HomeNewsBreaking Newsచూస్తూ ఊరుకోం

చూస్తూ ఊరుకోం

లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తాం
సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య ఎవ్వరూ బయట కనపడొద్దు
గుంపులు గుంపులుగా తిరగొద్దు
జీవో 45 కఠినంగా అమలు
ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌
హైదరాబాద్‌: ఆదివారం జనతా కర్ఫ్యూతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు సోమవారం ఉదయం ఒక్కసారిగా రోడ్లపై వచ్చారు. అయితే, ప్రభుత్వ ప్రకటనను ప్రజలు ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇష్టారీతిన రోడ్లపై సంచరించారు. గుంపులు గుంపులుగా గుమిగూడారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డిజిపి ఎం.మహేందర్‌రెడ్డిలు సోమవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించని వారిపై కేసుల నమోదుకు ఆదేశాలు జారీచేశారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్‌ చేయాలని ఆదేశించారు. ప్రజాహితం కోసం చేపట్టిన లాక్‌డౌన్‌కు సహకరించాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిజిపి మహేందర్‌రెడ్డితో కలిసి సోమేశ్‌కుమార్‌ మాట్లాడారు.
బయట తిరిగితే పాస్‌పోర్ట్‌ సీజ్‌
రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు గాను ఎపిడమిక్‌ యాక్టు 1897 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని సోమేశ్‌కుమార్‌ అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు హోమ్‌ క్వారంటైన్‌కు పరిమితం కావాలన్నారు. ఎవరైన బయట తిరిగినట్లు తెలిస్తే వారి పాస్‌పోర్ట్‌ను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కేవలం అత్యవసర సర్వీసులు మినహా పూర్తిస్థాయిలో ఈనెల 31 వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను అమలు చేస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచే వారిపై, బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. గ్రామాల్లో వ్యవసాయ, కూరగాయల సాగు పనులు చేపట్టుకోవచ్చని స్పష్టం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సమూహాలుగా కాకుండా పరిమిత సంఖ్యలో పనులు చేపట్టవచ్చునన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన లాక్‌డౌన్‌లో భాగంగా అంతర్‌ రాష్ట్ర సరిహద్దులన్నీ మూసివేశామన్నారు. ఇప్పటికే ఆర్‌టిసి బస్సులు, ప్రయివేట్‌ వాహనాలు, ఆటోలు, క్యాబ్‌ అన్నింటికి లాక్‌డౌన్‌ వర్తిస్తుందన్నారు. ఎక్కడ కూడా 5 మంది కంటే గుమిగూడాకూడదని స్పష్టం చేశారు. జీవో 45లో ఉన్న ప్రతి అంశాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో అన్నిరకాల పరీక్షలు వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రోడ్లపై ఎక్కడ ఎలాంటి వాహనాలు నడవడానికి వీలులేదని, ముఖ్యంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవ్వరు బయట తిరిగినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించా రు. ప్రకృతి విపత్తు సహాయక శాఖతో పాటు ఇతర అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ శాఖలు పని చేస్తాయని అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని సోమేశ్‌ కుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలు స్వీయ నిర్భంధంలో ఉండాలి : డిజిపి మహేందర్‌రెడ్డి
ప్రజలందరూ స్వీయ నిర్భంధం ఉండాలని డిజిపి మహేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం కోసమే పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తారని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజా శ్రేయస్సు, ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్‌ వరకు తెలంగాణ లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జివో 45ను పటిష్టంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వాహనాలను నిషేదిస్తున్నామని, ఎమర్జెన్సీ సర్వీసులు, అత్యవసర శాఖల వాహనాలు, మీడియా వాహనాలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ వెహికిల్స్‌ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలని, తమ ఇళ్లకు సమీపంలో ఉన్న దుకాణాలనుండి మాత్రమే నిత్యావసర వస్తువులు తేవడానికి మాత్రమే వ్యక్తిగత వాహనాలను ఉపయోగించాలని సూచించారు. టు వీల్లర్‌ పై ఒకరు, ఫోర్‌ వీల్లర్‌లో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని స్పష్టం చేశారు. ఆటోలకు అనుమతి లేదని, ఈ విషయాన్ని ఆటో అసోసియేషన్‌లకు సమాచారం ఇచ్చామన్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈనెల 31 వతేదీ వరకు క్రమశిక్షణతో ఉండాలని స్పష్టం చేశారు. సమస్యను అరికట్టాలంటే ప్రజలేవరూ రోడ్ల పైకి రావద్దని డిజిపి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమాజం కోసం పోలీసులు లాక్‌డౌన్‌ను స్ట్రీక్ట్‌గా ఆంక్షలు అమలు చేస్తారని అన్నారు. ఇందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. వాహనాలు, ప్రజల రాకపోకలను నివారించేందుకై ప్రతి పోలీస్‌ స్టేషన్‌ లిమిట్స్‌లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయిస్తామని మహేందర్‌ రెడ్డి చెప్పారు. ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారని, సరైన కారణం లేకుండా ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే సంబంధిత వాహనాన్ని సీజ్‌ చేస్తారని, సీజ్‌ చేసిన వాహనాలు వైరస్‌ తీవ్రత తగ్గిన తరువాత ఇస్తామన్నారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ పిలుపునిచ్చారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆటోలను, క్యాబ్లను, ప్రయివేటు వాహనాలను సీజ్‌ చేయాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌ రూల్స్‌ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ను అమలు చేయడం వల్ల కరోనాను నియంత్రించవచ్చున్నారు. నియమాలు, చట్టాలు కఠినంగా అమలు చేసిన నగరాల్లో కరోనా నియంత్రణలో ఉందని స్పష్టం చేశారు. ఏ వ్యక్తి బయటకు రావాలన్నా జీవో ప్రకారం నడుచుకోవాన్నారు. ప్రతి చోట పోలీస్‌ చెకింగ్‌ ఉంటుందని డిజిపి తేల్చిచెప్పారు. వాహనాలపై దూర ప్రాంతాలకు అనుమతించమని పేర్కొన్నారు. పెట్రోల్‌ బంకులు, కిరాణా షాపులు, కూరగాయాల దుకాణాలకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నామన్నారు. నిత్యావసర వస్తువుల షాపులన్నింటినీ అన్ని రాత్రి 7 గంటలకు మూసివేయాలన్నారు. ప్రతీ వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారని… ప్రైవేట్‌ వెహికిల్స్‌ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. జి.ఓ 45 ద్వారా ప్రజలకు అన్ని విషయాలను తెలియ చేశామన్నారు. ఇక మీడియాకు ఎక్కడైనా తిరిగే అనుమతి ఉంటుందని తెలిపారు. మన భవిష్యత్‌ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చట్టం చాలా కఠినంగా అమలు చేయాలని రేంజ్‌ ఐజీలు, డీఐజీలు, పోలీస్‌ కమీషనర్లు, ఎస్‌.పీలను ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల అతిక్రమణలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు పెట్టడం జరుగుతుందన్నారు. లాక్‌డౌన్‌ అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌ పోస్టూలు ఏర్పాటు చేశామని, నేడు మధ్యాహ్నం నుంచి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ సమావేశంలో అదనపు డిజిపి జితేందర్‌ పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments