ఖాతాదారుల సొమ్మంతా రియల్ ఎస్టేట్‌కు
నిలదీస్తే ప్రైవేటు సైన్యంతో దాడులు
యజమానులకు రాజకీయ అండదండలు
ఆందోళన చెందుతున్న బాధితులు
ప్రజాపక్షం/వరంగల్ బ్యూరో అవి చిట్ ఫండ్స్ కాదు.. ‘చీ’ట్’ ఫండ్స్.. అడుగడుగునా అందమైన పేర్లతో, కార్పొరేట్ కార్యాలయాల లుక్‌తో ప్రజలను నిండా ముంచడమే లక్ష్యంగా ఏర్పడిన కంపెనీలు.. ఒకటి కాదు.. రెండు కాదు.. వందలాది ప్రైవేటు కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలసి జనం జేబులు గుల్ల చేస్తున్నాయి. సామాన్యులు ఎంతో కష్టపడి.. రూపా యి రూపాయి కూడబెట్టి నెలా నెలా చిట్టీలు కడితే.. గడువు పూర్తయినా చిట్టీ డబ్బులు ఇవ్వరు. ఇదేమని ప్రశ్నిస్తే ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దాడులకు దిగుతారు.. ఇదీ నేడు చిట్‌ఫండ్స్ కంపెనీల పేరుతో జరుగుతున్న దందా… దీని వెనుక ఎంఎల్‌ఎలు, రాజకీయ నాయకులు, లీగల్ సలహాదారుల పేరుతో న్యాయవాదులు, సహకరించేందుకు అధికారులతో పాటు చూసీ చూడకుండ వదిలేసే పోలీసుల సహకారం ఉంది. ఇలా ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 269 చిట్ ఫండ్స్ కంపెనీలు ఉండగా ఇప్పటికే 9 బోర్డు తిప్పేశాయి. ఈ చిట్ ఫండ్స్ కంపెనీలు దాదాపు రూ.150 కోట్ల వ్యాపా రం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిట్‌ఫండ్ కంపెనీల మోసాలు నిత్యకృత్యంగా మారాయి. అడుగడుగునా నిబంధనలకు తూట్లు పొడుస్తూ పొదుపుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. యాజమాన్యాలకు రాజకీయ అండదండలు ఉండటంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు చిట్‌ఫండ్ కంపెనీల లావాదేవీలను పరిశీలిస్తూ.. పర్యవేక్షించాల్సిన అధికారులు కళ్లు మూసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
వందలాది మంది పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు తీసుకోవాలని కోరినా దాదాపుగా కేసులు నమోదు కావడం లేదని సమాచారం. పోలీస్ స్టేషన్లకు వెళ్లినా కనీస న్యాయం జరగడం లేదన్న మాట వినిపిస్తోంది. పొదుపు డబ్బులు అందజేయాలని ప్రశ్నించిన వారిపై దాడులు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. బాధితులపైనే ఉల్టా కేసులు నమోదయ్యేలా ప్రయత్నాలు జరిగిన ఘటలు ఉండటం గమనార్హం. చిట్‌ఫండ్ కంపెనీల దౌర్జన్యాలు, దాష్టీకాలు వరంగల్‌లో షరామాములైపోయాయి. ఈ నెల 3న హన్మకొండ కుమార్‌పల్లిలోని సెల్ షాపు నిర్వాహకుడు రాజుకు నిప్పు పెట్టిన ఘటన పరిస్థితిని తెలియజేస్తోంది. వరంగల్‌లో చిట్‌ఫండ్ కంపెనీల్లో జరుగుతున్న అక్రమాలను చూస్తుంటే ఆ కంపెనీలకు ప్రముఖుల అండదండలు ఉన్నట్లు స్పష్టమవుతున్నది.
రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడి
వరంగల్ ఉమ్మడి జిల్లాలో గడిచిన ఐదారు సంవత్సరాల్లో వందల సంఖ్యలో చిట్‌ఫండ్ కంపెనీలు కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. వీటి లక్ష్యం స్థిరాస్తి, నిర్మాణ రంగమే అవుతోంది. కొందరయితే అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. పొదుపుదారుల నుంచి సేకరించిన మొత్తాలను సదరు సంస్థ ఆర్థిక లావాదేవీలకు వినియోగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అనుబంధ వ్యాపారాలైన స్థిరాస్తి, నిర్మాణ రంగాల్లోకి మళ్లిస్తుండటంతోనే సమస్య మొదలవుతోంది. పొదుపుదారుడికి గడువులోపు మొత్తాలను చెల్లించకుండా ఏడెనిమిది నెలల పాటు సంస్థ చుట్టూ తిప్పుకుంటున్నాయి. చిన్న సంస్థ నుంచి మొదలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన అనేక సంస్థల్లోనూ ఇదే అక్రమ విధానం కొనసాగుతోంది. సంస్థపై నమ్మకంతో పొదుపు చేద్దామని వచ్చిన వారికి కంపెనీలు చుక్కలు చూపెడుతున్నాయి.
రాజకీయ నాయకుల అండదండలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గడిచిన ఐదారు సంవత్సరాల్లోనే వందల సంఖ్యలో చిట్‌ఫండ్ కంపెనీలు వెలిశాయి. వరంగల్, హన్మకొండ జిల్లా కేంద్రాల్లో ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన సంస్థలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ప్రముఖ సంస్థల్లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నేతలు ప్రధాన వాటాదారులుగా ఉన్న సంస్థలూ ఉన్నాయి. ఈ కంపెనీల్లో జరిగే అవినీతి అక్రమాలపై ఎలాంటి చర్యలు లేకుండా ఉండేందుకు పెద్ద నేతలు, ప్రజాప్రతినిధుల సాయంతో రెవెన్యూ, పోలీస్‌శాఖలను గుప్పిట బిగించేస్తున్నారు. ఫిర్యాదులపై స్పందించకుండా పోలీస్‌శాఖకు ఆదేశాలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అనేక మంది పొదుపుదారులు వివిధ చిట్‌ఫండ్ కంపెనీలపై ఫిర్యాదు చేసినా కేసులు నమోదు కాకపోవడం వెనుక విషయం ఇదేనని తెలుస్తోంది.
‘చీ’ట్ ఫండ్స్
RELATED ARTICLES