HomeNewsBreaking Newsచివరి రక్తపుబొట్టు వరకుదేశం కోసం పోరాటం

చివరి రక్తపుబొట్టు వరకుదేశం కోసం పోరాటం

దేశాన్ని కాపాడేందుకు ఎన్ని ఇబ్బందులొచ్చినా రాజీపడొద్దు
ఇఫ్తార్‌ విందులో ముఖ్యమంత్రి కెసిఆర్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌ భారత దేశం మనందరిదని, చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు దేశం కోసం పోరాడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజీపడకుండా చివరి వరకు పోరాడాలని, చివరకు న్యాయమే గెలుస్తుందని అన్నారు. గంగా జమునా తెహజీబ్‌ సంస్కృతి విశిష్టమైందన్నారు. దేశం ఒక మంచి నాయకుడు, పార్టీ కోసం ఎదురుచూస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఎల్‌బి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్‌ హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,17,115 ఉండగా, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కర్నాటక వంటి పెద్ద పెద్ద రాష్ట్రాలకంటే మనం ముందంజలో ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తలసరి విద్యుత్‌ వినియోగం 1000 నుండి 1050 యూనిట్లు ఉండేదని, నేడు రెండింతలు పెరిగి 2100 యూనిట్లకు చేరుకున్నదని తెలిపారు. పరిశ్రమలు, ఐటి రంగంలో పురోగమిస్తున్న తీరును అందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. గతంలో లాగా రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు లేవని,జీవన పోరాటంలో భాగంగా బయటి రాష్ట్రాలకు వెళ్ళిన రైతులు నేడు వారి వారి ఊళ్లకు తిరిగి వచ్చారని తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో 94 లక్షల ఎకరాల్లో వరి పంటను పండించుకున్నామనే విషయాన్ని తాను గర్వంతో చెబుతున్నానన్నారు.
దేశం వెనుకబడుతున్నది:
మనం ముందుకు సాగుతున్నామని, కానీ దేశం వెనుకబడిపోతున్నదని, ఈ విషయాన్ని చెప్పేందుకు తాను ఇబ్బంది పడటం లేదని సిఎంకెసిఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం తీరుగా శ్రమిస్తే దేశ జిడిపి కనీసం మరో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు పెరిగేదని, ఈ విషయంలో మనం దెబ్బతిన్నామన్నారు. ఈ రోజు దేశం అగమ్యగోచర స్థితిలో పయనిస్తున్నదనే విషయం మనందరికీ తెలుసన్నారు. చిన్న, చిన్న కష్టాలు వస్తూనే ఉంటాయని, ‘మీ’ సహకారం ఉంటే చివరి వరకు పోరాడుతూనే ఉందామని, ఇది తాత్కాలిక దశ అని,ఈ సమయంలో ఒనగూరేదేమీ ఉండదని, తుదకు న్యాయమే గెలుస్తుందని కెసిఆర్‌ తెలిపారు. దేవుని వద్ద ఆలస్యం కావచ్చు కానీ చేరుకోవడం తథ్యమన్నారు. తెలంగాణ కోసం పోరాడినట్లుగానే ఉజ్వల భారతదేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి లక్ష్యం చేరుకోవడం తథ్యమన్నారు.
‘మార్చాలనుకుంటే వారే అంతమవుతారు’:
ఈ దేశంలోని గంగా జమున సంస్కృతిని, ఆచార, సాంప్రదాయాలను ఎవ్వరూ మార్చలేరని, అలా ప్రయత్నించిన వారు అంతమవుతారని, కానీ దేశం ఎన్నటికీ నిలిచే ఉంటుందని సిఎం కెసిఆర్‌ అన్నారు. సమయం వచ్చినప్పుడు దేశాన్ని రక్షించుకోవడానికి శక్తిని కాకుండా యుక్తిని ప్రయోగించాలన్నారు. ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితులను మార్చేందుకు తాను దేశ రాజకీయాల్లోకి ప్రవేశించానని,మహారాష్ట్ర ప్రజలు బిఆర్‌ఎస్‌ పార్టీకి ఘనంగా స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. తన అంచనాలకు మించి ప్రజాదారణ లభిస్తున్నదన్నారు. ఈ దేశం సరైన నాయకునికి కోసం, పార్టీ కోసం వేచి చూస్తున్నదనేది స్పష్టమైందన్నారు.
పదేళ్లలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఖర్చు చేసింది రూ.12 వందల కోట్లే
ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ పదేళ్ల కాలంలో మైనార్టీలకు కేవలం రూ. 1200 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మైనార్టీలకు గత తొమ్మిదేళ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టిందని కెసిఆర్‌ వివరించారు. మొత్తం దేశంలో సాగు చేసిన 66 లక్షల 40 ఎకరాల వరి సాగు విస్తీర్ణం కంటే ఒక తెలంగాణలోనే పండించిన వరి సాగు విస్తీర్ణం చాలా ఎక్కువ అని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం తాగునీరు, కరెంటు సమస్యలు లేవని, నిరుద్యోగ సమస్యను కూడా మెల్లమెల్లగా తొలగించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వి. శ్రీనివాస్‌ గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మండలి వైస్‌ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, బేతి సుభాష్‌ రెడ్డి, కాలేరు వెంకటేష్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్‌, పలువురు కార్పోరేషన్ల చైర్మన్లు, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, బాక్సింగ్‌ క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా తొలుత ఎల్‌బి స్టేడియంకు చేరుకున్న సిఎం కెసిఆర్‌ అనాధ పిల్లలతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు, వారి చదువు వివరాలను సిఎం అడిగి తెలుసుకున్నారు. వారి ఇంగ్లీషు భాషా పరిజ్జానాన్ని సిఎం అభింనందించారు. ఇంకా గొప్పగా చదవి ఉన్నతస్థాయికి చేరుకోవాలని భుజం తట్టారు. మైనార్టీస్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ షఫీ ఉల్లా, మైనార్టీస్‌ వెల్ఫేర్‌ ముఖ్యకార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎ.కె.ఖాన్‌ సిఎం కెసిఆర్‌కు ఘన స్వాగతం పలికి, జ్ఞాపికతో పాటు భారతదేశ పటంలో సిఎం కేసీఆర్‌ను చిత్రించిన ఫోటోను బహుకరించారు. ఇఫ్తార్‌ విందును అందించి రోజా’ను విరమింపజేశారు.అనంతరం ప్రముఖులతో కలిసి సిఎం ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments