భారత రాయబార కార్యాలయం తాత్కాలిక నిర్ణయం
చైనాలో 305కు చేరిన కరోనా మృతులు
ఫిలిప్పీన్స్‌లోని కరోనాకు వ్యక్తి బలి
కేరళలో రెండవ వైరస్ కేసు
బీజింగ్/న్యూఢిల్లీ/తిరువనంతపురం; చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రపం చ దేశాలనూ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల విషయంలో బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం మరింత అప్రమత్తతో వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా తాత్కాలికంగా ఆన్‌లైన్ వీసాలను రద్దు చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. ఈ ప్రాణాంతక మహమ్మారి సృష్టించిన కల్లోలానికి ఇప్పటికే 305 మంది ప్రాణాలు కోల్పోయారు. 14,562 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వీరిలో 315 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. వీరితో పాటు 4,562 మంది అనుమానితుల్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరో 328 మంది వైరస్ బారి నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఈ వైరస్ భారత్, అమెరికా, యుకె, రష్యాతో పాటు మొత్తం 25 దేశాలకు విస్తరించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగానూ ఈ వైరస్ విజృంభిస్తోంది. ఫిలిప్పీన్స్‌లో కరోనా సోకి ఓ వ్యక్తి మరణించారు. చైనా వెలుపల నమోదైన తొలి మరణం ఇదే కావడం గమనార్హం. చైనాలో కరోనా బారిన పడి 305 మంది మృత్యువాతపడినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటన చేసిన కొన్ని గంటల తరువాత ఫిలిప్పీన్స్‌లో తొలి మరణం సంభవించడం గమనార్హం. కాగా, కరోనాకు కేంద్రబిందువైన చైనాలోని హుబేయ్ ప్రావిన్స్‌లోనే మరణాలు సంభవించాయని కమిషన్ వెల్లడించింది. ఫిలిప్పీన్స్‌లో మరణించిన వ్యక్తి సతీమణి వుహాన్‌కు చెందినవారీగా గుర్తించారు. ఆమెలో మాత్రం వైరస్‌కు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. దంపతులిద్దరూ ఇటీవలే వుహాన్ నుంచి ఫిలిప్పీన్స్ వచ్చినట్లు గుర్తించారు. బాధితుడు జనవరి 24న జ్వరంతో ఆస్పత్రిలో చేరగా.. వైద్య పరీక్షల్లో కరోనా వైరస్‌ని గుర్తించారు. తొలుత చికిత్సకు రోగి బాగానే స్పందించి కోలుకున్నాడని వైద్యులు తెలిపారు. కానీ, చివరి 24 గంటల్లో ఆరోగ్య ఒక్కసారిగా విషమించి శనివారం మరణించారని వెల్లడించారు. మరోవైపు ఇప్పటి వరకు దాదాపు 20కి పైగా దేశాల్లో 130 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. అమెరికాలో ఇప్పటి వరకు 8 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. వీరిలో చాలా మంది ఇటీవల హుబి ప్రావిన్సుకు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. వుహాన్ నుంచి ఆదివారం ఢిల్లీకి చేరుకున్న 324 మంది భారతీయులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 14 రోజుల అనంతరం వీరిలో కరోనా లక్షణాలేవీ లేవని నిర్ధారణకు వచ్చిన తర్వాత వీరిని ఇళ్లకు పంపించనున్నారు. ఇదిలా ఉండగా, చైనాలో నెలకొన్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారత్ వెళ్లేందుకు ఇ మంజూరును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు చైనాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. చైనా పాస్ పోర్టులు కలిగి ఉన్నవారితో పాటు చైనాలో నివసిస్తున్న విదేశీయులకూ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే ఇ జారిచేసిన వారికి కూడా అవి చెల్లవంటూ సమాచారం అందించినట్టు ప్రకటనలో పేర్కొంది. ఎవరైనా కచ్చితంగా భారత్‌కు వెళ్లాల్సి ఉంటే మాత్రం అందుకు తగిన కారణాలతో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచించింది.