వడగండ్ల వాన, గాలి దుమారం
పలు చోట్ల పిడుగులు
తడిసిన ధాన్యం, మొక్కజొన్న
నేలవాలిన వరి, మామిడి
జనగామ జిల్లాలో 21,559 వేల ఎకరాల్లో పంట నష్టం
ప్రజాపక్షం/ ఖమ్మం/వరంగల్/ జనగామ/సూర్యాపేట
రైతన్నపై ప్రకృతి పగ చల్లారినట్లు లేదు. గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, గాలి దుమారాలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా మామిడి, వరి, మొక్కజొన్న, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది మామిడి రైతులకు శాప కాలంగా మారిం ది. పూత ప్రారంభం నుంచి ఏదో ఒక విపత్తు మామిడి రైతును నష్టపరుస్తుంది. ఇప్పుడు కాయ పక్వానికి వచ్చి అమ్మాకానికి పెట్టిన దశలో గాలి దుమారానికి మొత్తం కాయలు నేలరాలాయి. కొన్ని తోటల్లో చెట్లకు ఒక్క కాయ కూడా మిగలలేదంటే ప్రకృతి ఎంతగా మామిడి రైతులను దెబ్బతీసిందో అవగతమవుతుంది. ఇప్పుడు రాలిన కాయలను కారుచౌకగా అమ్ముకోవాల్సిన దయనీయ స్థితి నెలకొంది. కాగా, శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో తీవ్రంగా పంటలకు నష్టం వాటిల్లింది. వరంగల్‌లో భారీగా పంటలు ధ్వంసమయ్యాయి. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి మండలం రైతు లు జనగాం- సూర్యాపేట రహదారి వేల్పుచర్ల వద్ద ఆదివారం ధర్నాకు దిగారు. ఆదివారం జిల్లాలో పలు చోట్ల వడగండ్ల వాన పడింది. మణుగూరు, గుండాల తదితర ప్రాంతాలలో పిడుగులు పడ్డాయి. మణుగూరు పట్టణంలో ఒకే ప్రాంతంలో మూడు పిడుగులు పడడం గమనార్హం. గుండాల మండలంలో పశువుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మరోవైపు జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యం శాపమైంది. అట్టహాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు, ఎగుమతుల విషయం పట్టించుకోవడం లేదు. గోనె సంచులు, లారీల సమస్యతో పాటు ఈ ఏడాది మిల్లర్లు కూడా ధాన్యం దిగుమతి విషయంలో సుముఖంగా లేరన్న ప్రచారం జరుగుతుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా పంట నష్టంరాష్ట్రంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులకు భారీ నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు అధికారులు చెబుతుండగా ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుమారు లక్ష ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలు పంటనష్టాన్ని మరింత పెంచుతున్నాయి. శనివారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వడగళ్ల వాన ఉమ్మడి జిల్లాలో బీభత్సం సృష్టించింది. చేతికందిన వరి, మొక్కజొన్న, మిరప పంట నీళ్ల పాలైంది. పసుపు, కూరగాయల పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండోరోజు ఆదివారం కూడా వర్షం కురియడంతో పంటలన్నీ నీటిలో మునిగిపోయాయి. ఈ ఏడు మార్కెట్‌లో మిరపకు మంచి ధర పలుకుతోంది. వండర్‌హాట్ రకం క్వింటాల్‌కు రూ.23 వేలు ధర పలుకుతుండడంతో రైతులు మిరప పంట సాగు చేయగా అకాల వర్షాలు చేతికొచ్చిన పంటను నీళ్లపాలు చేశాయి. ఎకరాకు రూ. లక్ష నుండి రూ.1.50 లక్షల పెట్టుబడి వ్యయం పెట్టిన రైతులు పంట మొత్తం వర్షార్పణం కావడంతో లబోదిబోమంటున్నారు. వరంగల్ జిల్లాలో దుగ్గొండి, గీసుకొండ, నల్లబెల్లి, నర్సంపేట, చెన్నరావుపేట, నెక్కొండ, ఖానాపురం, హనుమకొండ జిల్లాలో సంగెం, పరకాల, దామెర, నడికుడ, ఆత్మకూరు మండలాల్లో గణనీయంగా మిరప సాగు చేశారు. ఆయా మండలాల్లో వందల ఎకరాల్లో పూర్తిగా మిరప నీటి పాలై ఏమాత్రం అన్నదాతకు ఆశ లేకుండా చేసింది. దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపూర్, పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూరు మండలాల్లో మొక్కజొన్న పంట కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. ఒక్క వరంగల్ జిల్లాలోనే 13 మండలాల పరిధిలో 50 వేల ఎకరాలలో వివిధ పంటలు దెబ్బతినగా అత్యధికంగా 40 వేల ఎకరాలలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. అలాగే హనుమకొండ జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు చెబుతుండగా అత్యధికంగా ఐనవోలు మండలంలోనే పంట నష్టం జరిగింది. అలాగే ములుగు, భూపాల పల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలలో పంట నష్టం సుమారు 30వేల ఎకరాలకు పైగా పంట నష్ట జరుగవచ్చని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు.
జనగామలో వడగండ్ల బీభత్సం
జనగామ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. మూడు మండలాల్లో అపార నష్టాన్ని మిగిల్చింది. 21, 559 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అందులో 20వేల 320 ఎకరాల్లో వరి, 1232 ఎకరాల్లో మామిడి, 6 ఎకరాల్లో కూరగాయాలు దెబ్బతిన్నాయి. పంట నష్టంపై అధికారులు అంచనా వేయగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. బచ్చన్నపేట మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేస్తూ అటుగా వెళ్తున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని నిలదీశారు. జిల్లా కలెక్టర్‌తో పాటు టిపిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, టిపిసిసి సభ్యులు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితో పాటు సిపిఐ, సిపిఐ నాయకులు పంటలను పరిశీలించారు. పూర్తి స్థాయితో పరిహారం అందిస్తామని ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రి నుండి రాత్రి వరకు జనగామ జిల్లా వ్యాప్తంగా భారీ వడగండ్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 132.7 మిల్లీ మీటర్లు కురవగా సగటున 11.1 మిల్లీ మీటర్లు కురిసింది.
ప్రతి రైతుకు పరిహారం : ఎర్రబెల్లి
వడగండ్ల బీభత్సంతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వడగండ్ల వానతో పంట నష్టంపై ఆదివారం జనగామ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, వ్యవసాయ శాఖ అధికారి వినోద్‌కుమార్ ద్వారా పంట నష్టాన్ని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయి పరిశీలన చేశాయన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సహాయం అందుతుందన్నారు. నష్టాన్న స్వయంగా ముఖ్యమంత్రికి వివరిస్తామని తెలిపారు. ఈ సమీక్షలో కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లాలో ఐకెపి కేంద్రాల్లో తడిసిన ధాన్యం
సూర్యాపేట జిల్లాలో శుక్రవారం, శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడి వడగండ్ల వాన వరసగా పడింది. ఆదివారం సాయంత్రం మూడు గంటల నుండి తిరిగి ఈదురు గాలులతో వడగండ్ల వాన కురిసింది. జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గంలోని సూర్యాపేట రూరల్, పెన్‌పహాడ్, చివ్వెంల, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని మోతె, నడిగూడెం, హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని హుజూర్‌నగర్ రూరల్‌తో పాటు పలు మండలాల్లో పెద్ద ఎత్తున వరి పంట దెబ్బతింది.కోతకు వచ్చిన పంటలు నేలకు ఒరిగి గింజ రాలిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పంట నూర్పిడి చేసి రాసులు పోసిన ధాన్యం తడిసి ముదై పోవడంతో పాటు వరదలో కొట్టుకుపోయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి కేంద్రాల్లో రైతులు అమ్మకానికి తెచ్చిన ధాన్యం కాంటాలు కాకపోవడంతో పూర్తిగా తడిసిపోయింది. కనీసం అధికారులు ధాన్యంపు రాసులపై కప్పెందుకు తార్పల్లు ఇవ్వని పరిస్ధితి. ఇదిలా ఉంటే మామిడి తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో చెట్లకు ఉన్న కాయాలన్ని నేలరాలయ్యాయి. రహదారుల వెంట ఉన్న వృక్షాలు నేలకు ఒరిగిపోవడంతో అక్కడక్కడ రాకపోకడలకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలుల బీభత్సవానికి ట్రాన్స్ కో అధికారులు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. పంట నష్టం అంచనా వేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు వరసగా రెండు రోజులు సెలవు దినానాలు కావడంతో పాటు పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కూడా అవకాశం లేకుండా గత మూడు రోజులుగా గాలి వానలు ఉండటంతో చేసే అవకాశం కూడా పోయింది. గాలి బీభత్సవంతో ఆయా గ్రామాల్లోని రేకులు ఇండ్లపై ఉన్న కప్పులు లేచి పోయ్యాయి.
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డు ఎక్కిన రైతులు
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి మండలం రైతులు జనగాం- సూర్యాపేట రహదారి వేల్పుచర్ల వద్ద ఆదివారం ధర్నాకు దిగారు. శుక్రవారం రాత్రి కురిసిన వానతో తాము పండించిన పంటలు దెబ్బ తిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం కూడా పూర్తిగా తడిసిపోయిందన్నారు. దాదాపు గంటకు పైగా రైతులు రహదారిపై ఆందోళన చేపట్టడంతో రాకపోకలు పూర్తిగా స్తభించాయి. రైతులు చేపట్టిన ధర్నాకు సిపిఐ, సిపిఎం నేతలు తమ మద్దతును తెలిపారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసేంత వరకు హామీ ఇవ్వలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చల్లారనిప్రకృతి పగ
RELATED ARTICLES