HomeNewsBreaking Newsచైనాపై ఆర్థిక ఆంక్షలు!

చైనాపై ఆర్థిక ఆంక్షలు!

రూ. 470 కోట్ల రైల్వే ప్రాజెక్టు రద్దు
చైనా దిగుమతులపైనా నిషేధానికి కేంద్రం యోచన
చైనా ఉత్పత్తులు విక్రయించబోం : అఖిల భారత వ్యాపారుల సమాఖ్య
చైనా టెలికం ఉత్పత్తులపై దశలవారీగా ఆంక్షలు : సిఓఎఐ
చైనీస్‌ రెస్టారెంట్లకూ, స్మార్ట్‌ఫోన్లకూ ‘గల్వన్‌’ తాకిడి
న్యూఢిల్లీ : గల్వన్‌ లోయ ప్రాంతంలో జరిగిన సరిహద్దు ఘర్షణ భారత్‌, చైనా ఆర్ధిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చైనాపై ఆర్థిక ఆంక్షలు విధించడానికి భారత్‌ సమాయత్తమైంది. వీలైనంతమేరకు చైనాతో ఆర్థిక బంధాన్ని కటీఫ్‌ చేయాలని భావిస్తున్నది. ఇది పూర్తిగా సాధ్యంకాకపోయినప్పటికీ, కొంతమేరకు ఆంక్షలు విధించాలని కేంద్రం యోచిస్తున్నది. తొలి ప్రయత్నంగా చైనా చేతిలో ఉన్న రూ. 470 కోట్ల విలువైన ప్రాజెక్టు కాంట్రాక్టును భారత రైల్వే రద్దు చేసింది. అలాగే చైనా ఉత్పత్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించవద్దని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య తీర్మానించింది. రాష్ట్రాలకు చెందిన వ్యాపార సం ఘాలు కూడా ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నాయి. అంతేగాకుండా చైనా దిగుమతులపై నిషేధానికి త్వరలోనే నిబంధనలు రూపొందిస్తామని ఆహార మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ ప్రకటించారు. మరోవైపు చైనా టెలికం ఉత్పత్తులపై దశలవారీ ఆంక్షలకు సిద్ధమవుతున్నట్లు సిఓఎఐ ప్రకటించింది. చైనా టెలికం ఉత్పత్తుల విషయంలో ప్రైవేటు సంస్థలకు స్వేచ్ఛను ఇస్తున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఆ ఉత్పత్తులపై నిషేధం విధించాలని భావిస్తున్నది. చైనాకు రైల్వే శాఖకు చెందిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (డిఎఫ్‌సిసిఐఎల్‌) గట్టి షాకిచ్చింది. రూ. 470 కోట్ల విలువైన ప్రాజెక్టు కాం ట్రాక్టును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కాన్పూర్‌- దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ సెక్షన్‌ మధ్య 417 కిలోమీటర్ల పొడవు గల రైలు మార్గంలో సిగ్నలింగ్‌, టెలికమ్యూనికేషన్‌ సదుపాయాల కల్పనకై బీజింగ్‌ నేషనల్‌ రైల్వే రీసర్చ్‌, డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌తో 2016లో డిఎఫ్‌సిసిఐఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ కుదిరి నాలుగేళ్లవుతున్నా ఇంతవరకు 20 శాతం పనులు కూడా పూర్తికాలేదు, అయితే 2019 కల్లా ప్రాజక్టు పూర్తి కావాల్సి ఉంది. దీంతో చైనీస్‌ సంస్థ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎఫ్‌సిసిఐఎల్‌ కాంట్రాక్టును తాజాగా రద్దు చేసింది. ఈ క్రమంలో చైనాపై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డిఎఫ్‌సిసిఐఎల్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్న ట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా టెలికం పరికరాలపై భారత్‌ గట్టిగా నే పట్టుబట్టబోతున్నది. చైనా పరికరాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోవాలని ప్రైవేటు టెలికం కంపెనీలను భారత టెలికం శాఖ కో రింది. అయితే రాజకీయ సమస్యలు ప్రభుత్వానికి సంబంధించినవని, అందువల్ల కార్పొరేట్‌ నిర్ణయాలను దీన్ని నుంచి వేరుచేయాలని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సిఓఎఐ) కోరింది. ఈ సంస్థలో వోడాఫోన్‌ ఇండియా, భారతి ఎయిర్‌టెల్‌ వంటి ప్రైవేటు టెలి కం కంపెనీలు సభ్యత్వం కలిగివున్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం 4జి అప్‌గ్రేడేషన్‌కు చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవద్దని ప్రభు త్వం స్పష్టం చేసింది. ఇదే సందేశాన్ని ఎంటిఎన్‌ఎల్‌కు కూడా ప్రభుత్వం పంపించింది. చైనాకు చెందిన ఐదు అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు షియో మీ, వివో, రియల్‌మి, అప్పోల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడనున్నది. అలాగే ఈ సంబంధించిన రిపేర్లు, విడిభాగాల కొనుగోళ్లపై కూ డా ప్రభావం పడవచ్చని భావిస్తున్నారు.కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని, తమ వ్యాపార సంస్థల్లో ఇకపై చైనా ఉత్పత్తులను విక్రయించవద్దని నిర్ణయించింది. సమావేశానంతరం చైనా ఉత్పత్తులను తగలబెడుతూ నిరసనలు తెలిపారు. సరిహద్దుల్లో చైనా, భారత జవాన్ల మధ్య జరిగిన ఘర్షణ నేఫథ్యంలో త్వరలోనే చైనా సహా పలు దేశాల నుంచి చౌకైన, తక్కువ నాణ్యత కల్గిన వస్తువుల దిగుమతులపై నిషేధం విధించేందుకు అవసరమైన నిబంధనలు త్వరలోనే వెల్లడించనున్నట్టు కేంద్ర ఆహార శా ఖమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. ఇరుగుపొరుగు శత్రు దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులను నిషేధించాలని సూచించారు. చైనా వస్తువులను తప్పకుండా నిషేధించాలి.. ఎందుకంటే భారత్‌ పట్ల దూకుడు, శత్రుత్వం తో వ్యవహరించడాన్ని అంత తేలికగా తీసుకోకూడదన్నారు. అటల్‌ బిహా రీ వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో రక్షణమంత్రిగా పనిచేసిన జార్జి ఫె ర్నాండజ్‌ కూడా చైనాను భారత్‌కు నంబర్‌ 1 శత్రువుగా పేర్కొన్నారం టూ పాశ్వాన్‌ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేశారు. శత్రుదేశాల నుంచి వస్తువులు కొనుగోలు చేయాల్సిన అవసరం భారత ప్రజలకు లేదన్నారు. చైనా ఉత్పత్తులతో వ్యాపారం చేసుకుంటున్న చిన్నవ్యాపారులపై ఈ ప్రభావం ఎలా ఉంటుందని ప్రశ్నించగా.. తొలి ప్రాధాన్యం దేశానికేననీ.. ఆ త ర్వాతే సంస్థలు, వ్యక్తుల ప్రయోజనాలు ఉంటాయన్నారు. చైనా ఆహార ఉత్పత్తులను దేశ ప్రజలంతా బహిష్కరంచాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్‌ అథవాలె పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూ డా దేశంలోని చైనా హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం విధించాలని సూచించారు. భారత్‌లో చైనా రెస్టారెంట్లు నిర్వహించేవారు వాటిని మూసివేయాలన్నారు. చైనాకు వ్యతిరేకంగా.. చైనా ఉత్పత్తులకు వ్యతిరేకంగా భారత్‌ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌లో చైనాకు, ఆ దేశ ఉత్పత్తులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments