మండిపడుతున్న ఫ్యాన్స్!
భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు అదరగొట్టింది. అన్ని విభాగాల్లో రెచ్చిపోయి ఆడింది. దీంతో టీమిండియా ఈ మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఏకంగా పది వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను ఆసీస్ పేసర్లు ముప్పుతిప్పలు పెట్టారు. టీమిండియాలో ఎవర్నీ క్రీజులో సరిగా కుదురుకోనివ్వలేదు. ఈ క్రమంలోనే రోహిత్, గిల్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు.క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన విరాట్ కోహ్లీ, జడేజా కూడా ఎక్కువ సేపు ఆడలేదు. దీంతో టీమిండియా కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు మాత్రం చెలరేగారు. టీ20 తరహాలో ఆడుతూ భారత బౌలర్లను ఒక ఆట ఆడేసుకున్నారు. ఇద్దరూ వేగంగా ఆడుతూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో కేవలం 11 ఓవర్లలోనే ఆస్ట్రేలియా జట్టు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందే ట్రావిస్ హెడ్ (51 నాటౌట్) గాల్లోకి కొట్టిన బంతిని క్యాచ్ పట్టడంలో మహమ్మద్ షమీ ఫెయిలయ్యాడు. తర్వాత సింగిల్ తీయడంతో మిచెల్ మార్ష్ (65 నాటౌట్) వచ్చి బౌండరీ బాది జట్టుకు విజయం అందించాడు. ఈ మ్యాచ్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. భారత బ్యాటర్లు కనీసం క్రీజులో సరిగా నిలబడలేకపోయిన పిచ్‌పై ఆసీస్ ఓపెనర్లు ఇలా చెలరేగడం చూసి షాకవుతున్నారు. అసలు ఈ రెండు జట్లు ఒక పిచ్‌పై ఆడారా? అని అడుగుతున్నారు. ఏదేమైనా ఈ విజయంతో మూడు వన్డేల సిరీసును ఆస్ట్రేలియా 1 సమం చేసింది. చివరి వన్డే చెన్నై వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కుతుంది. భారత్ ఇలాగే ఆడితే మాత్రం సిరీస్ చేజారడం ఖాయమని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.