ఒక్కరోజే జిల్లాలో 26 కరోనా కేసులు
రాష్ట్రంలో 24 గంటల్లో 56 పాజిటివ్‌లు నమోదు
తెలంగాణలో 928కి చేరిన కొవిడ్ -19 కేసుల సంఖ్య
ప్రజాపక్షం/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా అలజడిపుట్టిస్తోంది. ఒక్కరోజే సూర్యాపేటలో ఏకంగా 26 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా ప్రజల్లో కలవరం పెరిగింది. మంగళవారంనాడు మొత్తంగా రాష్ట్రంలో 56 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 928కి పెరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఈ వివరాలు వెల్లడించింది. మంగళవారం 56 కేసు లు నమోదుకాగా, అందులో 26 కేసులు ఒక్క సూర్యాపేట జిల్లాలోనే వెలుగులోకి వచ్చాయని, 19 కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలో నమోదయ్యాయని తెలిపింది. నిజామాబాద్‌లో మూడు, గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండేసి, ఖమ్మం, మేడ్చల్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. మరో 8 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 711 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తంగా 194 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రలో 23 మంది మరణించారు.