పాలించే అర్హత కెసిఆర్‌కు లేనేలేదు
విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే నైతిక బాధ్యత
ప్రజాస్వామ్య పరిరక్షణకే ప్రజాచైతన్య యాత్ర
కాంగ్రెస్ శాసనసభా పక్షనేత భట్టివిక్రమార్క
ప్రజాపక్షం/ భద్రాచలం : తెలంగాణ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని, ఫామ్‌హాస్ ఫాలనతో రాష్ట్ర వ్యవహారాలు దిగజారి పోయాయని, ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేస్తున్న కెసిఆర్ ఆగడాలను ఇక చూస్తూ ఊరుకునేది లేదని కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దీనిపై ప్రజలను చైతన్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రను ప్రజాభిష్టం మేరకు పరిపాలన చేసిన శ్రీ సీతారాములవారి సన్నిధానం నుండి చేపట్టామని, ఆసిఫాబాద్ వరకు ఈ యాత్ర కొనసాగుతుందని ఆయన చెప్పారు. ముందుగా రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయ న అనతరం ఎమ్మెల్యే పొదెం వీరయ్య క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇతర పార్టీల్లో గెలిచిన శాసనసభ్యులను టిఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని, అదిరింపు, బెదిరింపులతో లొంగదీసుకుంటున్నారని దేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించారని, మన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు ఎంతో గర్వంగా పొగిడాయని, ప్రపంచ మేధావిగా అన్ని దేశాలవారు అంబేద్కర్‌ను గుర్తించారని చెప్పారు. అలాంటి మేధావి ద్వారా రూపొందించబడ్డ రాజ్యాంగాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి అగౌరపరుస్తున్నారనిన్నారు. కెసిఆర్ చేతిలో నలిగిపోతున్న రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన వసరం ఎంతైనా ఉందని, దీని ద్వారా పరిపాలన జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణలో నియంతపాలన సాగుతోందని, అన్ని వర్గాల వారిని అణిచేస్తూ బాంచన్ దొరా అనే సాంప్రదాయాన్ని తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన కంటే ఇతర పార్టీల్లో ఉన్న వారిని ఎలా లాక్కోవాలో అనే దానిపైనే కెసిఆర్‌కు శ్రద్ధ ఉందని, రాష్ట్రంలో ప్రతిపక్షం అంటూ లేకుండా చేయాలనే దురాలోచనలో ఈ ప్రభుత్వంకు ఉందని ఎద్దేవా చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఈ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని, విద్యార్థులంటే ఇంత అలుసా అని ప్రశ్నించారు. ఇంటర్ జవాబు పత్రాలు దిద్దే పనిని గ్లోబరీనా అనే సంస్థకు అప్పగించిన ఈ ప్రభుత్వం.. పెద్ద తప్పు చేసిందని, ఆ సంస్థపై గతంలో అనేక కేసులు ఉన్నాయని, అది తెలిసినప్పటికీ ఈ ప్రభుత్వం ఏ విధంగా వారికి ఈ వ్యవహారాన్ని కట్టబెట్టిందో సమాధానం చెప్పి తీరాలన్నారు.