ఫైనల్లో వృశాలి ఓటమి, టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
ముంబై: ప్రతిష్టాత్మక టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో లక్ష్యసేన్, అష్మిత చలిహ చాంపియన్స్‌గా నిలిచారు. మరోవైపు తెలుగమ్మాయి ఎనిమిదో సీడ్ వృశాలి గుమ్మడికి ఫైనల్లో చుక్కెదురైంది. పురుషుల డబుల్స్‌లో బి. సుమీత్ రెడ్డి, అర్జున్ జోడీ విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ లక్ష్యసేన్ (భారత్) 21-15, 21-10 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన కున్లవుట్ వితిద్‌సరన్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన లక్షసేన్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. తొలి గేమ్‌ను 21-15తో గెలుచుకున్న సేన్.. రెండో గేమ్‌లో మరింతగా చెలరేగి 21-10తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో అష్మిత చలిహ (భారత్) 21-16, 21-13తో ఎనిమిదో సీడ్ వృశాలి గుమ్మడి (భారత్)ను వరుస గేమ్లలో చిత్తు చేసి టైటిల్ దక్కించుకుంది. అంతకుముందు రోజు జరిగిన సెమీస్‌లో అష్మిత 21-19, 21-19తో థాయ్‌లాండ్‌కు చెందిన నాలుగో సీడ్ చాన్‌చిడా జుచారోన్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో హైదరాబాద్ ప్లేయర్ బి. సుమీత్ రెడ్డి, అర్జున్ రామచంద్రన్ ద్వయం 21-10, 21-16తో టాప్ సీడ్ జోడీ గోహ్ జీ ఫెయ్ (ఇండొనేషియా)పై విజయం సాధించి చాంపియన్స్‌గా అవతరించారు. మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్ జక్కంపూడి మేఘన జోడీకి షాక్ తగిలింది. తెలంగాణ క్రీడాకారిణి జక్కంపూడి మేఘన, పూర్వీషా రామ్ జంట 10-21, 11-21తో హాంగ్‌కాంగ్‌కు చెందిన రెండో సీడ్ జోడీ వింగ్ యంగ్, యెవుంగ్ టింగ్ జంట చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు.
చాంపియన్స్ లక్ష్యసేన్, అష్మిత
RELATED ARTICLES