జాతర ముగింపులో భారీ వర్షం
జడివానలో సైతం తల్లులను దర్శించుకున్న వేలాది మంది భక్తులు
ప్రజాపక్షం/వరంగల్ బ్యూరో: సమ్మక్క- సారలమ్మలు శనివారం వనప్రవేశం చేయడంతో మేడారం జాతర ఘనంగా ముగిసింది. ఈ మహా జాతరలో తల్లులు వనప్రవేశం చేసే శనివారం రోజున భక్తులు వేలాదిగా తరలివచ్చారు. లక్షలాది సంఖ్యలో భక్తులు తల్లుల దర్శనం చేసుకుంటుండగానే మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అరగంట పాటు వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు మాత్రం క్యూలైన్‌లోనే వెళ్తూ వనదేవతలను దర్శనం చేసుకున్నారు. భారీ వర్షానికి ముందు ఒక జల్లుగా వర్షం పడడంతో సాధారణ వర్షపాతమేనని తల్లుల వనప్రవేశం చేసే ముందు జాతరను శుద్ధి చేయడానికి తగిన వర్షంగా భక్తులు భావించారు. గంట తరువాత భారీ వర్షం కురిసినప్పటికి భక్తు లు ఆస్వాదిస్తూనే తల్లుల దర్శనం చేపట్టారు.భారీ వర్షం తో మేడారంలోని ప్రధాన రహదారులన్ని జలమయంగా మారా యి. వర్షం కురిసిన తల్లుల వనప్రవేశంపైనే భక్తులు, అధికారుల దృష్టి నిలిచిపోయింది.
భారీ వర్షంతో విద్యుత్ షాక్..
జాతరకొచ్చే భక్తుల కోసం విద్యుత్‌శాఖ భారీ ఏర్పాట్లను చేపట్టింది. గుడి ప్రాంగణంలో హైమాస్ లైట్లతో పాటు సౌండ్స్ ఇతర అవసరాలకు ఉపయోగించిన వైర్లు, కొన్ని చోట్ల చిందరవందనంగా పడిఉన్నాయి. ఈ వర్షానికి చిందరవందరగా పడిన వైర్లలో షాక్ సర్క్యుట్ జరిగినట్లు తెలుస్తుంది. అందులో ఒకరికి గాయాలైనట్లు తెలుస్తుంది. అధికారులు మాత్రం ఎలాంటి ప్రమాదం, ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భారీ వర్షం ముగిసిన తరువాత యధావిధిగా తల్లుల దర్శనం కొనసాగుతూనే ఉంది. రాత్రి 7 గంటలకు తల్లులను వనప్రవేశానికి తీసుకెళ్లే వరకు భక్తులు భారీ సంఖ్యలో దర్శనం చేసుకున్నారు.
జనం నుంచి వనంలోకి సమ్మక్క, సారలమ్మ
RELATED ARTICLES