ఎపికి క్యూ కట్టిన బెట్టింగ్ రాయుళ్లు
ప్రజాపక్షం/హైదరాబాద్; సంక్రాంతి వచ్చిందంటే బెట్టింగ్ రాయుళ్ల సంబరానికి కొదవేలేదు. బెట్టింగ్‌ల కోసం తహతహలాడే వీరికి సంక్రాంతి కోడి పందేలు ఒక వరంగా మారాయి. తెలంగాణలో కోడిపందేలపై పోలీసు ఆంక్షలు ఉండడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో జగుతున్న కోడి పందేలలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చెందిన బడాబాబులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు బెట్టింగ్ రాయుళ్లు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఎపిలోని గుంటూరు, విజయవాడ, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్న లాడ్జీలు, హోటళ్లు బెట్టింగ్‌రాయుళ్ల రాకతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వ పేకాట కేంద్రాలను మూసివేసిన విషయం తెలిసిందే. అప్పట్లో తెలంగాణలో ఉన్న పేకాట కేంద్రాలలో వేలాది మంది పేకాటరాయుళ్లు ప్రతి రోజు సుమారు రూ.20 కోట్లకుపైగానే బెట్టింగ్‌లు పెట్టేవారని అంచనా. అయితే ఇక్కడ పేకాట కేంద్రాలు మూసివేయడంతో బెట్టింగ్ రాయుళ్ల ఆటకు బ్రేక్ పడింది. ప్రతి రోజు బెట్టింగ్‌లు పెట్టి ఆట ఆడే వీరు అసంతృప్తితో ఉన్నారు. ఇక ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజున ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు సాగే కోడి పందేలలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతి ఏటా వీరంతా అక్కడికి వెళ్లి కోడి పందేలలో పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లు పెట్టి తమ సంతోషాన్ని తీర్చుకుంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాలకు చెందిన కొందరు బెట్టింగ్ రాయుళ్లు గ్రూప్‌లుగా ఏర్పడి విహార యాత్రకు వెళ్లినట్లు కోడి పందేలలో పాలు పంచుకుంటున్నారు. కోడి పందేలలో తెలంగాణ వారు పాల్గొంటుండడంతో వీరి కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోడి పందాలలో ఎపిలో పెద్దగా ఆంక్షలు లేకపోవడం వల్లనే తాము అక్కడికి వెళ్లి బెట్టింగ్‌లు పెడుతున్నామని కొందరు వాపోతున్నారు. బెట్టింగ్‌లో తాము డబ్బు సంపాదించాలనో కాకుండా తమ వ్యసనాన్ని తీర్పుకునేందుకే వెళ్తున్నామని, తమకు ఈ రకంగా సంతోషం కలుగుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోడి పందాలలో పాల్గొనే వారిలో కొందరు తెలంగాణ పందెం కోళ్లను తమ వెంట తీసుకెళ్లారు.