రుణమాఫీ విషయంలో మాటా.. మాటా..
ప్రజాపక్షం/నల్లగొండ ప్రతినిధి: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రుణమాఫీ విషయంలో నువ్వెంతంటే.. నువ్వెంతా అంటూ మాటల యుద్ధం జరిగింది. నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌కలోని ఉదయాదిత్యా భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన నియంత్రిత సాగు విధానంపై నల్లగొండ నియోజక వర్గస్థాయి కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశంలోనే రైతుబాంధావుడు కెసిఆర్ అని, రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీ ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దీంతో ఉత్తమ్ కుమార్‌రెడ్డి కల్పించుకొని మంత్రి చెబుతున్నదంతా అబద్ధాలు అని, రైతు రుణమాఫీ జరగలేదంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. రుణమాఫీ విషయంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రశ్నించినందుకు సమావేశం వేదిక మీదే ఆప్ట్రాల్ నువ్వెంత అంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి ఉత్తమ్‌పై మండి పడ్డారు. టిపిసిసిగా ఉండటం మీ సొంత పార్టీ ఎంఎల్‌ఎలకే ఇష్టం లేదంటూ ఉత్తమ్‌పై సెటైర్ వేయడంతో… మంత్రిగా ఉండటం జిల్లాకు పట్టిన దురదృష్టమంటూ మంత్రికి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేసిందని మంత్రి చెప్పడంతో ఉత్తమ్ అడ్డుపడి ఎక్కడా రుణమాఫీ పూర్తిగా రైతులకు అందలేదని ఎదురు దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా సమావేశ మందిరంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క రైతుకు మేలు చేయని మీరు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
జగదీశ్ – ఉత్తమ్ వాగ్యుద్ధం
RELATED ARTICLES