రెండో రోజూ దేశవ్యాప్తంగా సమ్మె విజయవంతం
విద్యాసంస్థలు, రైలు, బ్యాంకింగ్, రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ : కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ఏకపక్ష కార్మికచట్టాల సంస్కరణలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె రెండవ రోజైన బుధవారం కూడా కొనసాగింది. బ్యాంకులు, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడింది. విద్యాసంస్థలు, రైల్ బ్యాంకింగ్, పోస్టల్, రవాణా వ్యవస్థపై బంద్ ప్రభావం చూపింది. పశ్చిమబెంగాల్‌లో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పది కార్మిక సం ఘాలు ఈనెల 8,9న భారత్‌బంద్‌కు పిలుపునిచ్చారు. అసోం, ఒడిశా, మణిపూర్, మేఘాలయ, మహారాష్ట్ర, గోవాలో బంద్ వందకు వందశాతం జరిగిందని హింద్ మజ్దూర్ సభ హర్భజన్ సింగ్ సిద్దు మీడియాకు తెలిపారు. అదే విధంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లో మంచి స్పందన వచ్చిందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని మండి హౌస్ నుంచి పార్లమెంట్ వరకు నిరసన ప్రదర్శన చేశామని, దాదాపు నాలుగు వేల మంది కార్మికులు రో డ్డుపైకి వచ్చిన తమ ఆవేదనను వెలిబుచ్చారని చెప్పారు. అంతకు ముందు ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంద్ వంద శాతం జరుగుతోందని చెప్పారు. ఇదిలా ఉండగా, ఒక వర్గానికి చెందిన పిఎస్‌యు బ్యాంకులు ఉద్యోగులు భారత్ బంద్‌కు పిలుపునినివ్వడంతో బ్యాం కింగ్ రంగంపై పాక్షికంగా ప్రభావం పడింది. సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ), బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బిఇఎఫ్‌ఐ) మద్దతు తెలిపాయి. ఈ రెండూ బలమైన యూనియన్లు కావడంతో బ్యాంక్ కార్యకలాపాలపై ప్రభావం పడింది. బ్యాంకింగ్ సెక్టార్‌కు చెందిన మరో ఏడు యూనియన్లు బంద్‌లో పాల్గొనకపోవడంతో ఎస్‌బిఐ, ఇతర ప్రైవేటు బ్యాంకులు సాధారణ తమ కార్యాకలాపాలను కొనసాగించాయి. కాగా, ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిఎచ్ వెంకటాచలం మాట్లాడుతూ నగదు లావాదేవీలు, విదేశీ మారక ద్రవ్యాల లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, నగదు చెల్లింపులు, బిల్లులు రాయితీలపై ప్రభావం చూపిందన్నారు. అయితే కేరళ తిరువనతంపురంలోని ఎస్‌బిఐకి చెందిన ఓ శాఖపై దాడి జరిగింది. కొంత మంది వ్యక్తు లు ఉదయం బ్యాంకులోకి ప్రవేశించి సిబ్బంది బెదిరించి టేబుల్‌పై ఉన్న అద్దాలను, కంప్యూటర్లను ధ్వంసం చేశారని ఆ బ్రాంచ్ మేనేజర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు రైల్ రోకో నిర్వహించారు. తిరువనంతపురం హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్, వెనద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అడ్డుకున్నారు. అనేక ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. బస్సులు, ఆటోరిక్షాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భారత్ బంద్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో రెండవ రోజు కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి. హౌరా జిల్లాలో స్కూల్ బస్సులపై నిరసన కారులు రాళ్లురువారు. తూర్పు రైల్వే జోన్‌లోని రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిం ది. సెల్దా బెంగాన్ సెక్షన్‌లోని అశోక్‌నగర్‌లోగల రైలు పట్టాలపై బాంబు లభమైనట్లు రైల్వే అధికార ప్రతినిధి పేర్కొన్నారు.