మూసీలో మహిళల మృతదేహాలు లభ్యం
ప్రమాదమా, హత్యా అనే కోణంలో దర్యాప్తు
ప్రజాపక్షం/ హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. వీరిద్దరి మృతదేహాలు మంగళవారం మూసీనదిలో పోలీసులు గుర్తించారు. లంగర్‌హౌజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 119 వద్ద మూసీనదిలో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో క్లూస్ టీంతోపాటు స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మహిళల మృతదేహాలను మూసి నదిలోంచి బయటికి తీసి పంచనామ అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. హత్యకు గురైన మహిళల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. హతురాళ్లు ఎవరనేది తెలిస్తే హత్యకు గల కారణాలతో పాటు హంతకులను గుర్తించడం సులభమవుతుందని పోలీసులు పేర్కొంటున్నారు. మృతదేహాలను గుర్తించి వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరుతున్నారు.