ముగ్గురు విషాద మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామంలో ఘటన
రామన్నపేట : ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెరువులో పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామ శివారులోని ఈదుల చెరువులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సర్నేనిగూడెం సర్పంచ్ ధర్నే రాణి భర్త ధర్నే మధు(38), కుమారుడు ధర్నే మణికుమార్ (10), సర్నేనిగూడెం గ్రామ పరిధిలోని మధిర గ్రామ సాగుబావిగూడెంకు చెందిన నన్నూరి శ్రీధర్‌రెడ్డి(26) శుక్రవారం కారులో వెల్లంకి గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నారు. కారును నీటితో కడిగిన అనంతరం అదే కారులో సాయంత్రం 4గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి ఈదుల చెరువులోకి దూసుకెళ్లి నీటిలో మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాద విషయం చాలా సమయం వరకు ఎవరికి తెలియరాలేదు. ప్రమా దం జరిగిన 15 నిమిషాల తరువాత చెరువులో గల్లంతైన వారి సెల్‌ఫోన్స్ స్విచ్‌ఆఫ్ కావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై వారి ఆచూ కీ కోసం గాలింపుచర్యలు చేపట్టారు. ఆచూకీ లభించకపోవడంతో శనివారం ఉదయం రామన్నపేట పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెల్లంకి గ్రామంలోని సిసి టివి పుటేజీల ఆధారంగా కారు చెరువు వైపునకు వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు, స్థానిక గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టగా చెరువు వద్ద కారు ప్రమాదానికి గురైనట్లు ఆనవాలు గుర్తించారు. ఈతగాళ్లు చెరువు నీటిలో వెతికి చూడగా కారు మునిగిపోయి ఉన్నట్లు గుర్తించారు. సుమారు నాలుగు గంటలసేపు పోలీసులు, గ్రామస్థులు శ్రమించి కారును బయటకుతీసి చూడగా కారులో ముగ్గురు మృతి చెంది ఉన్నారు. మృతదేహాలను రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎంఎల్‌ఎ చిరుమర్తి లింగయ్య ఘటనా స్థలానికి చేరుకోని ఆరా తీశారు. మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు. విషయం తెలుసుకున్న వందలాది మంది తరలిరావడంతో ప్రమాద ప్రాంతం కిక్కిరిసిపోయింది. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో విషాదకరంగా మారింది. భువనగిరి డిసిపి నారాయణరెడ్డి, ఆర్‌డిఒ సూరజ్‌కుమార్, చౌటుప్పల్ ఎసిపి సత్తయ్యలు ఘటనా స్థలానికి చేరుకోని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రామన్నపేట సిఐ రంగా, ఎస్‌ఐ సాయిలు పోలీస్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు.
చెరువులోకి దుమికిన కారు
RELATED ARTICLES