HomeNewsBreaking News‘చేనేత’పై కేంద్రం చావుదెబ్బ

‘చేనేత’పై కేంద్రం చావుదెబ్బ

దుస్తుల తయారీలో బంగ్లాదేశ్‌, శ్రీలంక కంటే వెనుకబడిన భారత్‌
టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామారావు
టిఆర్‌ఎస్‌లో చేరిన రాపోలు
ప్రజాపక్షం / హైదరాబాద్‌
చేనేతకు చేయూతను ఇవ్వాల్సిన కేంద్రం ప్రభుత్వం ఆ రంగానికి చావుదెబ్బ కొడుతోందని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, చేనేత, జౌళిశాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. వ్యవసాయం తరువాత చేనేత రంగాన్ని గౌరవించిన ప్రభుత్వం కెసిఆర్‌దేనని తెలిపారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నాడు బిజెపి నుండి మాజీ ఎంపి రాపోలు ఆనంద భాస్కర్‌ టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు కెటిఆర్‌ గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎంఎల్‌సి ఎల్‌. రమణ,మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, టిఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ మాట్లాడుతూ చేనేత కార్మికుల పట్ల సమగ్ర అవగాహన రాపోలు ఆనంద్‌ భాస్కర్‌కు ఉన్నదని కొనియాడారు. వ్యవసాయం తరువాత అంతటి స్థాయి, పరిపుష్టి ఉన్న రంగం చేనేత రంగమని, కానీ మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వానికి చేనేత రంగానికి సంబంధించి కనీసం ఒక పాలసీ లేదని విమర్శించారు. దుస్తుల తయారీలో బంగ్లాదేశ్‌, శ్రీలంక కంటే భారతదేశం వెనుకబడి ఉన్నదన్నారు. చేనేత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం ఎంతో చేశామని, చేనేతలో పరుగులు పెడుతున్న రాష్ట్రాలకు సహకరించాలని ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరామని, చేనేత అభివృద్ధి కోసం కేంద్రానికి డిపిఆర్‌ ఇచ్చామన్నారు. చేనేత కళాకారులకు కేంద్రం ప్రోత్సాహకాలు అందడం లేదని వాపోయారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, చేనేత లక్ష్మీ, పేరుతో రాష్ర్ట ప్రభుత్వం నేతన్నను ఆదుకుంటోందని, కొవిడ్‌ సమయంలో రూ.100 కోట్లు చేనేత రంగానికి కెసిఆర్‌ ప్రభుత్వం ఇచ్చిందని వివరించారు. నేతన్నకు బీమా పేరుతో ఇన్సూరెన్స్‌ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్‌దేనని చెప్పారు. వర్కర్‌ను యజమానిగా, శ్రామికుడిని- పారిశ్రామిక వేత్తగా తీర్చిదుద్దుతున్న ప్రభుత్వం తమదని, చేనేతకు చేయూతను ఇవ్వాల్సిన కేంద్రం చావుదెబ్బ కొడుతోందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఒక్క పని ఇవ్వలేదు…కానీ ఉన్నవి మాత్రం రద్దు చేసుకుంటూ పోతోందన్నారు. 8 ఏళ్ల మోడీ పాలనలో 8 సంస్థలను రద్దు చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. పోస్ట్‌ కార్డ్‌ ద్వారా మోడీని కదిలిస్తామని రమణ తెలిపారు. రాపోలు ఆనంద్‌ భాస్కర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమసమయంలో తెలంగాణ కోసం అవమానాలకు గురైన వ్యక్తినని , బిజెపి తనను చాలా హింసకు గురిచేసిందన్నారు. జాతీయ స్థాయిలో బిజెపికి ప్రత్యామ్నాయ శక్తి బిఆర్‌ఎస్‌ కాబోతుందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments