మోడీ సర్కారుపై ప్రతిపక్షాల విమర్శ
జోక్యం చేసుకోవాల్సిందిగా రాష్ట్రపతికి వినతి
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వ వివాదాస్పద విధానాలపై ప్రతిపక్ష పార్టీలు మంగళవారంనాడు రాష్ట్రపతిభవన్ తలుపులు తట్టాయి. రాజ్యాం గ విరుద్ధమైన, విచ్ఛిన్నకర పౌరసత్వ సవరణ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాల్సిందిగా మోడీ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని, అలాగే కేంద్ర యూనివర్శిటీల్లో హింసాత్మక ఘటనల సమస్యపై జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రతిపక్షాలు వినతిపత్రం సమర్పించాయి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఐ(ఎం), డిఎంకె, ఎస్‌పి, టిఎంసి, ఆర్‌జెడి, నేషనల్ కాన్ఫరెన్స్, ఐయుఎంఎల్, ఎఐయుడిఎఫ్ తదితర పార్టీల ప్రతినిధులు ఈ బృందంలో వున్నారు. ఈ ప్రతిపక్ష బృందానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సారథ్యం వహించారు. రాష్ట్రపతితో సమావేశానంతరం సోనియాగాంధీ మీడియాతో మాట్లాడుతూ, ఆమోదయోగ్యం కాని చట్టాలను తీసుకువస్తూ, ప్రజల గొంతును మోడీ ప్రభుత్వం నొక్కేస్తున్నదని ఆరోపించారు. ఈ తరహా అరాచకవాదం దేశంలో ఏనాడూ తలెత్తలేదని విమర్శించారు. “12 ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధుల బృందం రాష్ట్రపతిని కలిసింది. ఈశాన్యంలో తలెత్తిన పరిస్థితిపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. పౌరసత్వ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. చివరకు జామియా యూనివర్శిటీ వంటి విద్యాసంస్థలకూ పాకింది. పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. భవిష్యత్‌లో ఈ పరిస్థితి ఇంకెలా వుంటుందోనన్న భయంగా వుంది. దేశవ్యాప్తంగా నిరసనలు అదుపు చేయడంలో పోలీసులు అనుసరిస్తున్న విధానం చాలా క్రూరంగా వుంది. రాష్ట్రపతి వెంటనే స్పందించాలి” అని సోనియా అన్నారు. పోలీసు సిబ్బంది జామియా మిలియా ఇస్లామియాలోని మహిళా హాస్టల్స్‌లోకి చొరబడి, నిర్దాక్షిణ్యంగా వారిని చితకబాదారని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. ఢిల్లీలోనే కాకుండా దేశంలో ఎక్కడ ప్రదర్శనలు జరిగినా, పోలీసులు తీరు ఇలానే వుంటున్నదని ఆరోపించారు. నిరసన తెలియజేయడం ప్రజాస్వామిక హక్కు కాదా అని ఆమె ప్రశ్నించారు. ఒక చట్టం ప్రజలకు ఆమోదయోగ్యమా కాదా అన్న విచక్షణ లేకుండా మోడీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని, ప్రజల నోళ్లునొక్కి, చట్టాలను తీసుకువస్తారా? అని నిలదీశారు. ప్రజల హక్కులను కాలరాయడంలో ప్రభుత్వం ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని స్పష్టంగా కన్పిస్తోందన్నారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ, రాష్ట్రపతి రాజ్యాంగ పరిరక్షకుడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ తరహాలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి ప్రభుత్వానికి అనుమతినివ్వకూడదని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. తక్షణమే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకునేలా మోడీకి సలహా ఇవ్వాలని కూడా కోరినట్లు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరిక్ ఓబ్రియన్ మాట్లాడుతూ, పౌరసత్వ సవరణ చట్టం ఒక విచ్ఛిన్నకరమైన చర్య అని విమర్శించారు. ఈ చట్టం అత్యంత నిరుపేదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అ న్నారు. సమాజ్‌వాది పార్టీ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ మాట్లాడుతూ, బిల్లు ఆమోదించే సమయంలో పార్లమెంటులో తాము వ్యక్తం చేసిన భయాలు ఇప్పుడు నిజమవుతున్నాయని, దేశాన్ని విచ్ఛిన్నం చేసే చట్టాల్లో ఇది అగ్రగామిగా వుంటుందని చెప్పారు. ఈ చట్టం ప్రజ ల మనసుల్లో భయాన్ని సృష్టించిందని, భవిష్యత్‌లో మరి న్ని దుష్ఫలితాలు తలెత్తవచ్చని అభిప్రాయపడ్డారు. దేశా న్ని సమైక్యంగా వుంచాల్సిందిగా రాష్ట్రపతిని కోరామన్నా రు. కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ మాట్లాడుతూ, దేశంలో అలజడి రేపి, లబ్ధిపొందాలని కొన్ని స్వార్ధపరశక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఇందులో భాగమే పౌరసత్వ సవరణ చట్టమని ఆరోపించారు. ఈ చట్టంపై చర్చకు రా వాలని ఆయన మోడీకి సవాల్ విసిరారు. మరో కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, 15 రాజకీయ పార్టీలకు గాను 14 పార్టీల ప్రతినిధులు ముందుకొచ్చి రాష్ట్రపతిని కలిశారని, దాదాపు అన్ని పార్టీలూ మోడీ కొత్త బిల్లును వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. అంశాలవారీగా వివరిస్తూ రాష్ట్రపతికి వినతిపత్రం అందజేసినట్లు ఆజాద్ చెప్పారు. కాగా, బిఎస్‌పికి చెందిన ఎంపీలంతా బుధవారంనాడు ప్రత్యేకంగా రాష్ట్రపతితో భేటీ అవుతున్నట్లు ఆ పార్టీ నేత డేనిష్ ఆలీ తెలిపారు.
జనగళాన్ని నొక్కేస్తున్నారు!
RELATED ARTICLES