ముఖ్యమంత్రిగా నేడే ప్రమాణం
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ఉత్కంఠ వీడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన మూడు, నాలుగు రోజుల పాటు సమావేశమైన పార్టీ అధినాయకత్వం విస్తృత చర్చలు జరిపి సిఎం ను ఎవరిని నియమించాలన్న సస్పెన్స్‌కు తెరదించింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భూపేష్ బఘేల్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఆదివారం రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ లిజిస్లేచర్ పార్టీ (సిఆల్‌పి) సమావేశం అనంతరం పార్టీ కేంద్ర పరిశీలకుడు మల్లికార్జున ఖర్గే సిఎం అభ్యర్థిగా భూపేష్ బఘేల్ పేరును ప్రకటించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు బాఘెల్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఖర్గే విలేకరులకు చెప్పారు. అయితే ఆయన ఒక్కరే ప్రమాణం చేస్తారని, మరే ఇతర మంత్రి కూడా ప్రమాణం చేయరన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండో వంతు విజయం రావడానికి బఘేల్ నాయకత్వం వహించారు. అయితే ఆయనతో పాటు సిఎం పదవికి తన సహచరులైన టిఎస్ సింఘ్ డియో, టమ్రద్వాజ్ సాహు, చరన్ దాస్ మహంత్‌లు పోటీ పడినప్పటికీ చివరికి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బఘేల్ వైపే మొగ్గు చూపారు. సిఎం అభ్యర్థిని ఎంపిక చేయడం పార్టీ అధినాయకత్వానికి క్లిష్టంగా మారిందని, ఎందుకంటే ఈ నలుగురు నాయకులు కూడా సమానంగా పనిచేశారని ఖర్గే పేర్కొన్నారు. సిఎల్‌పి సమావేశ సందర్భంగా రాహుల్ గాంధీ బఘేల్‌ను సిఎం అభ్యర్థిగా సూచించిన విషయాన్ని తాను ఎంఎల్‌ఎలందరికీ తెలియజేశానని, వారందరు కూడా బఘేల్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించినట్లు ఖర్గే చెప్పారు. దీంతో సిఎల్‌పి నాయకుడిగా బఘేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. అయితే 15 ఏళ్ల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున తమ ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. ఎన్నికల వాగ్దానాలన్నింటినీ అమలు చేస్తామన్నారు. బఘేల్ తన బాధ్యతలను సమర్థవంతగా నిర్వహిస్తారన్న విశ్వాసం తమకు ఉందని ఖర్గే వెల్లడించారు. ఇందిలా ఉండగా, సిఎంగా బఘేల్ నియమితులు కావడం పట్ల ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్‌లో అభినందలు తెలిపింది. ‘సమానత్వం, జవాబుదారీతనం, రైతులకు వాగ్దానం చేసిన రీతిగా రైతు రుణాల మాఫీ ద్వారా విశ్వసనీయతను బాఘెల్ నిలబెట్టుకుంటారని విశ్వసిస్తున్నాం’ అని ఆ ట్వీట్ పేర్కొంది. కాగా, దాదాపు మూడు రోజుల పాటు పార్టీ అధినాయకత్వం విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం దుర్గా జిల్లాలోని పటాన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బఘేల్‌ను పేరును ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించారు. సిఎం పదవికి పోటీ పడిన నలుగురు ఆశావహులతో రాహుల్ అనేక రౌండ్లు చర్చలు జరిపారు.
ఛత్తీస్‌గఢ్ సిఎంగా భూపేష్ బఘేల్
RELATED ARTICLES