తాత్కాలిక సచివాలయంలో బాధ్యతల స్వీకరణ
2025 ఏప్రిల్ వరకు పదవిలో కొనసాగింపు
రాష్ట్ర మొదటి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చరిత్ర పుటల్లోకి
ప్రజాపక్షం / హైదరాబాద్ తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సిఎస్)గా 1989 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందిన ఎ.శాంతి కుమారి నియమితులయ్యారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆమె ను సిఎస్‌గా నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ అ య్యాయి. తెలంగాణ రాష్ర్ట మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి (సిఎస్)గా శాంతికుమారి చరిత్ర పుటల్లోకి ఎక్కారు. తనకు సిఎస్‌గా అవకాశం కల్పించినందుకు ప్రగతిభవన్‌కు వెళ్లి సిఎం కెసిఆర్‌కు శాంతి కుమారి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి మధ్యాహ్నం 3.15 గంటలకు తాత్కాలిక సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇవ్వడం పట్ల సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ర్ట అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో సహచర అధికారులతో సమన్వయంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ర్ట ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఎస్‌ను పలువురు ఉన్నతాధికారుల అభినందనలు తెలియజేశారు. ఇప్పటి వరకు శాంతికుమారి అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఎంఎస్‌సి మెరైన్ బయాలజీ చదివిన ఆమె అమెరికాలో ఎంబిఎ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఎఎస్‌గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్‌మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టిఎస్ ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా పని చేశారు. కాగా శాంతికుమారి సర్వీసు 2025 ఏప్రిల్ వరకు కొనసాగనుంది. అంటే రెండున్నరేళ్ళ పాటు సిఎస్ పదవిలో కొనసాగనున్నారు. ఆమెకు ముందు ఉన్న ఐఎఎస్ అధికారులు రాణి కుమిదిని జూన్ నెలలో, రజత్ కుమార్ నవంబర్‌లో రిటైర్ కానున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేరు చివరి వరకు పరిశీలనలో ఉన్నప్పటికీ, ఆర్థిక శాఖకు ఆయన అవసరం ఉన్నందున అక్కడే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపిసింది. ఆయన 2025 ఆగస్టులో రిటైర్ అవుతారు. సిఎస్ రేసులో ఉన్న మరో ఐఎఎస్ అధికారి అర్వింద్ కుమార్ సర్వీసు 2026 ఫిబ్రవరి వరకు కొనసాగనుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించిన శాంతి కుమారికి బిఆర్‌కె భవన్‌లో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
నేడు ఎపిలో జాయిన్ కానున్న సోమేశ్‌కుమార్
తెలంగాణ నుండి ఎపి క్యాడర్‌కు కేటాయించబడిన మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో చేరనున్నారు. అనంతరం ఆయన దీర్ఘ కాలిక సెలవుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
చీఫ్ సెక్రటరీగా శాంతికుమారి
RELATED ARTICLES