీ సాధించే అవకాశం
టోక్యో: మాజీ ప్రధాని షింజో అబే హత్య జరిగిన మూడో రోజుల్లోనే జపాన్ పార్లమెంటు ఎగు వ సభకు ఆదివారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం జరిగిన ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలోనే అబేను 41 ఏళ్ల తెసుయా యమగామి కాల్చి చంపిన విషయం తెలిసిందే. చిరకాలం లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ (ఎల్‌డిపి) నేతగా, దేశ ప్రధానిగా సేవలు అందించిన అబే హత్య ఓటర్లపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 125 మంది సభ్యులుగల హౌస్ ఆఫ్ కౌన్సిలర్స్‌లో ఎల్‌డిపికి 55 స్థానాలు ఉన్నాయి. దీనితో కొమిటో పార్టీ మద్దతుతో ఎల్‌డిఎఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని గా ఫుమియో కిషిదా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇలావుంటే, ఈసారి ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ 69 నుంచి 83 వరకూ సీట్లు గెల్చుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. 69 స్థానాలను దక్కించుకోగలిగితే ఎల్‌డిపి ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. సాధారణ మెజారిటీ ఆ పార్టీకు లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. సమర్థవంతమైన నేతగా, అజాత శత్రువుగా పేరున్న షింజో హత్య సహజంగానే ఆయన నేతృత్వం వహించిన ఎల్‌డిపికి సానుకూల పవనాలు వీచేందుకు దోహదపడుతుందని అంటున్నారు. ఎల్‌డిపికి భారీ మెజారిటీ వచ్చినా.. రాకపోయినా, అబే హత్యా ఘటన ఎన్నికలపై ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తున్నది.