HomeNewsLatest Newsజడలు విప్పుతున్న కరోనా

జడలు విప్పుతున్న కరోనా

భారత్‌లో మూడవ రోజూ 70 వేలకుపైగా కొత్త కేసులు
మరో 1021 మంది మృత్యువాత
34 లక్షలు దాటిన బాధితుల సంఖ్య
62,550కి చేరిన మరణాలు
4 కోట్లు దాటిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రాణాంతక కరోనా వైరస్‌ జ-డలు విప్పుతోంది. గత మూడు రోజుల నుంచి 70 వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూస్తుండగా, మరణాల సంఖ్య కూడా వెయ్యికిపైగా నమోదవుతుండడం తీవ్ర కలవర పెడుతుంది. అదే విధంగా రోజు వారి కేసుల్లో ప్రపంచంలోనే భారత్‌ తొలిస్థానంలో ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కాగా, దేశంలో బాధితుల సంఖ్య 34 లక్షలు దాటింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో మరోసారి 76,472 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 34,63,972కు చేరింది. అదే విధంగా రికవరీల సంఖ్య కూడా 26,48,998కి ఎగబాకినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. 24 గంటల్లో మరో 1,021 మందిని మహమ్మారి బలి తీసుకుంది. కొత్త మృతులతో కలిపి మొత్త మరణాల సంఖ్య 62,550కి చేరింది. అయినప్పటికీ మరణాల రేటు 1.81 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 76.47 ఉన్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 7,52,424 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఈ సంఖ్య 21.72 శాతం మాత్రమే. భారత్‌లో కేసుల సంఖ్య ఈ నెల 7వ తేదీన 20 లక్షల మార్క్‌ను దాటగా, 23వ తేదీ నాటికి 30 లక్షల మార్క్‌ను దాటింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా బ్రెజిల్‌, భారత్‌లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్యలో మాత్రం భారత్‌ నాల్గొవ స్థానంలో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు భారీగానే నిర్వహిస్తున్నారు. శుక్రవారం దేశవ్యాప్తంగా 9,28,761 శాంపిళ్లకు కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్‌) వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 4,04,066,09 శాంపిళ్లకు కరోనా పరీక్షలు పూర్తిచేసినట్లు ఐసిఎంఆర్‌ పేర్కొంది.
ఐదు రాష్ట్రాల్లో భారీగా కేసులు, మృతులు
మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లో భారీగా కొత్త కేసులు బయట పడుతున్నాయి. మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుంది. మహారాష్ట్రలో 24 గంటల్లో 14,427 కొత్త కేసులు వెలుగు చూడగా, మరో 331 మంది మరణించారు. దీంతో బాధితుల సంఖ్య 7,47,995కు చేరగా, మృతుల సంఖ్య 23,775కు ఎగబాకింది. తమిళనాడులో ఒక్క రోజులో 5,996 మందికి పాజిటివ్‌ రాగా, మరో 102 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 4,09,238కి చేరగా, మొత్తం మృతుల సంఖ్య 7,050కి దూసుకెళ్లింది. కర్నాటకలో మరో 8,960 మంది కరోనా బారిన పడ్డారు. కొత్తగా 136 మందిని మహమ్మారి బలితీసుకుంది. రాష్ట్రంలో మొత్తం బాధితులు 3,18,752గా ఉండగా, మరణాల సంఖ్య 5,368గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 10,548 పాజిటివ్‌లు రాగా, తాజాగా 82 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల సంఖ్య 4,14,164కు చేరగా, మృతుల సంఖ్య 3,796కు చేరింది. ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 77 మంది ప్రాణాలు కోల్పోగా, మృతుల సంఖ్య 3,294గా ఉంది. తాజాగా 5,405 మందికి పాజిటిటవ్‌ వచ్చింది. దీంతో కేసుల సంఖ్య 2,13,824కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒకత్తగా 1,808 మందికి కరోనా రాగా, 20 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 4,389గా ఉండగా, కేసుల సంఖ్య 1,69,412గా నమోదైంది. గజరాత్‌లో మరో 14 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 2,976కి చేరింది. పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 56 మంది, మొత్తంగా 3,073, మధ్యప్రదేశ్‌లో తాజాగా 17 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 1,323కి చేరింది. పంజాబ్‌లో మొత్తం మృతుల సంఖ్య 1,307కి చేరగా, తాజాగా 51 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లో 1,017 మరణాలు సంభవించగా, 24 గంటల్లో తాజాగా12 మంది మృతి చెందారు.
కొవిడ్‌ పరీక్షల్లో భారత్‌ మరో మైలురాయి
కొవిడ్‌ పరీక్షల్లో భారత్‌ మరో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరి నుంచి మొదలుపెట్టిన కొవిడ్‌ పరీక్షలు తాజాగా 4 కోట్ల మైలురాయిని దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. కేంద్రం చేపట్టిన నిరంతర, సమన్వయ చర్యలు, రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాలు వాటిని సమర్ధవంతంగా అమలు చేయడంతో కరోనా పరీక్షల సంఖ్య రికార్డు స్థాయిలో 4,04,06,609కి చేరినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. జనవరిలో పుణెలోని ల్యాబ్‌లో జరిగిన తొలి టెస్ట్‌తో మొదలై ప్రస్తుతం 4 కోట్ల మైలురాయికి చేరామని తెలిపింది. రోజువారీ టెస్టుల సామర్థ్యం కూడా పెరుగుతోందని, ఇప్పటికే రోజుకు 10 లక్షల పరీక్షలకు చేరుకున్నామని, గత 24 గంటల్లో 9,28,761 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 8.57 శాతం కంటే దిగువన ఉందని, అది కూడా క్రమంగా తగ్గుతూ వస్తోందని ప్రకటించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments