దశలవారీ ఆందోళనకు పది కేంద్ర కార్మిక సంఘాల డిక్లరేషన్
మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికుల భారీ ప్రదర్శన
ప్రజాపక్షం/ న్యూఢిల్లీ : కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంలో ఘోరం గా విఫలమైన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరి 8వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సోమవారంనాడు 10 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్‌లో భారీ ప్రదర్శన, బహిరంగ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన డిక్లరేషన్ లో ఐక్య కార్యాచరణను ప్రకటించాయి. ఇప్పటికే బ్యాంకింగ్, బొగ్గు వంటి రంగాల్లో కార్మికులు ఆందోళనలు నిర్వహించగా, జనవరి 8న సార్వత్రిక సమ్మె నిర్వహించాలని, ఈలోగా వివిధ రూ పాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పది కార్మిక సంఘాలు తమ డిక్లరేషన్‌లో ప్రకటించా యి. ఈ సదస్సులో ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్, సిఐటియు, ఎఐయుటియుసి, టియుసిసి, ఎస్‌ఇడబ్ల్యు, ఎఐసిసిటియు, ఎల్‌పిఎఫ్, యుటియుసిలతోపాటు వివిధ స్వతంత్ర స మాఖ్యలు, సంఘాలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు హాజరై, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వచ్చే మూడు మాసాలకు ఐక్య కార్యాచరణను ప్రకటించారు. అక్టోబరు, నవంబరు మాసాల్లో రంగాల వారీగా రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ఉమ్మడి కార్మిక సదస్సులు, డిసెంబరు మాసంలో ఫ్యాక్టరీలు, సంస్థల్లో డిక్లరేషన్ పత్రాలను విస్తృతంగా పంపిణీ చేసి, కార్మిక, ఉద్యోగుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగుల్కొల్పడం, ఆ తర్వాత జనవరి 8వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహించాలని సదస్సు పిలుపునిచ్చింది. 12 అంశాల కోర్కెల పత్రం ఆధారంగా ఆందోళన చేపడుతున్నట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. ఈ సందర్భం గా ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్‌తోపాటు ఇతర కార్మిక సంఘాల నేతలు ప్రసంగిస్తూ, మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయిందని, దీన్ని సాకుగా చూపి మోడీ సర్కారు కార్పొరేట్ రంగానికి మరిన్ని ప్యాకేజీలు ప్రకటిస్తూ, కార్మిక వర్గాన్ని ఇంకాస్త దయనీయ పరిస్థితిలోకి నెట్టివేసిందని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనంతగా కార్మిక వ్యతిరేక విధానాలు సాగుతున్నాయని, కార్మిక చట్టాల అరాచక సవరణలే ఇందుకు ప్రధాన ఉదాహరణ అని పేర్కొన్నారు.