ప్రజాపక్షం / హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు చిరు జల్లులు కురువనున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణం గా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం ఈదురు గాలులతో వాతావరణం ఒక్క సారిగా చల్లబడనుంది. ఈ ప్రభావం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఆదిలాబాద్, ఖమ్మం,జోగులాంబ గద్వాల, సూర్యాపేట జిల్లాలలో జల్లులు కురుస్తాయి. శుక్రవారం నుండి రాష్ట్రంలో ఒక్క సారిగా వాతావరణం చల్లబడటంతో పాటు పలు చోట్ల చిరు జల్లులు కురిశాయి. రెండు రోజుల నుండి కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో చిరు జల్లులు కురువడమే కాకుండా ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. గడచిన రెండు రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలి, ఈదురు గాలుల తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి. చిరు జల్లులతో మారిన వాతావరణం కారణంగా సోమ, మంగళ వారాల్లోనూ వాతావరణం చలిగానే ఉండి ఉష్ణోగ్రతలు కూడా తగ్గనున్నాయి. చలికాలంలో వర్షాలు కురువడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది చలికాలం వింతైన అనుభవాలనే చూపిస్తోందంటున్నారు. చలికాలం ప్రారంభమైన మొదట్లో అంతగా ప్రభావం చూపక పోవడంతో ఈ సారి చలి తక్కువగా ఉంటుందని అందరూ భావించారు. అయితే పెథాయ్ తుఫాను తర్వాత చలికాలంలో ట్రెండ్ మారింది. ఎన్నడూ లేనంతగా తెలంగాణలో కొన్ని చోట్ల అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. సాధారణ చలి ఉండే ప్రాంతాల్లోని ప్రజలు సైతం ఈ సారి గజగజ వణికారు. పెథాయ్ తుఫాన్ కారణంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈదురు గాలులతో మళ్లీ చలి తీవ్రత ఎక్కువైన విషయం తెలిసిందే.
చిరు జల్లులు.. మరో 2 రోజులు
RELATED ARTICLES