న్యూఢిల్లీ: మొదటి దశ జనగణన, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్) నవీకరణ కసరత్తు షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జరగాల్సి ఉంది. కానీ ప్రాణాంతక కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పట్లో కరోనా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించేలా లేనందుకు సంవత్సరం పాటు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. భారతీయ గనగణన అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పాలనాపరమైన, గణాంకాలపరమై కార్యక్రమంలో ఒకటి. ఈ కార్యక్రమంలో 30 లక్షలకుపైగా అధికారులు పాల్గొంటారు. దేశ నలుమూలలా ప్రతి ఇంటికీ వెళ్లి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. అయితే కరో నా వ్యాప్తి నేపథ్యంలో జనగణన ప్రస్తుతం అవసరమైన కార్యక్రమం ఏమీ కాదని, ఒక సంవత్సరం పాటు ఆలస్యమైనప్పటికీ ప్రమాదమేమీ లేదని ఓ సీనియర్ అధికారి పిటికి చెప్పారు. 2021 మొదటి దశ జనగణన, ఎన్‌పిఆర్ నవీకరణపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆ అధికారి తెలిపారు. రోజు రోజుకు భారీగా కొవిడ్ కేసులు వెలుగు చూస్తున్నందున 2020 సంవత్సరంలో దాదాపు జనగణన ఉండకపోవచ్చని కచ్చితంగా చెప్పవచ్చన్నారు. ఇంటింటికి తిరిగి జనాభాను లెక్కించడం, ఎన్‌పిఆర్‌ను నవీకరించే కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 1, 2020 నుంచి సెప్టెంబర్ 30, 2020 వరకు చేపట్టాల్సి ఉండే కానీ, కొవిడ్ మహమ్మారి వల్ల అది వాయిదా పడింది. ఈ మొత్తం కసరత్తులో ప్రతి కుటుంబాన్ని లెక్కించేందుకు లక్షలాది మంది అధికారుల ప్రమేయం అవసరమని, ప్రస్తుత పరిస్థితుల్లో అంత మంది ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయలేమని ఆ అధికారి వెల్లడించారు. కాగా, గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనగణన అమలు తేదీ మార్చి 1, 2021గా ఉన్నది. మంచు ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో అయితే అక్టోబర్ 1, 2020 నుంచి అమల్లోకి రావాల్సి ఉండే. కొవిడ్ ముప్పు ఇప్పటికీ తీవ్రంగా ఉందని, జనగణన, ఎన్‌పిఆర్‌లు ప్రస్తుతానికి ప్రభుత్వ ప్రాధాన్య జాబితాల్లో లేవని మరో అధికారి చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మార్చి నెలలో లాక్‌డౌన్ విధించే నాటికే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదటిదశ జనాభా లెక్కలు, ఎన్‌పిఆర్ నవీకరణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు భారత రిజిష్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ అంతా సిద్ధం చేశారు. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్‌పిఆర్ నవీకరణను వ్యతిరేకించినప్పటికీ, జనగణన కార్యక్రమానికి అందరూ పూర్తి మద్దతు తెలిపారు. 2011 జనాభా లెక్కలతో పాటు చివరి చివరిసారిగా 2010లో ఎన్‌పిఆర్ గణాంకాలను సేకరించారు. ఆ తరువాత ఇంటింటి సర్వే నిర్వహించి 2015లో ఆ గణాంకాలను నవీకరించారు. 2015లో నవీకరించే సమయంలో ప్రభుత్వం ప్రజల నుంచి ఆధార్, మొబైల్ నంబర్ వంటి వాటిని ఇవ్వాలని కోరింది. ఈ సారి వాటికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడిని కూడా తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
జనగణన, ఎన్‌పిఆర్ ఈ ఏడాది లేనట్లే..
RELATED ARTICLES