తెలంగాణకు తీవ్ర అన్యాయం
పదేళ్లలో ఆంధ్రాకే ఎక్కువ నీళ్లు : మంత్రి ఉత్తమ్
ప్రజాపక్షం/కోదాడ: ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు జలాల పంపిణీతో పోల్చితే గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పరిపాలనలో తెలంగాణ కంటే ఆంధ్రా ప్రాంతానికే ఎక్కువ మేలు జరిగిందని, ఇద్దరు సిఎంలు జగన్, కెసిఆర్‌కు మధ్య ఉన్న రహస్య ఒప్పందాలతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర
రాజనర్సింహా, ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు అన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానం మేరకు కోదాడ పట్టణంలో బుధవారం వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు రాజనర్సింహా, నాగేశ్వరరావులు పాల్గొన్నారు. అనంతర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎపి సిఎం వైఎస్.జగన్, తెలంగాణ మాజీ సిఎం కెసిఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు సిఎంలు కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కెసిఆర్, జగన్ ఏకాంత చర్చలు జరిపినప్పుడల్లా అక్రమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల్లో ఎపికి 500 టిఎంసిలు ఇవ్వాలని కెసిఆర్ చెప్పలేదా? అని ప్రశ్నించారు. కృష్ణా నదిపై ఎపి అక్రమ ప్రాజెక్టులు కట్టి నీటిని తరలించిందని, ఎపి చేపట్టిన ప్రాజెక్టులకు కెసిఆర్ అడ్డు చెప్పలేదని మంత్రి మండిపడ్డారు. మన నీళ్లు ఎపికి వెళుతుంటే కెసిఆర్ నిశ్శబ్దంగా ఉన్నారన్నారు. కెసిఆర్ రూ.లక్ష కోట్లు దోచుకొని కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని, మేడిగడ్డ పూర్తిగా కూలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ అంశంపై కెసిఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కూడా ప్రమాదంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. కృష్ణా ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అక్రమాలకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం పాలనలో ప్రజలకు విసుగు వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుంండా పూర్తిస్థాయిలో ప్రజాపాలన అందిస్తామన్నారు.బిఆర్‌ఎస్ ప్రభుత్వం హాయాంలో చేసినటువంటి అవినీతిని బయడపెడతామని అవినీతికి పాల్పడినవారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని ఆయన ఉద్ఘాటించారు. రాజనర్సింహ మాట్లాడుతూ కోదాడ ప్రాంతం శరవేగంగా అభివృద్ది చెందుతుందని, జాతీయ రహదారి ఉండటంతో ఏమైనా ప్రమాదాలు జరిగిన వెంటనే చర్యలు తీసుకునేందుకు ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కోదాడ, హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో కోదాడ ఎంఎల్‌ఎ ఎన్.పద్మావతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జగన్, కెసిఆర్ మధ్య రహస్య ఒప్పందం
RELATED ARTICLES