ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోనే మాయమవుతున్న చెరువు
128 ఎకరాలకు..
మిగిలింది 70 ఎకరాలే
ప్రజాపక్షం/ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణల జోరు పతాక స్థాయికి చేరింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త పుంజుకోవడంతో స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇందులో దంసలాపురం చెరువు ఆక్రమణలకు గురై మాయమయ్యే పరిస్థితి ఏర్పడింది. దంసలాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.178లో 128.14 ఎకరాల్లో చెరువు విస్తరించి ఉంది. ఈ చెరువు కింద సుమారు 1500 ఎకరాలు సాగయ్యేది. ఇదే చెరువుపై ఆధారపడి 1991లో మత్స్య సహకార సంఘం కూడా ఏర్పాటైంది. ఖమ్మం నగరం విస్తరించడం, సాగు భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా చేసి ప్లాట్లుగా విక్రయించడంతో ఇప్పుడు సాగుభూమి తగ్గిపోయింది. చెరువుకు నీటి వనరు గ్గిపోయింది. చెరువు పైభాగంలో ఖమ్మంలోనే అతి ఖరీదైన రోటరీనగర్, శ్రీనగర్ కాలనీ తదితర కాలనీలు వచ్చాయి. ఇప్పుడు చెరువు చుట్టూ ఖమ్మం కార్పొరేషన్ విస్తరించింది. చెరువు కూడా కార్పొరేషన్ పరిధిలోకి రావడంతో ఇక్కడ ఒక్కో ఎకరం ధర రూ.2కోట్ల పైమాటే. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను దంసలాపురం చెరువుపై పడింది. చెరువు లోతట్టులో మొత్తం మట్టిని తోలి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మలిచారు. ఎవరికి ఎంత అందితే అంతమేర ఆక్రమణకు పూనుకున్నారు. ఇప్పుడు చెరువు చుట్టూ రియల్ ఎస్టేట్ వెంచర్లే. చెరువు లోతట్టు కనుమరుగై పోతుంది.
మామూళ్ల మత్తులో రెవెన్యూ : ఈ చెరువు సర్వే నెం.178లో ఉండగా చెరువు చుట్టూ కొంత మంది రైతుల పట్టా భూములు ఉన్నాయి. ఇందులో కొన్ని సర్వే నెంబర్లకు రెవెన్యూ అధికారులు బై నెంబర్లు వేసి చెరువు శిఖాన్ని కొందరికి పట్టా చేశారు. ఈ చెరువు ఆక్రమణ ప్రారంభమై ఇప్పటి వరకు ఐదుగురు కలెక్టర్లు, దాదాపు ఏడెనిమిది మంది తహసీల్దార్లు పనిచేసినా ఈ చెరువు గురించి పట్టించుకున్న నాథుడే లేడు. అనేకమంది ఈ ఆక్రమణలపై ఫిర్యాదు చేసినా ఫిర్యాదు పత్రాలన్నీ చెత్త బుట్టలకు చేరుకుంటున్నాయి. రెవెన్యూ అధికారులే ఆక్రమణదారులకు వత్తాసు పలకడంతో కంచె చేను మేసిన సామెతగా పరిస్థితి తయారైంది. పదుల సంఖ్యలో వాహనాలతో పగలు, రాత్రి అనే భేదం లేకుండా చెరువును పూడ్చివేస్తుంటే ఏ రెవెన్యూ అధికారి కన్ను ఆ వైపు చూడలేదంటే మామూళ్ల మత్తు ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతుంది. ఖమ్మం నగరంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బై నెంబర్లు వేసి ఆక్రమణదారులను పట్టాదారులుగా తయారు చేసిన రెవిన్యూ అధికారులే రియల్ ఎస్టేట్ వెంచర్లకు నిరభ్యంతర పత్రాలు జారీ చేస్తున్నారు. ఇది ఆక్రమణ భూమి కాబట్టి ఎటువంటి ధృవపత్రాలు ఇవ్వకూడదు. పట్టాదారు భూములైనప్పటికీ చెరు వు శిఖాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వకూడదు. కానీ ఖమ్మం లో ఏకంగా చెరువును ఆక్రమించి రియల్ ఎస్టేట్ చేస్తున్నా అందిన కాడికి పుచ్చుకుని అనుమతులు ఇచ్చేస్తున్నారు.