బీజింగ్ : భూమిపై వున్న మనకు చందమామకు చెందిన ఒక వైపు మాత్రమే కన్పిస్తుంది. అంటే చంద్రునికి వెనుకవైపు (డార్క్‌సైడ్) మనకు కన్పించదు. ఇప్పటివరకు అమెరికా, రష్యా వంటి దేశాలు చంద్రునిపై అడుగుపెట్టినా, స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపించినా…అవన్నీ చంద్రునికి ఇవతలివైపునే కాలుపెట్టాయి. అయితే అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో అంతరిక్షయానంలో పోటీపడుతున్న చైనా దేశం తొలిసారిగా ఒక రోవర్‌ను చంద్రునిపైకి పంపించింది. అది కూడా చంద్రునికి ఆవలివైపున ఉన్న ప్రాంతంలో దిగబోతున్నది. 24 గంటల క్రితమే చైనా చేసిన ఈ ప్రయో గం విజయవంతమైందని చైనా అధికారిక వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. చైనా చంద్రయానానికి చెందిన మిషన్ ‘చాంగ్4’లో భాగంగా ఈ ప్రయోగం జరిగింది. దీనిపేరు చాంగ్4 లూనార్ ప్రోబ్ మిషన్. చాంగ్ అంటే చంద్రదేవత అని చైనాలో అర్థం. చైనాలోని నైరుతి ప్రాంతంలో గల జీచాంగ్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 3బి రాకెట్ ద్వారా ఈ రోవర్‌ను నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ రోవర్ సుదీర్ఘకాలంపాటు ప్రయాణించి చంద్రునికి ఆవలివైపునకు చేరుకుంటుంది. కొత్త సంవత్సరంలో ఈ రోవర్ చంద్రునిపై అడుగుపెట్టవచ్చని చైనా శాస్త్రవేత్తలు చెప్పా రు. ఈ రోవర్ అడుగుపెట్టాల్సిన ప్రదేశాన్ని త్వరలోనే గుర్తిస్తామని చెప్పారు. చంద్రునికి ఆవలివైపున అడుగుపెట్టబోయే తొలి ప్రోబ్ ఇదేనని వారన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగామిగా నిలవడమే లక్ష్యంగా చైనా చేస్తున్న ప్రయోగాల్లో ఇది కీలకమవుతుందని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్‌కు చెందిన ఈ మిషన్ చీఫ్ కమాండర్ హీ రాంగ్వీ తెలిపారు. 2018లో ప్రపంచంలోనే అత్యంత అర్ధవంతమైన, లోతైన అంతరిక్ష అన్వేషణగా ఈ మిషన్ రికార్డు సృష్టించబోతున్నదని ఆయన గ్లోబల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆనాటి కమ్యూనిస్టు సోవియట్ యూనియన్ 1959లో చంద్రుని ఉపరితలం ఉపగ్రహచిత్రాన్ని విడుదల చేసే దాకా చందమామ గురించి ఎవరికీ తెలియదు. ఆ తర్వాత అమెరికా చంద్రునిపై అడుగుపెట్టింది. ఈ రెండు దేశాలు 1960, 70 దశకాల్లో చంద్రునిపై అనేక అన్వేషణలు చేశాయి. ఆ తర్వాత 40 ఏళ్లకు మళ్లీ చైనా తొలి రోవర్‌ను చంద్రునిపైకి పంపించింది. భారత్ కూడా చంద్రయాన్1ను ప్రయోగించినప్పటికీ, అది చంద్రుని వరకు చేరలేదు. త్వరలోనే చంద్రయాన్2 మిషన్‌కు భారత్ సమాయత్తమవుతోంది.