HomeNewsBreaking Newsచేనేతకు చేయూతనిచ్చి కాపాడుతాం…

చేనేతకు చేయూతనిచ్చి కాపాడుతాం…

మంత్రి కెటిఆర్‌
ప్రజాపక్షం/యాదాద్రి
చేనేతకు చేయూతనిచ్చి ప్రతి చేనేత కుటుంబానికి లాభాలు తేవడమే ముఖ్యమంత్రి లక్ష్యమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, చేనేత జౌళి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం భూదాన్‌ పోచంపల్లిలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కళా పునర్వి ఇంటిగ్రేటెడ్‌ హ్యండ్లూమ్‌ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం పద్మశాలి నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెజ్‌ నాన్‌ నైజ్‌ మార్కెట్‌ భవన నిర్మాణం, దోభీఘాట్‌ నిర్మాణ పనులకు, సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, సిసిరోడ్లు, సైడ్‌ డ్రైన్లకు ప్రారంభోత్సవం చేసి పోచంపల్లి హ్యండ్లూమ్‌ పార్క్‌ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక బాలాజీ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చేనేత మిత్ర పేరుతో 50 శాతం సబ్సిడీ, నూలు మీద రసాయనాలు ఇచ్చినా, నేతన్నలకు చేయూత నియ్యడమే ముఖ్యమంత్రి లక్ష్యమని, అందుకే నేతన్నలకు బీమా కల్పించడం కెసిఆర్‌కు మాత్రమే సాధ్యమైందని మంత్రి అన్నారు. కొయ్యలగూడెం, గట్టుప్పల్‌, పుట్టపాక, పోచంపల్లి, నల్లగొండ ప్రాంతాలకు అధికారులను పంపించి చేనేత కార్మికుల వాస్తవ స్థితిగతుల పట్ల ఫీడ్బ్యాక్‌ తెలుసుకున్నామని
చెప్పారు. 12 కోట్ల 50 లక్షల రూపాయలతో కనుముక్కల లోని హ్యాండ్లూమ్‌ పార్క్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, దానిని తిరిగి త్వరలోనే తెరవబోతున్నామని అన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులకు ప్రతి ఒక్కరికి నెలకు 3 వేల రూపాయలను వచ్చే నెల నుండి నేరుగా వారి ఖాతాలోనే జమ చేయడం జరుగుతుందని తెలిపారు. నేతన్నకు బీమా పథకం సరళీకృతం చేసి 75 ఏళ్లు వచ్చేవరకు పథకాన్ని వర్తించేలా చేశామని, దీనివలన వేలాదిమంది నేతన్నలకు లాభం కలుగుతుందని తెలిపారు. చేనేత కార్మికుల ఆరోగ్య స్థితిగతుల పట్ల ప్రభుత్వం ఆలోచన చేసి తెలంగాణ నేతన్న హెల్త్‌ కార్డు మంజూరు చేస్తామని, తద్వారా 25 వేల రూపాయల వరకు వైద్య సేవలు అందుతాయని, ప్రతి ఒక్కరూ నూతన హెల్త్‌ కార్డు తీసుకోవాలని కోరారు. చేనేత కళను ఆదుకోవాలంటే ఆధునీకరణ అవసరమని, అందుకే గుంట మగ్గాల స్థానంలో 40 కోట్ల రూపాయలతో తెలంగాణ చేనేత మగ్గం కార్యక్రమాన్ని తెచ్చామని, అందరూ తమ గుంట మగ్గానికి బదులుగా ఫ్రేమ్‌ లూమ్స్‌ మార్చుకోవాలని తెలిపారు. చేనేత ఉత్పత్తులను ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని, ఉప్పల్‌ భగాయత్‌ లో ప్రభుత్వమే హాండ్లూమ్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నదని, చేనేత లందరూ దానిలో భాగస్వామ్యం అయి పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్క్‌ ను ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోలేదని, 23 ఎకరాలలో ఉన్న పార్కు ను అవసరమైతే పది పదిహేను కోట్లు అదనంగా ఖర్చు చేసి బ్రహ్మాండంగా తయారు చేస్తామని, అందులోంచి వచ్చే లాభాలు పోచంపల్లి మండలంలోని ప్రతి నేత కుటుంబానికి నెలకిన్ని అని అందచేస్తామని అన్నారు.
అనంతరం మంత్రి చేనేతరంగాన్ని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేయించారు.

రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జి. జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాక ముందు నేత కార్మికుల ఆకలి చావులను అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని, చేనేత కార్మికులు ఉన్నారన్న విషయం కూడా వారు పట్టించుకోలేదని, ప్రపంచానికి నాగరికత నేర్పినవారనే సోయి కూడా అప్పటి ప్రభుత్వాలకు లేదని, ఏ ఒక్కరోజు కూడా నేత కార్మికులు ఆత్మాభిమానం కలిగిన వారుగా ఈ ప్రపంచంలో గుర్తించడానికి వారికి ఆలోచన రాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్‌ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు, గాదరి కిషోర్‌, నకిరేకల్‌ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి, దేవరకొండ శాసనసభ్యులు రవీంద్ర కుమార్‌, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్‌ భాస్కర్‌, రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్‌ బుద్ధ ప్రకాష్‌, డైరెక్టర్‌ అలుగు వర్షిణి, జిల్లా కలెక్టర్‌ టి. వినయ్‌ కృష్ణారెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జి.వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కరరావు, డిసిసిబి ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి, పోచంపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ విజయలక్ష్మి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments